– ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా ప్రక్షాళన (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ లు) చురుగ్గా పనిచేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం దమ్మపేట, అశ్వారావుపేట, వినాయకపురం, కొత్త మామిళ్లవారిగూడెం, తిరుమలకుంట, లంకాలపల్లి (అంకంపాలెం), జగ్గారం, నాగుపల్లి, నాచారం, మొద్దులగూడెం గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హులు, బోగస్ ఓట్లను తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారనే అపోహలకు తావివ్వవద్దని, ఇది పూర్తిగా ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగమేనని స్పష్టం చేశారు.
అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని 120 మంది బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓ లు) ఈ నెల 25 వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఓటరు కి రెండు ఎన్యూమరేషన్ ఫారమ్‌లు అందజేస్తారని, వాటిని 2022 ఓటరు జాబితా తో సరిచూసుకుని అవసరమైన వివరాలు నింపి, కలర్ ఫొటో జతచేసి సంతకం చేసి సంబంధిత బీఎల్‌ఓ లకు తిరిగి అందజేయాలని సూచించారు.
పూర్తి చేసిన ఫారమ్‌లను సమర్పించిన వారి పేర్లే ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటరు జాబితాలో నమోదు అవుతాయని చెప్పారు. ఒకవేళ డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే పుట్టిన తేదీ, జన్మస్థలాన్ని నిర్ధారించే పత్రాలతో తిరిగి కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
ఓటరు జాబితా ప్రక్షాళనలో కాంగ్రెస్ బీఎల్ఏల పాత్ర కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండి బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ ఇంటింటి సర్వేను పర్యవేక్షించాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదేనని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు, పాత్రికేయులు సమష్టిగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు, బీఎల్ఏలు, గ్రామస్థులు పాల్గొన్నారు.



