భయంలేని స్వేచ్ఛా తెలంగాణ కావాలి భావవ్యక్తీకరణ లేదు:భట్టివిక్రమార్క

We want a free and fearless Telangana No expression, Bhattivikramarka– ప్రయివేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లుండాలి:ఈటల
– కిరాయాదార్లంకాదు..జిమ్మెదార్లం:అక్భరుద్దీన్‌
– కేసీఆర్‌ను కన్నది తెలంగాణ: బాల్క సుమన్‌
– వాడీవేడిగా అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం..స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’ పై ఆదివారం చోటుచేసుకున్న స్వల్పకాలిక చర్చ వాడీవేడిగా సాగింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన చర్చ సీఎం కేసీఆర్‌ సమాధానంతో ముగిసింది. ఎంఐఎం సభ్యులు అక్భరుద్ధీన్‌ ఓవైసీ చర్చకు శ్రీకారం చుట్టగా, కాంగ్రెస్‌ సభ్యులు భట్టివిక్రమార్క ముగించారు. ఇందులో బీఆర్‌ఎస్‌ సభ్యులు బాల్క సుమన్‌, పెద్దిరెడ్డిసుదర్శన్‌రెడ్డి, బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్‌ సైతం పాల్గొన్నారు. వివరాలు వారి మాటల్లోనే..
భయంలేని తెలంగాణ కావాలి: భట్టివిక్రమార్క.
రాష్ట్రంలో స్వేచ్ఛకరువైంది. భావవ్యక్తీకరణ లేదు. భయం లేకుండా ఉండాలి. పదేండ్ల తెలంగాణ సాధనలో అందరమూ భాగస్వాములమే. ఆత్మగౌరవం, స్వేచ్ఛ ఎంతవరకు ఉందో ఒకసారి పరిశీంచుకోవాలి. అనుకున్నదేంటి..సాధించేంటి..చేయాల్సిందేంటి ? తదితర విషయాలు సమీక్షించుకోవాలి. గోదావరి, కృష్ణానదుల పరివాహక ప్రాంతాల్లో సమస్యలు ఇంకా ఉన్నాయి. అటవీ భూముల నుంచి గిరిజనుల నుంచి పట్టాలు వెళ్లగొడుతున్నారు. ఇప్పటికీ వారిపై కేసులు పెడుతున్నారు. ఐటీడీఏలను నిర్వీర్యం చేశారు. పెండ్లీలు సైతం చేయలేకపోతున్నారు. అటవీ భూములు వారికే ఇచ్చేయాలి. పాసుబుక్కులు అందించాలి. ధరణిలో గిరిజనుల పేర్లు రావడం లేదు. ఫార్మాసీటీ, బహులజాతీ కంపెనీల కోసం గిరిజనులపై ఒత్తిడి చేస్తున్నారు. అసైన్డ్‌ భూములను తీసుకుని వెంఛర్లు వేస్తున్నారు. వృత్తి మీద బతికే గిరిజనులపై దౌర్జన్యం సరికాదు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నది. ఉద్యోగాలు రావడం లేదు. ప్రత్యేకంగా కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథపై భారీగా ఖర్చుపెట్టారు. వాటిలోనూ లోపాలున్నాయి. కడెం, కుమ్రంభీమ్‌ ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా లేదు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ మార్చడంతో నష్టం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు ఆగిపోయాయి. కృష్ణా కాలువను పూర్తిచేస్తే నల్లగొండకు నీళ్లు ఇవ్వొచ్చు. ప్రజల మధ్య అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. ఆస్థులను సృష్టించడంతోపాటు ఉపాధి అవకాశాలు పెంచాలి. కేంద్రంలోని బీజేపీ ఉపాధి హామీ నిధులను తగ్గించింది. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలనే డిమాండ్‌ నేను చేసిన పాదయాత్రలో వచ్చింది. గ్రామపంచాయతీ, మిషన్‌ భగీరథ, ఐకేపీ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి.
ప్రయివేటులో రిజర్వేషన్లుండాలి:ఈటల రాజేందర్‌
ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో పేదలకు రిజర్వేషన్లు ఉండాలి. అక్కడ ఉండే భారీ ఫీజులను పేద విద్యార్థులు చెల్లించలేని పరిస్థితి ఉంది. దీంతో ఉన్నత విద్య వారికి దూరమవుతున్నది. నాలుగు లక్షల నుంచి 12 లక్షల వరకు డోనేషన్లు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో సజ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఆపోస్టులను భర్తీ చేయాలి. పేద విద్యార్థులకు చదువుకునేందుకు అవకాశముండాలి. 41 సంవత్సరాలు దాటిన గెస్ట్‌ లెక్చరర్లను రెగ్యులర్‌ చేయాలి. వరదల్లో నష్టపోయిన భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పేద రైతులకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేయాలి. రైతు భీమా పక్కాగా అమలుచేయాలి.
కిరాయదార్లంకాదు: అక్భరుద్ధీన్‌ ఓవైసీ
ముస్లీంలు దేశంలోగానీ, రాష్ట్రంలో గానీ కిరాయదార్లు కాదు..జిమ్మేదార్లం. మాకు హిందువుల్లానే హక్కులున్నాయి. మత ఘర్షణలు రాష్ట్రంలో లేవు. గౌరవం ఉంది. కేవలం 50 లక్షల జనాభా రాష్ట్రంలో ఉంటే, రూ. 2000 కోట్లకుపైగా బడ్జెట్‌ కేటాయించారు. ఆదే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో దారుణ పరిస్థితులున్నాయి. ఇక్కడ బుల్డోజర్‌ లేదు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇస్తున్నారు. వివక్ష మంటల్లో హరియాణా, మణిపూర్‌ మండుతున్నాయి. ప్రభుత్వ భూమికి వేలం వేస్తే ఎకరం రూ. 100 కోట్లు పలకడం ఇక్కడి అభివృద్ధికి సూచిక. ప్రాణంపోతే ఉద్యోగమిచ్చారు. లౌకీకత్వాన్ని కాపాడుకోవాలి. టోపీ పెట్టేవాళ్లకు, తిలకం దిద్దేవాళ్లకు, పగిడి ధరించేవారికి తెలంగాణలో సమానగౌరవం ఉంది. మేము ఎవరి ‘బీ’ కాదు. సీఎం కేసీఆర్‌ నుంచి నేర్చుకోవాలి. మైనార్టీల విద్యకోసం ఎస్సీఎస్టీలతో సమానంగా నిధులు ఇస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి నడిపారు. ఘర్‌వాపసీ లేదు.
కేసీఆర్‌ను కన్నది తెలంగాణ :బాల్క సుమన్‌, పెద్దిరెడ్డి
స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ కారణజన్ముడు. తెలంగాణ కేసీఆర్‌ను కన్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది. అహర్నిశల పోరాటంతోనే సాధ్యమైంది. కేసీఆర్‌ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో నినాదంతో ఉద్యమిస్తే సొంత రాష్ట్రం సాకారమైంది. తెలంగాణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. దళితుల కోసం కేసీఆర్‌ అనేక పథకాలు తెచ్చారు. ఉద్యమనేతనే ప్రభుత్వాధినేతగా ఉంటే అభివృద్ధి సుళువవుతుంది. ఇప్పటి తెలంగాణే నిదర్శనం. యావత్తు దేశాన్ని ఒప్పించి తెలంగాణను తెచ్చిండు కేసీఆర్‌. వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది. అవినీతిలేని ఆర్థిక భరోసాను కేసీఆర్‌ ఇచ్చారు. ఉప్పుసత్యాగ్రహాం తరహాలో జరిగిన మహాగర్జన ప్రపంచాన్ని ఆకర్షించింది.

Spread the love