ప్రభుత్వానికి రెజ్లర్ల అల్టిమేటం

– సమస్యలు పరిష్కరిస్తేనే ఏషియన్‌ గేమ్స్‌కు..-
రాజీకి రావాలని బెదిరిస్తున్నారు : సాక్షి మాలిక్‌
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన దేశ అగ్రశ్రేణి రెజ్లర్లు శనివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తమ డిమాండ్లు పరిష్కారమైతేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొంటామని, లేదంటే వాటిని బహిష్కరిస్తామని హెచ్చరించారు. హర్యానాలోని సోనిపట్‌లో ఖాప్‌ నేతలు శనివారం నిర్వహించిన మహాపంచాయతీలో రెజ్లర్లు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షి మాలిక్‌ మాట్లాడుతూ.. ‘మా సమస్యలన్నీ పరిష్కారమైతేనే మేం ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొంటాం. మేం ప్రతిరోజూ ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నాం’ అన్నారు. బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక ఆరోపణల కేసులో నిరసనలు కొనసాగిస్తున్న తమపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. రాజీకి రావాలని నిందితుని మనుషులు బెదిరిస్తున్నారని చెప్పారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసినందునే మైనర్‌ రెజ్లర్‌ తండ్రి మాట మార్చారని అన్నారు. ‘నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేయించాలని మొదటి నుంచి కోరుతున్నాం.. బయట ఉండడం వల్ల కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు’ అని తెలిపారు. బజరంగ్‌ పునియా మాట్లాడుతూ.. ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి ఖాప్‌ నేతలకు వివరించనున్నట్టు తెలిపారు. ఇక, ఆందోళన చేస్తున్న రెజ్లర్ల మధ్య ఐక్యత లోపించిందంటూ వస్తున్న వార్తలను సాక్షి మలిక్‌ తోసిపుచ్చారు. తామంతా ఒక్కటేనన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ కలిసికట్టుగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలనేది రెజ్లర్ల ప్రధాన డిమాండ్‌గా ఉండగా, 15న దర్యాప్తు నివేదిక వస్తుందనీ, ఛార్జిషీటు నమోదయ్యేంత వరకూ వేచిచూడాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15 తర్వాతే వారి తదుపరి కార్యాచరణను నిర్ణయించే అవకాశముంది.
కాగా, చైనాలో వచ్చే సెప్టెంబర్‌లో ఏషియన్‌ గేమ్స్‌ జరుగనున్నాయి. గత ఒలంపిక్స్‌-2018లో జరిగిన ఏసియన్‌ గేమ్స్‌లో బజరంగ్‌ పూనియా, వినేష్‌ ఫోగట్‌లు బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దికాలంగా నిరసన సాగిస్తున్న రెజ్లర్లు ఏషియన్‌ గేమ్స్‌ నుంచి వైదొలిగితే ఆ ప్రభావం ఇండియా పతకాలపై పడే అవకాశాలుంటాయి.

Spread the love