పారదర్శకతపై ప్రజాప్రతినిధుల మౌనం
నవతెలంగాణ – పరకాల
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో నిర్వహించిన సభలు వివాదాస్పదంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ ఆధ్వర్యంలో 5, 6, 7, 8 మరియు 17వ వార్డులలో ఈ సభలను ఏర్పాటు చేశారు. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రభుత్వ పథకాల అమలు, వార్డుల్లో అభివృద్ధి పనుల గుర్తింపు లక్ష్యంగా వీటిని నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే, ఈ కార్యక్రమాల నిర్వహణ తీరుపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా పాలనలో పారదర్శకత ఉండాలని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సభల నిర్వహణకు సంబంధించి మీడియాకు, కనీసం ప్రజలకు కూడా ముందస్తు సమాచారం అందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే సమావేశాలకు మీడియాను ఆహ్వానిస్తే, వార్డుల్లోని సమస్యలు, అధికారుల పనితీరు,ఆయా వార్డులలో ఉండే లోసుగులు బయటపడతాయని మున్సిపల్ పాలకవర్గం భయపడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. పారదర్శకంగా జరగాల్సిన సమావేశాలను అత్యంత రహస్యంగా, నామమాత్రంగా ముగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.
పక్కా ప్రణాళికతో, పారదర్శకంగా జరగాల్సిన ప్రజా పాలన కార్యక్రమాల్లో ఇలాంటి గోప్యత పాటించడం పాలకవర్గం వైఫల్యానికి నిదర్శనమని విమర్శకులు పేర్కొంటున్నారు. సభల నిర్వహణ కంటే, తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల సమక్షంలో తూతూ మంత్రంగా ముగించడం ద్వారా అభివృద్ధిని కాగితాలకే పరిమితం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నా, అసలైన ప్రజా సమస్యల కంటే మమ అనిపించడానికే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ వార్డు సభల పారదర్శకతపై అధికారులు, పాలకవర్గం స్పష్టత ఇవ్వాలని, రాబోయే రోజుల్లోనైనా మీడియా సమక్షంలో సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.



