ఆత్మనిర్భరత ఏది?

– రక్షణ రంగంలో తగ్గుతున్న పెట్టుబడులు
– దిగుమతుల పైనే ఆధారం
– పట్టించుకోని మోడీ ప్రభుత్వం
చండీఘర్‌ : దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ రంగంలో బీజేపీ ప్రవచిస్తున్న ‘ఆత్మనిర్భరత’ ఎక్కడా కానరావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు గడిచినా మూడు త్రివిధ దళాలనూ సైనిక సామగ్రి కొరత వేధిస్తూనే ఉంది. భారత సైనిక పాటవంపై ఇది ప్రతి కూల ప్రభావం చూపుతోంది. పొరుగున ఉన్న అణు, శత్రు దేశాల నుండి అణుక్షణం భద్రతా పరమైన ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రక్షణ సామగ్రి కొరత అధికంగా ఉంటోందని త్రివిధ దళాలు 2014 నుంచి పదేపదే ప్రభుత్వానికి మనవి చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఆ కొరతను కనీసం పాక్షికంగా తీర్చేందుకు కూడా ప్రయత్నాలు జరగలేదు. ఇప్పటి వరకూ భారత సాయుధ దళాలకు రష్యా కీలకమైన ఆయుధ సామగ్రిని, విడి భాగాలను సరఫరా చేస్తోంది. అయితే ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అమె రికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ దేశం నుంచి సరఫరాలు సరిగా జరడం లేదు.
దేశ రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వ అలసత్వంపై సైనిక విశ్లేషకుడు మేజర్‌ జనరల్‌ ఏపీ సింగ్‌ మండిపడ్డారు. జాతీయవాదం గురించి బీజేపీ పదేపదే గొప్పలు చెబుతోందని, అయితే అదే సమయంలో భారత సైనిక సామ ర్ధ్యాన్ని పెంచలేకపోతోందని ఆయన చెప్పారు. 2014 తర్వాత భారత స్థూల జాతీ యోత్పత్తి (జీడీపీ)లో సైనిక దళాలకు వార్షిక కేటాయింపు లు రెండు శాతం కూడా దాటలేదని ఓ అధికారి తెలిపారు. దేశీయంగా సైనిక అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ఆత్మనిర్భరత చర్యలు అందుకు ఏ మాత్రం దోహదపడలేదని ఆయన విమర్శించారు. భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల కొరత అధికంగా ఉంది. రెండు లేక అంతకంటే ఎక్కువ యుద్ధ విమానా లను, వాటిని నడిపేందుకు అవసరమైన సిబ్బందిని కలిపి స్క్వాడ్రన్‌ యూనిట్‌ అంటారు. వైమానిక దళానికి ఇలాంటి యూనిట్లు 42 అవసరం కాగా ప్రస్తుతం 29 మాత్రమే ఉన్నా యి. వీటి సంఖ్య కూడా రానురానూ మరింత తగ్గిపోతోంది. వీటితో పాటు మిడ్‌-ఎయిర్‌ రిఫ్యుయలర్స్‌, రోటరీ వింగ్‌ యుద్ధ విమానాలు, అదనపు యుద్ధ పరికరాలు కూడా తగిన సంఖ్యలో లేవు. ఇక నౌకాదళం విషయానికి వస్తే సముద్ర జలాలలో కార్యకలాపాలు సాగించే సంప్రదా యక యుద్ధ నౌకల కొరత ఎక్కువగానే ఉంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో పని చేసేందుకు విశ్వ సనీయమైన సిబ్బంది లేకుండా పోయారు. వ్యూహాత్మక హిందూ మహాసముద్రంలో కార్య కలాపాల కోసం అరవై ఐదు వేల టన్నుల బరు వుండే యుద్ధ విమానాన్ని తీసికెళ్లే సామర్ధ్యం కలిగిన వాహక నౌకను దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయాల్సిన అవసరం ఉన్నదని నౌకా దళం కోరుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
ఇక సాయుధ దళాల డిమాండ్ల చిట్టా చాంతాడంత బారున ఉంది. తుపాకులు, యుద్ధ ట్యాంకులు, పదాతి దళాలకు అవసర మైన వాహనాలు కావాలని సాయుధ దళం అడుగుతోంది. అత్యాధునిక ఆయుధాలు అవస రమని కోరుతున్నప్పటికీ రక్షణ శాఖ పట్టించు కోవడం లేదు. ఇది సాయుధ దళాల సామర్ధ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. సాంకేతి క పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు విదేశీ ఉత్పత్తి దారులతో కలిసి స్థానిక ప్రైవేటు లేదా ప్రభుత్వ విక్రేతతో వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమా నికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. అయితే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అసలు ఈ కార్యక్రమంతో ఒరిగేదే మీ ఉండదని, సమయం వృథా అవడం తప్పిం చి ఏమీ జరగదని బ్రిగేడియర్‌ భోన్స్‌లే వ్యాఖ్యా నించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయ డానికి విదేశీ ఉత్పత్తిదారులు ఇష్టపడరని ఆయన చెప్పారు. త్రివిధ దళాల అవసరాల కోసం విదేశాల నుండి దిగుమతులను తగ్గించు కొని దేశీయ ఉత్పత్తులపై దృష్టి సారిస్తామని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుం దని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. అయితే దేశీయంగా ఉత్పత్తి చేస్తామని చెబుతున్న జాబితాలో నట్లు, బోల్టులు, స్క్రూలు, వాషర్లు, బుష్‌లు, క్లాంపులు, గాస్కెట్లు వంటి చిన్న చిన్న సామగ్రి ఉండడం భారత్‌ వంటి పారిశ్రామిక దేశానికి అవమానకరమని సైనిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆత్మనిర్భరత గురించి పదే పదే వల్లె వేస్తున్నప్పటికీ రక్షణ దిగుమతులలో మన దేశం అగ్రస్థానంలో ఉంది. 2018-22 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆయుధ దిగుమతులలో భారత్‌ వాటా 11 శాతంగా ఉంది. 2014లో తాము అధికారం లోకి వచ్చిన తర్వాత సాయుధ దళాల కోసం గుండుసూది మొదలుకొని యుద్ధ విమానం వరకూ కొనుగోలు చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత సంవత్సరం మార్చ్‌లో పార్లమెంటుకు తెలిపారు. యుపీఏ ప్రభుత్వం తన హయాంలో రక్షణ దళాల కోసం ఏమీ కొనలేదని కూడా చెప్పారు. అయితే యూపీఏ హయాంలో 142 రక్షణ ఒప్పందాలు కుదిరా యి. ఆ కాలంలో త్రివిధ దళాల కోసం 600 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు కొనుగోలు చేశారు. అయితే ఈ వాస్తవాన్ని కప్పిపెట్టి పార్ల మెంట్‌ సాక్షిగా ఆర్థిక మంత్రి అసత్యాలు వల్లె వేశారు. దేశీయ పరిజ్ఞానంతో రక్షణ అవసరా లను తీర్చుకునే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రక్షణ నిపుణు లు అభిప్రాయపడ్డారు. స్థానికంగా నట్లు, బోల్టు లు తయారు చేసే విషయంపై శ్రద్ధ పెడితే రక్షణ రంగంలో స్వావలంబన ఎలా సాధ్యపడు తుందని వారు ప్రశ్నించారు. ఆత్మనిర్భరత కార్య రూపం దాల్చాలంటే ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు,పరిశోధనలు అవసరమవుతాయి.

Spread the love