Saturday, May 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహక్కుల రక్షణకు ఐక్యంగా కదలాలి

హక్కుల రక్షణకు ఐక్యంగా కదలాలి

- Advertisement -

శ్రామిక వర్గాన్ని మళ్లీ బానిసత్వంలోకి నెట్టేందుకు కుట్ర : వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌
యుద్ధాలతో ప్రపంచ కార్మికవర్గంపై భారాలు : పాలడుగు
సీఐటియూ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
మేడే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్మికదినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు
పెట్టుబడిదారీ, కార్పొరేట్‌, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం మరో చారిత్రాత్మక పోరాటానికి సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్‌, హిందుత్వ శక్తులు చేతులు కలిపి దేశ సంపదను కొల్లగొడుతున్నాయని విమర్శించారు. ఉపాధి హామీ వంటి సంక్షేమ పథకాలను బలహీనపరుస్తున్నారని, నయా వలస విధానాలతో దేశ వనరులను ఆక్రమించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ లాభాల వేటలో సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు. యుద్ధాల ప్రభావంతో ఇంధన కొరత, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, పాలకులు మాత్రం ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ‘మేడే అనేది దానంగా వచ్చింది కాదు.. రక్తం చిందించి, పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం అది. కానీ నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌ల ద్వారా పని గంటలను 12 గంటలకు పెంచి, కార్మికులను మళ్లీ బానిసత్వంలోకి నెట్టాలని చూస్తోంది” అని విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి రెడ్‌ కార్పెట్‌ పరుస్తోందని విమర్శించారు. విదేశీ కంపెనీల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌లను తెచ్చారని, ఇది శ్రామిక వర్గ ఆత్మగౌరవంపై దాడి అని పేర్కొన్నారు. రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వి. రమ, సీఐటీయూ సీనియర్‌ నాయకులు మాట్లాడుతూ.. మేడే కేవలం ఉత్సవం కాదు, అది ఒక ప్రతిజ్ఞా దినమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్‌, ఎం. పద్మశ్రీ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌. అరుణ జ్యోతి, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారధి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌ఎస్‌ఆర్‌ఏ ప్రసాద్‌, యాటల సోమన్న, ఎ.సునీత, నాయకులు లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఏఎస్‌రావునగర్‌లో ర్యాలీ..
కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెడుతోందనీ, అందులో భాగంగానే కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్లను తీసుకొచ్చిందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. మే డే సందర్భంగా శుక్రవారం ఏఎస్‌రావు నగర్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ నుంచి ఈసీఐఎల్‌ చౌరస్తా మీదుగా కమలానగర్‌లోని సీఐటీయూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాటం : చుక్క రాములు
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. మేడే వేడుకలు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఘనంగా జరుపుకొన్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌, మెదక్‌, సిద్దిపేటలో ఘనంగా వేడుకలు జరిగాయి. సంగారెడ్డిలో జరిగిన మేడే వేడుకల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోడీ రద్దు చేశారని ఆరోపించారు. ఫర్మినెంట్‌ వ్యవస్థ లేకుండా చేస్తూ స్కీం వర్కర్లు, అప్రెంటిషిఫ్‌ , న్యాప్స్‌, న్యాట్స్‌ తీసుకువచ్చి శ్రమదోపిడికి పాల్పడుతున్నారని విమర్శించారు.

ప్రగతినగర్‌లో ర్యాలీ.. వీరయ్య హాజరు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిజాంపేట సర్కిల్‌ ప్రగతి నగర్‌లో మున్సిపల్‌ కార్యాలయం నుంచి సుందరయ్య భవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌. వీరయ్య పాల్గొన్నారు. అనంతరం జెండావిష్కరణ చేసి సభలో ప్రసంగించారు. నాగారం డివిజన్‌ పరిధిలోని బోగారం ఇండిస్టియల్‌లో మేడే వేడుకల్లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ పాల్గొన్నారు. బాగ్‌లింగంపల్లిలోని ఎస్‌వీకేలో మేడే సందర్భంగా చలివేంద్రాన్ని సీనియర్‌ నాయకులు సాంబిరెడ్డి ప్రారంభించారు. అనంతరం జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వీకే కార్యదర్శి ఎస్‌. వినయకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -