విశాల గుమ్మలూరు… మొదటి నుండి తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేది ఆమె తపన. అలాగే సొంత ఊరి కోసం ఏదైనా చేయాలనే కోరిక. ఆ కోరికతోనే ‘నా ఊరు విజయనగరం’ పేరుతో ఓ స్వచ్చంధ సంస్థ స్థాపించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. అంతే కాకుండా కొన్ని స్వచ్చంధ సంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ఆ కార్యక్రమాలలో భాగంగా ప్లాస్టిక్ వాడవద్దు అని ప్రచారం చేసేవారు. ‘ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు, మరి ఏం వాడాలి?’ అని ప్రజలు ఎదురు ప్రశ్నించేవారు. ఆ సమస్యకు పరిష్కారంగా పుట్టిందే నిసర్గ. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం…
విశాలది విజయనగరం. అమ్మ సన్యాసమ్మ, గృహిణి. తండ్రి యు.ఏ నరసింహం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల టీచర్స్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా పని చేసేవారు. ఈమెకు ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క. తండ్రిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. వారి ప్రభావం ఆమెపై ఉండేది. మహిళలు ఎప్పుడూ తమ కాళ్ళపై తాము నిలబడాలి, ఆర్థిక స్వలంభన కలిగి ఉండాలి అంటుండే వారు. అందుకే ఆమె ‘నా ఊరు విజయనగరం’ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. పెండ్లి తర్వాత హైదరాబాద్ వచ్చారు.
ప్లాస్టిక్ లేకుండా…
విశాల తమ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించే వాళ్ళు. అలాగే ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేవాళ్ళు. కానీ వాటి స్థానంలో ఏం వాడాలి అని ప్రజలు అడిగేవారు. అయితే అప్పట్లో నానో విన్ బాగ్స్ వుండేవి. వీటి గురించి చెబుదామా అంటే ఇవి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ కాదు. తర్వాత గుడ్డ సంచులు, పేపర్ బాగ్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రజలు అప్పటికే ప్లాస్టిక్‌కి బాగా అలవాటు పడి పోయారు. ఇంకో ప్రొడక్ట్ ఏదైనా వస్తే అది ప్లాస్టిక్‌కి పూర్తి ప్రత్యామ్నాయంగా ఉండాలి. అంటే బరువు ఆపాలి, పట్టుకోవడానికి తేలికగా ఉండాలి, తడిని ఆపగలగాలి… ఇలా ఎన్నో సౌకర్యాలు ఆ వస్తువులో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్లాస్టిక్ లేకుండా ఇన్ని సౌకర్యాలున్న ప్రొడెక్ట్ కోసం ఆమె పరిశోధన మొదలు పెట్టారు. విశ్వ ప్రయత్నాలు చేసినా తర్వాత చెరుకు గడ గుజ్జు, మొక్కజొన్న గుజ్జు ద్వారా చేయబడిన గ్రాన్యూల్స్ ద్వారా బయో డి గ్రేడబుల్ బాగ్స్ చేయవచ్చు అనే విషయం గుర్తించారు.
పూర్తి స్థాయిలో అవగాహన
ప్రొడెక్ట్ అయితే దొరికింది… మరి వీటిని ఎవరు డీల్ చేస్తున్నారు, ఎక్కడ దొరుకుతాయో తెలుసు కోవాలి. అందుకే ఆ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న వారితో కొన్నాళ్ళు పనిచేసి అవగాహన తెచ్చుకున్నారు. అలాగే వీటికి మార్కెటింగ్ ఎలా ఉంది, దానిలోని మంచి, చెడులేంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనే అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుని బ్యాంక్ లోన్ తీసుకుని ‘నిసర్గ’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. కుటుంబ సహకారం ఉన్నప్పటికి ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. అలాగే చేశారు. అయితే ఈ గ్రాన్యూల్స్ విదేశాలలో మాత్రమే దొరుకుతాయి. ఈమె బొంబాయిలోని ఒక డీలర్ ద్వారా తెప్పించుకున్నారు.
కుటుంబ సహకారంతో…
నిసర్గ అంటే ప్రకృతి అని అర్ధం. ఇది సంస్కృత పదం. నిసర్గ బ్రాండ్‌ని ఇంకా విస్తరించేందుకు విశాల ప్రయ త్నిస్తూ ఉన్నారు. తన సంస్థను ‘నిసర్గ గ్రూప్ ఆఫ్ కంపనిస్’గా చేయలనేదే ఆమె సంకల్పం. తన భర్త ప్రసాద్ రావు కూడా ఎంతో తోడ్పాటు అందిస్తుంటారు. ఒక్కొక్క సారి వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి హాశిత కూడా ఆమెకు ధైర్యం చెబుతుంది. తన గురించి ఆలోచించ వద్దని, వ్యాపార పనులు అన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకుని రమ్మని అంటుంది. భర్త వ్యాపారంలో పూర్తి సహకారం అందిచడం కాక, కుటుంబ బాధ్యతలు కూడా చూస్తుంటారు. తన భార్య వ్యాపారంలో రాణించేందుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు.
ఒకరిపై ఆధారపడొద్దు
ప్రస్తుతం వీరి దగ్గర మిషనరీ నడపటానికి మహిళలు ఎవరూ లేరు. పురుషులే వున్నారు. దీనిపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నారు. ‘మేము తయారు చేస్తున్న ప్రొడక్ట్ నూటికి నూరు శాతం బయో డీ గ్రేడబుల్. దీని మీద చాలా పరిశోధనలు జరిగాయి. నీటిలో కానీ, మట్టిలో కానీ ఆరు నెలల్లో పూర్తిగా కలిసిపోతాయి. మేము కూడా మా ప్రొడక్ట్‌ని టెస్ట్ చేసిన తర్వాత సిపెట్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా లైసెన్సు, సర్టిఫికేట్ పొందాము. మహిళలు ఒకరిపై ఆధారపడి బతక కూడదు. ప్రతి మహిళకు ఆర్ధిక స్వాతంత్య్రం తప్పక ఉండాలి. మహిళలు సాధించలేనిదంటూ ఏది లేదు. వాస్తవానికి పురుషుల కంటే ఎక్కువ కష్ట పడగలరు. తమ సత్తా ఏమిటో చాటగలరు. అందుకే మహిళలు ఎప్పుడూ తమని తాము ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోకూడదు’ అంటూ విశాల తన మాటలు ముగించారు.
గర్వంగా ఫీల్ అవుతున్నా
మొదటిసారి నేను ఫ్యాక్టరీ పెడతాను అని ఇంట్లో చెప్తే ఏదో సరదాకి అనుకున్నారు. ఎప్పుడైతే బ్యాంక్ నుండి లోన్ కన్ఫామ్ అయిందో అప్పుడు అందరికి అర్ధమయింది. నేను ఫ్యాక్టరీ గురించి చెప్పింది సరదాకి కాదని. చాలా సీరియస్‌గానే ప్రయత్నాలు చేశానని. నా గురించి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, వివాహానంతరం హైదారాబాద్ వచ్చాను. అలాంటి నేను అనుకోకుండా వ్యాపార రంగంలోకి వచ్చాను. కొందరికైనా ఉపాధి కల్పిస్తూ, విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాను. ఇది నాకే ఆశ్చర్యకరమైన విషయం. ఒక విధంగా చెప్పాలంటే నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. ఆర్డర్లు ఎక్కువగా ఉన్నప్పుడు నిద్ర మానుకుని పనిచేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు. కస్టమర్‌ని సంతృప్తి పరచడమే మాకు ముఖ్యం.