ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా మహిళా సంఘాలు కృషి చేయాలి

– కొత్త ఓటు నమోదుకు నేడు ఆఖరు తేదీ
– తహసిల్దార్ ఆంజనేయులు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా మహిళా సంఘాల సభ్యులు, అదేవిధంగా అన్ని శాఖల సిబ్బంది కృషి చేయాలని తహసిల్దార్ ఆంజనేయులు అన్నారు. బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వేప్ లో భాగంగా స్థానిక ఐకెపి కార్యాలయంలో, ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో వేరువేరుగా నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలో 911 మహిళా సంఘాలు ఉండగా 9400 మంది సభ్యులు ఉన్నారని, ప్రతి ఒక్క సభ్యురాలు తమ బంధువులు అందరితో సహా ఓటు హక్కు వినియోగించుకునేలా మహిళా సంఘాల నాయకులు, ఐకెపి సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఏప్రిల్ 25వ తేదీతో ఓటరు నమోదు అవకాశం పూర్తవుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు.ప్రతి పోలింగ్ స్టేషన్ లో వంద శాతం  పోలింగ్ అయ్యేలా ప్రతి ఒక్కరు సహకరించాలని తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదశివావ్, ఏటీఎం కుంటగంగారెడ్డి, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, వివో ప్రతినిధులు, సీసీలు, పంచాయితీ కార్యదర్శులు, కారోబర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రెవెన్యూ, పంచాయితీ రాజ్ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Spread the love