– రెజ్లర్లు అంటే మీకు అంత చిన్న చూపా..?
– బేటీ బచావో..బేటీ పడావో కాగితాలకే పరిమితం
– జులై 7నుంచి 9వరకు హైదరాబాద్‌లో ఐద్వా కేంద్ర కమిటీ సమావేశాలు
– ఆగస్టులో చలో ఢిల్లీ : ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు సుధాసుందర్‌రామన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కార్ తొమ్మిదేండ్ల పాలనలో మహిళలను తీవ్రంగా మోసగించిందనీ, కేంద్ర ప్రభుత్వం వారికి ఒరగబెట్టిందేమీ లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ఉపాధ్యక్షులు సుధాసుందర్‌రామన్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఉపాధ్యక్షులు టి జ్యోతి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మితో కలిసి ఆమె మాట్లాడారు. తొమ్మిదేండ్ల కాలంలో ప్రజలకు ఎంతో చేశానని ప్రధానమంత్రి చెబుతున్నారు కదా..! మహిళల అభివృద్ధికి ఏం చేశారో నిర్దిష్టంగా చెప్పాలని ప్రశ్నించారు. ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక సమస్యలు ఈ కాలంలో పెద్ద ఎత్తున ముందుకొచ్చాయని వివరించారు. మోడీ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ పేదలకు అందనంత ఎత్తుకు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.400 ఉన్న గ్యాస్ ధర రూ.1200కు పెరిగింది నిజం కాదా? అని ప్రశ్నించారు.సబ్సిడీలు ఎత్తివేసి మహిళలను మోసం చేశారని విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలోని మోడీ సర్కార్‌లో మహిళల ఉపాధి తగ్గిందన్నారు. అసంఘటిత రంగంలోనే ఏదో ఒక పని చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో భద్రత లేదనీ, కార్మిక చట్టాల రద్దువల్ల శ్రామిక మహిళల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. లైంగిక వేధింపులకు నిరసనగా ఆరు నెల్లుగా ఆందోళన చేస్తున్న మహిళా మల్లయోధుల ఆక్రందనను ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు.
చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారనీ, అందులోనూ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొక్సో కింద అభియోగాలు లేకుండా చేశారని తెలిపారు. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్ హింసకు బీజేపీ విభజన రాజకీయాలే కారణమని చెప్పారు. దీంతో వేలాది మంది మహిళలు తమ ఇండ్లను వదిలి పునరావాసా కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బేటీ బచావో..బేటీ పడావో నినాదం కాగితాలకే పరిమితమైందని సుధాసుందర్‌రామన్ ఈ సందర్భంగా చెప్పారు. కెప్టెప్ లక్ష్మిసెహగల్, మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తితో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జులై 7నుంచి 9వరకు హైదరాబాద్ నగరంలో ఐద్వా జాతీయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామనీ, ఈ సమావేశాల్లో మోడీ ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాల గురించి చర్చిస్తామని చెప్పారు. ఆగస్టులో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
రాష్ట్రంలో పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలి-మల్లు లక్ష్మి
రాష్ట్రంలో లక్షలాది మంది పేదలు ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మల్లు లక్ష్మి తెలిపారు. అర్హులైన అందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టిస్తామంటూ సీఎం కేసీఆర్ 2014లో ప్రకటించారని గుర్తు చేశారు. కానీ..ఆచరణలో ఆ హామీ అమలు కాలేదని చెప్పారు. రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇండ్ల జాగా ఉన్న వారికి రూ.మూడు లక్షల ఆర్థికం సాయం చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. దాన్నీ అమలు చేయలేదని విమర్శిం చారు. ఈ నేపథ్యంలో ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 22జిల్లాల్లో 64 కేంద్రాల్లో భూపోరాటాలు కొనసాగుతున్నాయని చెప్పారు. పేదలు గుడిసెలు వేసుకుంటే..ప్రభుత్వ యంత్రాగం అత్యంత దుర్మార్గంగా వాటిని తొలగిస్తోందని చెప్పారు. ఈ పోరాటంలో పాల్గొంటున్న వారిలో 80శాతం మంది మహిళలే ఉన్నారని వివరించారు. ఎంతో మందిపై అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. పేదలకు ప్రభుత్వం వెంటనే ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలనీ, తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28నుంచి వచ్చే రెండో తారీఖువరకు భూపోరాట కేంద్రాల్లో దీక్షలు, మూడో తారీఖున కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహంచాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఐద్వా ఉపాధ్యక్షులు కెఎన్ ఆశాలత, వినోద తదితరులు పాల్గొన్నారు.