అమెరికా మిత్రదేశాలనూ వదలం
అవసరమైతే అణ్వాయుధాలను తయారు చేస్తాం : ‘ఆర్థిక యుద్ధం’ బెదిరింపులపై ఇరాన్
టెహ్రాన్ : తన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి వాషింగ్టన్ తాజా ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలకు మరింత ప్రమాదాన్ని కలిగించేలా ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది. డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, షిప్పింగ్ వంటి రంగాలలో ఇరాన్‌కు సాయపడుతున్న వాణిజ్య భాగస్వాములపై జరిమానాలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పగా చెప్పుకున్న ‘ఎకనమిక్ డి-డే’ చర్యల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రజలకు ఆశాభంగం తప్పలేదు. ఎందుకంటే ఇరాన్‌పై అమెరికా ఎలాంటి కొత్త ఆంక్షలు విధించలేదు. ప్రస్తుతం ఉన్న ఆంక్షల అమలునే తీవ్రతరం చేసింది. ఇరాన్‌తో సంబంధాలను తెంచుకునేందుకు ఇష్టపడని దేశాలపై కఠినమైన జరిమానాలు విధిస్తానని హూంకరించింది.
చదరంగంతో పాటు బాక్సింగ్ కూడా ఆడుతున్నాం
అయితే అమెరికా ఉడత ఊపులకు ఇరాన్ ఏ మాత్రం భయపడడం లేదు. ప్రతీకార చర్యలకు దిగేందుకు తనకు సామర్ధ్యం ఉన్నదని చాటుకుంటోంది. ప్రాంతీయ చమురు ఉత్పత్తిదారులు, ఐరోపా దేశాలపై దాడులను విస్తరిస్తామని హెచ్చరించింది. అణు కార్యక్రమాన్ని ఆయుధంగా మారుస్తానని సంకేతాలు పంపింది. ‘చాలా కాలం నుంచి చదరంగం ఆడుతున్నాం. బాక్సింగ్ ఎలా ఆడాలో కూడా నేర్చుకున్నాం. కొంతకాలంగా ఈ రెండింటినీ కలిపి ఆడుతున్నాం’ అని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై వ్యాఖ్యానించారు. ఇరాన్ గత కొన్ని నెలలుగా హార్ముజ్ జలసంధిని మూసేసి చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. దీంతో ప్రాంతీయ దేశాలకు చమురు, గ్యాస్ ఎగుమతులు దాదాపుగా ఆగిపోయాయి. మరోవైపు ఎర్ర సముద్రంలో సౌదీ చమురు ఎగుమతులను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని హౌతీలు కొత్తగా యుద్ధాన్ని మొదలు పెట్టారు. హార్ముజ్ వెలుపల ఉన్న ఇంధన లక్ష్యాలపై దాడులు చేస్తామని ఇరాన్ సైనికాధికారులు తాజాగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఇతర చమురు రవాణా మార్గాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఖబడ్దార్
‘ఆర్థిక యుద్ధం కొనసాగితే హార్ముజ్ ద్వారా, పర్షియన్ గల్ఫ్ నుంచి ఒక్క చమురు చుక్క కూడా ఎగుమతి కాదు’ అని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నేత మొహసేన్ రెజాయి స్పష్టం చేశారు. భూకంపం మాదిరిగా విరుచుకు పడతామని, ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఇరాన్ నేతలు చెబుతున్నట్లు ప్రతీకార దాడులు జరిగిన పక్షంలో అంతర్జాతీయ చమురు ధరలు భగ్గుమంటాయి. అమెరికాలోని పెట్రోలు బంకులలో గ్యాసోలిన్ ధరలు కూడా పెరగవచ్చు. సౌదీ, కువైట్, యూఏఈ దేశాలకు చెందిన చమురు కంపెనీలు ఇరాన్ అధికారుల కంట పడకుండా ఉండడానికి అమెరికా సాయంతో ట్యాంకర్లలోని ట్రాన్‌పాండర్లను ఆపేస్తున్నాయి. తద్వారా స్వల్ప పరిమాణంలో అయినా చమురును ఎగుమతి చేస్తున్నాయి. మరోవైపు సౌదీ అరేబియా ఎర్ర సముద్రం మీదుగా చమురును రవాణా చేస్తోంది. దీంతో ఇరాన్ అధికారులు 45 నౌకల జాబితాను ప్రకటించి అవి తమ లక్ష్యాలుగా ఉన్నాయని తెలిపారు. తమ నిబంధనలను ఉల్లంఘించే నౌకలు భవిష్యత్తులో జరిమానాలు, నిర్బంధాలు, జప్తులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంధనాన్ని నింపే విమానాలు బల్గేరియా నుంచి బయలుదేరడాన్ని గుర్తించిన ఇరాన్… ఆ దేశాన్ని కూడా వదలబోమని చెప్పింది.
సామర్థ్యాన్ని చాటుకుంటున్న టెహ్రాన్
యుద్ధ సమయంలో ఇరాన్ ప్రధానంగా గల్ఫ్‌లోని 11 దేశాలపై దాడులు చేసింది. సైప్రస్‌లో బ్రిటన్ దళాలు ఉపయోగించే స్థావరంపై కూడా దాడి జరిపింది. అంతేకాక హిందూ మహా సముద్రంలో వందల మైళ్ల దూరంలో అమెరికా దళాలు ఉపయోగించే ద్వీపాలను కూడా చేరుకోగల సామర్ధ్యం తనకు ఉన్నదని నిరూపించింది. ఇరాన్ ప్రజలపై అమెరికా సాగిస్తున్న ఆర్థిక యుద్ధంలో భాగస్వామి అయినా లేదా పోరుకు మద్దతు ఇచ్చినా దానిని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని రెజాయి తేల్చి చెప్పారు. అణ్వాయుధాన్ని తయారు చేయడానికి ఉపయోగించే శుద్ధి చేసిన అర టన్ను యురేనియం ఇరాన్ భూభాగంలో పాతి పెట్టి ఉంది. దీనికి సీలు వేయడానికి ఇరాన్ ముమ్మరంగా ప్రయత్నిస్తోందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నదని రెజాయి ఓ అరుదైన ప్రకటన కూడా చేశారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి వైదొలగడానికి ఉద్దేశించిన బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ ప్రస్తుతం చర్చిస్తోంది. అయితే అమెరికా యుద్ధాన్ని ఎదుర్కోవడానికి మనం అణ్వాయుధాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రెజాయి చెప్పారు.



