మత రాజ్యంలో…మహిళ!

In the kingdom of religion...woman!ఓ నా పవిత్ర దేశమా..!!
నీకు మరోసారి శిరసా నమామి
మహిళగా ఇక్కడ పుట్టినందుకు
నిస్సిగ్గుగా నీరాజనాలు
అర్పించుకుంటున్న..!
”యత్ర నార్యంతు పూజ్యతే
రమంతే తత్ర దేవతా’ అంటారు
ఏదీ..!!?అదేదీ కానరాదే నా పుణ్య భూమిన
వల్లించేందుకు అల్లిన కల్లబొల్లి కల్పితాలు..
”బేటీ బచావో,బేటీ పడావో”
ఏది ఎక్కడా..!?
అంతరంగం నుంచి వెలువడని
ఆ పదాల అమలు కనబడదే..!?
”ధృతరాష్ట్ర పాలనలో
ద్రౌపదీ అవమానం ఎవరికి
వినబడుతుందని”.!
అయినా..నా దేశం పవిత్ర దేశమే
భారతీయులందరూ నాసహోదరులే
నేనే కానిదాన్ని..!
నా కర్మభూమి నడిగడ్డ మీద
సార్వభౌమాధినేత కూడా
ఓ గిరిజన మహిళనే..!
అయినా మణిపూర్‌
మారణకాండ చల్లారదు..
ఏవో కొన్ని చట్టాలూ,
న్యాయాలూ ఉంటాయి
వాటిని అమలుపరిచే చిత్తశుద్ధి ఏదీ!?
”వెనకటికెవరో చక్రవర్తి
రోమ్‌ నగరం తగలబడుతున్నా
ఫిడేల్‌ వాయించాట్ట”
అలా ఉంది ఏలికల తీరు
సుమోటోగా రాని న్యాయం
ఎవరికోసమో ఎందుకోసమో
అంతకన్నా..ఆదిమ జాతుల్లోనే నయం
అప్పటికప్పుడే కన్నుకు కన్నూ
పన్నుకు పన్నూ తీర్పు..
ఏ మూల చూసినా.. ఏ రోజు చూసినా
ఏముంది గర్వకారణం
మహిళలపై అత్యాచారాల పర్వాలే
పైగా పైకి పొక్కకుండా
ఎప్పటికప్పుడూ వాటిని
మెత్తి కమ్మెయ్యరూ.!?
మణిపురా..మహారాష్ట్రనా..
గుజరాతా కాదు అడుగడుగునా
ఆడవాళ్లపై అఘాయిత్యాలే..!
మహిళలనిక్కడ వివస్త్రలను చేసి
ఊరేగించి హింసించడం
అనాదిగా వస్తున్న సనాతన ధర్మం కదా
కండ్ల ముందటే సామూహిక దాడి
కిమ్మన్న నాధుడు కరువాయే..!
అన్నట్టు..మీకు తెలియదేమో
ఇక్కడ మహిళలని ప్రతిమలుగా ఉంటేనే
పూజిస్తారు, ఆరాదిస్తారు,అభిషేకిస్తారు
ప్రాణాలతో కంటబడితే,
వెంటాడి వేటాడి అంతు చూడరూ.!
డెబ్భై ఐదేండ్లయినా స్వతంత్ర స్వర్ణోత్సవ భరతమా..!
నీ మత మదాంధ రాజకీయ ఎత్తుగడలలో
మహిళలెప్పటికీ పావులేనా..!!
– నాంపల్లి సుజాత
9848059893

Spread the love