‘మోడీ గ్యారంటీ’ రాజదండనే!

బీజేపీ ఎన్నికల ప్రణాళిక దేశ ప్రజలకు ఒక సవాలు. ఎంతటి నేరమైనా ‘బాజాప్తా చెప్పే చేస్తాను… నన్నెవరు ఆపగలరో చూస్తా…’ అన్నంత అహంభావంతో ప్రజల మీదకు విసిరిన ఆయుధం అది. ప్రజల దృష్టి మరల్చి, దొంగదెబ్బ తీసేందుకు చేస్తున్న దుస్సాహసం ఇది. పేదరికం దాదాపు నిర్మూలించాననీ, ఈ పదేండ్లలో వాగ్దానాలన్నీ అమలు చేసాననీ, అభివృద్థి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాయని చెప్పటం దుస్సాహసం కాక ఏమవుతుంది? అంతటితో ఆగలేదు. దేశంలో ఆర్థిక, సామాజిక పరివర్తన సాధించాననీ చెప్పుకున్నది. అవినీతిని చట్టబద్ధం చేసిన బీజేపీ, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, తల దించుకోవల్సింది పోయి, అవినీతి వ్యతిరేక పోరాటం కొనసాగిస్తామనటం హాస్యాస్పదం. సంక్షేమ చర్యలన్నీ వీరి దృష్టిలో ‘ఉచితాలు’. ఇవి ఉండకూడదని సుప్రీంకోర్టుకు చెప్పారు కదా! అందువల్ల పెద్దగా ఆ వాగ్దానాలు చేయలేదు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్ధిష్ట పరిష్కారాలు చూపలేదు. నియంతృత్వం, మతరాజ్యం నిర్మాణానికి మాత్రం ఈ ప్రణాళిక నిర్దిష్ట మార్గ నిర్దేశం చేసింది. ప్రజలు ఆగ్రహిస్తే నేరం నాది కాదు… మోడీదే అని తప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి బీజేపీ గ్యారంటీలు కాదు. మోడీ గ్యారంటీలు మాత్రమే!
మోడీ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేసారట. అదే నిజమైతే, 80కోట్ల మందికి పైగా ఇంకా ఐదేండ్లు ఉచిత బియ్యం అమలు చేస్తానని ఎందుకు చెప్పారో వారికే తెలియాలి. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 నుంచి 1200లకు పెంచిన వీరు మహిళలకు ఉచిత గ్యాస్‌ గురించి మాట్లాడటం ఆశ్చర్యకరం. గత 50ఏండ్లలో అత్యధిక నిరుద్యోగం మోడీ పాలనలోనే అయినా యువతకు కోట్లాది నూతన అవకాశాలు కల్పించామని చెప్పుకున్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు, నాయకులు చెప్పినట్టు, పకోడీలు అమ్ముకుని కూడా బతికే మార్గం చూపించి ఉండవచ్చు. మేక్‌ ఇన్‌ ఇండియా అర్భాటమే తప్ప ఆచరణలో సాధించింది లేదు. మోడీ పాలనలో తయారీ రంగం ఉత్పత్తి వాటా దేశ ఆర్థిక వ్యవస్థలో 17 నుంచి 13శాతానికి దిగజారింది. ఉపాధి అవకాశాలు కల్పించే రంగం దుస్థితి ఇది. ఇప్పటికే ఉన్న అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వంటి స్కీం వర్కర్ల రంగాలను వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు శ్రామిక మహిళల సంఖ్య పెరుగుతుందని మోడీ గ్యారంటీ! పైగా అవి స్థిరత్వాన్నిచ్చే ఉద్యోగాలు కాదు. విద్య, వైద్యం, పర్యాటకం, చిల్లర వ్యాపారం, ఐటి వంటి రంగాలలో స్వయం సహాయక గ్రూపులుగా పనులు చేసుకుని బతకాలన్నారు. పేరుకు మాత్రం చట్టం చేసి అమలు చేయకుండా దాచిపెట్టిన మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని ఘనకార్యంగా చెప్పుకున్నారు.
వాగ్దానాలన్నీ అమలు చేసారట! రైతుల ఆదాయం రెట్టింపయ్యిందా? ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలేమైనాయి? విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ఎన్ని కుటుంబాల ఎకౌంట్లలో రు.15లక్షల చొప్పున వేసారు? ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు నిర్మించారా? చరిత్రలో ఎప్పుడూ లేనంత అధిక సంఖ్యలో మహిళల మీద లైంగిక దాడులు జరిగాయి. మణిపూర్‌ ఆదివాసీ మహిళల దుస్థితి జగమెరిగినదే. మహిళలకు భద్రత అంటే ఇదేనా? కుల దురహంకార దాడులు తారస్థాయికి చేరాయి. సామాజిక న్యాయం అంటే ఇదేనా? కులగణనకు నిరాకరిస్తూ బీసీ కమిషన్‌ గురించి మాట్లాడటం ఎవరిని నమ్మించడానికి? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడిని కప్పిపుచ్చుతూ ఉగ్రవాద రహిత దేశం గురించి ‘మోడీ గ్యారంటీ’ అనే అర్హత వీరికి లేదు. అందరికీ నిర్బంధోచిత విద్య ప్రస్తావన లేదు. నూతన విద్యా విధానం పేరుతో విద్యను కార్పొరేటీకరిస్తూ నాణ్యమైన విద్య గురించి మాట్లాడుతున్నారు. బడా వైద్య సంస్థలను ప్రోత్సహిస్తూ ఆరోగ్య భారత్‌ గురించి మోడీ గ్యారంటీ అనటం మోసపూరితం. కార్మిక చట్టాలు రద్దు చేసి ‘శ్రామిక బంధు’ అనటం ఎవరిని నమ్మించడానికి? వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల ఊసులేదు. పెన్షన్‌ హక్కు మీద, సౌకర్యాల మీద దాడి చేస్తూనే వృద్ధుల గురించి మొసలి కన్నీరు కార్చారు. ప్రపంచ మార్కెట్‌లో అతి తక్కువ ధరలకు పెట్రోలియం ఉత్పత్తులు దొరికిన సమయంలో, ఇక్కడ అత్యధిక ధరలతో ప్రజల నడ్డి విరిచిన బీజేపీ ప్రభుత్వం, ప్రపంచ ధరల దెబ్బ నుంచి దేశ ప్రజలను కాపాడామని అంతర్జాతీయ స్థాయి అబద్ధం చెప్పగలిగింది.
కార్మికుల కోసం ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకం (ప్రొడక్షన్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌) గురించి కంపెనీలలో వింటాం. కానీ మోడీ ప్రభుత్వం ఈ పేరుతో, ప్రభుత్వ ఖజానా నుంచి బడాబాబుల కోసం బడ్జెట్‌లో రూ.6200 కోట్లు కేటాయించింది. మోడీ పాలనలో ఆదానీ ఆస్తి రు.53వేల కోట్ల నుంచి రూ.17లక్షల 30వేల కోట్లకు పడగలెత్తింది. అంబానీ సంపద పది లక్షల కోట్లు దాటింది. టాటా, బిర్లాల గురించి చెప్పనవసరమే లేదు. మరోవైపు మోడీ ప్రభుత్వం కార్మికుల క్షేత్రస్థాయి కనీస వేతనం రోజుకు రూ.178 చాలంటున్నది. దేశం అత్యంత అసమానతలతో ఉన్నదని అంతర్జాతీయ నివేదికలు ఘోషిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు బ్రిటిష్‌ పాలనా కాలం కన్నా తీవ్రమైనాయని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్త స్టిగ్లిట్జ్‌ నేతృత్వంలో జరిగిన అధ్యయనాలు తేల్చాయి. ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగుపరచకుండా దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామంటున్నారు. అంటే బడాబాబుల సంపద అనేక రెట్లు పెరుగుతుందన్నమాట. ఇందుకోసం ప్రపంచీకరణ పేరుతో నాల్గవ తరం ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలు జరుపుతామని ప్రణాళికలో చెప్పారు.
ప్రజల అసంతృప్తిని అణచివేయవచ్చుననీ, లేదా పక్కదారులు పట్టించవచ్చని వీరి ధైర్యం. వనరులన్నీ జీఎస్టీ పేరుతో కేంద్రం గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి సంస్థలను ప్రయోగించి తమను వ్యతిరేకించేవారిని లొంగదీసు కుంటున్నారు. బ్లాక్‌ మెయిల్‌ సాధనాలుగా వాడుతున్నారు. ‘సుపరి పాలన’ పేరుతో రాజుల కాలం నాటి ‘రాజదండం’ చేబూనిన మోడీ ఫొటో ప్రణాళికలో ముద్రించారు. బీజేపీ గెలిస్తే దేశం భవిష్యత్తుకు ఇదే సూచిక. అందుకే ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అమలు చేస్తామన్నారు. మరోవైపు ప్రపంచంలో విస్తరిస్తున్న తమ ‘ఖ్యాతి’ గురించి చెప్పుకున్నారు. వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ అందించామన్నారు. మన దేశంలో వేలాదిమంది మరణిస్తున్నప్పటికీ, బడాబాబులు వ్యాక్సిన్‌ విదేశాలకు ఎగుమతి చేసి రూ.వేలకోట్లు గడించేందుకు కేంద్రం సహకరించిన విషయం ప్రజలు మరచిపోయారని వారి నమ్మకం. అంతరిక్ష పరిశోధనలో తమ పాత్ర ఏమీ లేకపోయినా… ఆరు దశాబ్దాల కృషి ఫలితమైన ‘చంద్రయాన్‌ 3’ ఖ్యాతిని తమ ఖాతాలో రాసుకున్నారు. ఇక్కడ తగిన ఉపాధి లేక ఇతర దేశాలకు పోయిన మేధస్సు గురించి మోడీకి బాధ లేదు. అలాంటి వారంతా సాధికారత సాధించి, ప్రపంచంతో అనుసంధానం అయినట్టు చెప్పి వీరు గర్విస్తున్నారు. ఇవన్నీ చెప్పటం ద్వారా జాతీయ దురభిమానం పెంచుతున్నారు. అభివృద్ధి పేరుతో బడాబాబులను పెంచి పోషిస్తున్నారు. వారసత్వం పేరుతో చరిత్రను వక్రీకరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను ప్రభావితం చేయటం ద్వారా ప్రజల ఆలోచనల మీద పట్టు బిగించాలని ప్రయత్నిస్తున్నారు. మధ్యతరగతి సాధికారత గురించి నొక్కిచెప్పేది అందుకే. వీరికోసం గృహవసతి, రియల్‌ ఎస్టేట్‌ సవరణలు, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, మధ్యతరగతి జీవన సౌలభ్యం, ఆధునిక రోడ్లు, రైళ్ళు, ఎయిర్‌పోర్టులు, 6జిల గురించి రాసి పంచరంగుల చిత్రం చూపించారు.
అసంతృప్తి చెందిన ప్రజల దృష్టి మరలించేందుకు రాముడిని, మతాన్ని వాడుకుంటున్నారు. ఓటు బ్యాంకు కోసం మతపరమైన విభజన సృష్టిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో కూడా రామాలయం, మతపరమైన భావోద్వేగాలు పెంచే ఎత్తుగడలు వాడుకున్నారు. ఎన్నికల సంఘం ఎందుకు కండ్లు మూసుకున్నదో అర్ధం కాదు. సమస్యల పరిష్కారంలో విఫలమైన మోడీ ప్రభుత్వం రాముడి పేరు చెప్పి తప్పించుకోజూస్తున్నది. సంస్కృతి, మత స్థలాల పునరుద్ధరణ, రాముని వారసత్వం నిక్షిప్తం చేయటం, ప్రోత్సహించటం, సాంస్కృతిక పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో చేయబోతున్న చర్యలు ప్రస్తావించారు. పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో అనుభవంలోకి వచ్చేదాకా అర్ధం కాదు. అదే వీరి ధైర్యం. కామన్‌ సివిల్‌ కోడ్‌, పౌరసత్వ సవరణ చట్టం అమలు గురించి చెప్పారు.
దేశ సమతుల్యాభివృద్ధి గురించి చెపుతూనే జాతీయ సమగ్రతను విస్మరించారు. ఈశాన్య భారతం గురించి రాస్తూ హిందూ భావన కలిగించే ఫొటోలు పొందుపరిచారు. ఎన్నికల ప్రణాళికలో నిలువు నామాలతో రుషి రూపంలో కనిపించే విధంగా మోడీ ఫొటో ముద్రించారు. ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి? ప్రజలు తమ సమస్యలు మరచిపోయి ఆధ్యాత్మిక భావనతో సర్దుకుపోవాలని బీజేపీ కోరిక. కానీ దేవుడి గురించి, మతం గురించి చెప్పడానికి మత గురువులున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకాలున్నాయి. ప్రజలెన్నుకున్న ప్రధానమంత్రీ, ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా బీజేపీ కూడా ఇవే చెప్పడాన్ని ప్రజలు అంగీకరించజాలరు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన వీరికి మళ్లీ అధికారంలో కొనసాగే అర్హత లేదని గుర్తిస్తారు. కానీ భజనపరులనే తప్ప ప్రశ్నించేవారిని మోడీ సహించరు. నిజం చెప్పేవారిని నిలువనీయరు. తన చుట్టూ ఉన్నవారంతా మోడీని పొగడ్తలతో ముంచెత్తేవారే. కార్పొరేట్‌ మీడియా కూడా తన ప్రయోజనం కోసం ఇదే చేస్తున్నది. అందుకే ప్రజలంతా మోడీ మత్తులో ఉన్నారని మోడీ నమ్ముతున్నారు. ఆయనతోబాటు బీజేపీ కూడా అదే నమ్ముతున్నది. ఈ నమ్మకాలను వమ్ము చేసే శక్తి ప్రజల చేతుల్లోనే ఉన్నది.

– ఎస్‌ వీరయ్య

Spread the love