వరద సాయం కింద నెల వేతనం విరాళమిస్తాం

– మోరంచపల్లి మునిగినా పట్టదా : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మోరంచపల్లి పూర్తిగా వరదలో మునిగిపోయినా, తిండికీ అక్కడ ప్రజలు అలమట్టిస్తున్నా సీఎం కేసీఆర్‌కు పట్టదా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా మహారాష్ట్రకు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీకి చెందిన ముగ్గురం ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీ నెల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని, చెక్కును అందజేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా ముందుకు రావాలని కోరారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేండ్లలో పాత బస్తీలో 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు లైన్‌ వేయలేనివారు..ఇప్పుడు కొత్తగా 270 కిలోమీటర్ల దూరం మెట్రో రైలు వేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే ఆ ప్రకటన అని విమర్శించారు. రూ.600 కోట్లతో కడెం ప్రాజెక్టు రిపేర్లు చేయాలని పాండ్య కమిటీ సూచించిందనీ, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును క్యాబినెట్‌ ఆమోదించలేదని విమర్శించారు. కడెం ప్రాజెక్టు రిపేర్లకు 70 శాతం నిధులు ఇస్తామని కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ కమిటీ ఉందా? అని ప్రశ్నించారు. రాజకీయ విపత్తు నిర్వహణ మీద ఉన్న శ్రద్ధ ప్రకృతి విపత్తు మీద కేసీఆర్‌ మీద లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఒకే నెలలో అన్ని రకాల పోటీ పరీక్షలు నిర్వహించడం సరిగాదనీ, పరీక్ష తేదీలను మార్చాలని కోరారు. ఆర్టీసీ భూములను అమ్ముకునేందుకు ప్రభుత్వంలో విలీనం చేశారని ఆరోపించారు. అన్న కొడుకుకు ప్రమోషన్‌ కోసమే కేసీఆర్‌ మహారాష్ట్రకు వెళ్లారని విమర్శించారు. మునుగోడుపై ఉన్న శ్రద్ధ, మహారాష్ట్ర మీద ఉన్న ఆసక్తి… మోరంచపల్లి మీద ఎందుకు లేదు లేదని నిలదీశారు.

Spread the love