ఆరా తీస్తున్న అమెరికా అధికారులు
వాషింగ్టన్ : హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అమెరికాలోని తన పెట్టుబడిదారులకు అదానీ గ్రూప్ ఏం చెప్పిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై అమెరికా సెక్యూరిటీలు-ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ), న్యూయార్క్‌లోని అటార్నీ కార్యాలయం అధికారులు ఆయా పెట్టుబడిదారులను ప్రశ్నించడం ప్రారంభించారు. అదానీ గ్రూపులో అమెరికాకు చెందిన సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతమైన తర్వాత వీరందరితోనూ అదానీ గ్రూప్ సంప్రదింపులు జరిపింది. కాగా తన పెట్టుబడిదారులను అమెరికా అధికారులు ప్రశ్నిస్తున్నారన్న విషయంపై సమాచారం లేదని అదానీ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. గౌతమ్ అదానీ నేతృత్వంలోని కంపెనీలపై భారత్‌లో ఇప్పటికే విచారణ జరుగుతోంది. కంపెనీ వాటాల ధరలు పెరుగుతాయంటూ ఇన్వెస్టర్లను మభ్యపెట్టడం, ఖాతాలలో మోసాలు తదితర ఆరోపణలపై అదానీ గ్రూపును విచారిస్తున్నారు.
అయితే అమెరికాలో జరిగే విచారణలు పెద్దగా ఫలితాలు ఇవ్వవని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా సంస్థలు విచారణలు జరిపినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవని వారు అంటున్నారు. అవి కేవలం సమాచారం మాత్రం అడుగుతాయి. దాని ఆధారంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు.