వేధిస్తున్న ప్రశ్న

A nagging questionవిద్యార్థులు.. దేశ భావి పౌరులు. నాణ్యమైన మానవ వనరులుగా మారి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సినవారు. అలాంటి విద్యార్థులు ఇంటర్‌ ఫలితాలు వెలువడిన వెంటనే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపాటుకు గురిచేస్తున్నది. రైతుల ఆత్మ హత్యలను మించి విద్యార్థుల బలవన్మరణాలు చోటుచేసు కోవడం మరింత ఆందోళన కలిగిస్తున్తది. దీనికి కారణం చదువుల ఒత్తిళ్లా?.. తల్లిదండ్రుల ఆకాంక్షలను తీర్చలేక పోతున్నామనే భయమా? ఏం చేస్తే విద్యార్థుల ఆత్మహత్యలు ఆగుతాయనేది సర్వే సర్వత్రా వేధిస్తున్న ప్రశ్న.
ఇంటర్‌ ఫలితాల వెల్లడి తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం వంటి ఘటనలు విద్యార్థులు పడుతున్న మానసిక సంఘర్షణను స్పష్టంగా చెబుతున్నా యి. ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఎదురవుతున్న సమస్య కాదు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఏటా విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతున్నది. జాతీయ నేర నమోదు విభాగం- 2023 గణాంకాల ప్రకారం ఒక్క 2022లోనే దేశ వ్యాప్తంగా పదివేలకు పైగా 18ఏండ్లలోపు వారే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2022లో జరిగిన ఆత్మహత్యల్లో దాదాపు 8శాతం విద్యార్థులవే. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలలో విద్యార్థి ఆత్మహత్యలు సైతం ఒకటి. సమాజ ప్రగతిలో విద్యారంగం పాత్ర అతి ప్రధానమైనది. భవిష్యత్‌ సమాజ నిర్మాణానికి ఉపయోగపడేలా మానవ వనరులను అభివృద్ధి పరచడం విద్యా సంస్థల ప్రధాన బాధ్యత. ప్రాథమిక స్థాయిలో అందుకు సంబంధించిన బీజాన్ని విద్యార్థుల్లో నాటడంలో వాటిదే కీలక భూమిక.
తెలిసీ తెలియని వయసులో ఒత్తిడిని తట్టుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఈ ఘటనలు రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రమవుతున్నాయే తప్ప… అందుకు గల కారణాలను లోతుగా అధ్యయనం చేసి, దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడంలో వ్యవస్థలు వైఫల్యం చెందాయి. ప్రస్తుతం విద్యాబోధన విద్యార్ధి కేంద్రంగా జరగడం లేదనేది నిర్వివాదాంశం. ముఖ్యంగా ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమ మార్కెట్‌ను మరింతగా విస్తరించుకోవడం కోసం మార్కులు, ర్యాంకులే ధ్యేయంగా విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతు న్నాయి. తమ పిల్లలు మెరుగైన ఉద్యోగాల్లో స్థిరపడాలనే కోరికతో తల్లిదండ్రులు సైతం అందుకు సహకరిస్తున్నారు.
కానీ, విద్యార్థులు పడుతున్న మనోవేదనను ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. మెరుగైన ఫలితాలు రాకపోతే ఏమంటారోనని కొందరు, తల్లిదండ్రులు తమపై పెంచు కున్న ఆశలను నెరవేర్చలేకపోతున్నామని మరికొందరు ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, భరోసా కల్పించేవారు లేక అంతర్గత సంఘర్షణకు లోనవుతూ చివరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇందుకు మారుతున్న పరిస్థితుల్లో వారి కుటుంబ నేపథ్యం, సామాజిక, ఆర్ధిక స్థితిగతులు విద్యార్థుల్లో మానసిక ఆందోళన కూడా కారణాలు అవుతున్నాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి విద్యా సంస్థలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. మారుతున్న పరిస్థితిలో ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలను మాత్రమే పాఠ్యప్రణాళికల్లో చేరుస్తూ సామాజికాంశాలు, మానవీయ విలువలు, జీవన నైపుణ్యాలు వంటి నిజజీవితానికి సంబంధించిన అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. దీంతో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, భావోద్వేగాలకు లోనవుతూ అర్ధాంతరంగా అసువులు బాస్తున్నారు.
2019లో ఇంటర్‌ ఫలితాల తర్వాత 27మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడంతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం అన్ని జూని యర్‌ కళాశాలల్లో కౌన్సిలర్లను నియమించుకోవాలని ఆదేశించినప్పటికీ అది అమలుకు మాత్రం నోచుకోలేకపోయింది. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థులే కేంద్రంగా విద్యా భోధన జరిగేలా విధానాలను రూపొందించి అమలు పరచాలి. నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక స్థితిగతులపై నిత్యం పర్యవేక్షణ అవసరం. అప్పుడే విద్యార్థుల సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి పరిష్కార మార్గాలను చూపగలుగు తాం. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని పెంపొందిం చాలి. అప్పుడే స్వతహాగా తమ సమ స్యలను తామే పరిష్కరించుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేసినప్పుడే విద్యార్థుల సమ్మిళిత అభివృద్ధి సాధ్యం. ‘పరీక్షలు శిక్షలు కాదు..నీ సామర్ధ్యం తెలుసుకునే ఒక ప్రయత్నం మాత్రమే’ అని చెప్పి ధైర్యపు మందు పోసే వారే కావాలిప్పుడు. ఆ దిశగా ప్రభుత్వం, విద్యాశాఖ చర్యలు చేపట్టాలి. అప్పుడే విద్యార్థుల ఆత్మహత్యలు లేని రాష్ట్రాన్ని, దేశాన్ని చూడగలుగుతాం.

Spread the love