ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ

– అందుకే ప్రజల్లో నమ్మకం తగ్గుతున్నది
– లిక్కర్‌ కేసులో బీజేపీ బ్లేమ్‌ అవుతున్నది : కొండా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్నాయనే భావన రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోతున్నదనీ, అందుకే తమ పార్టీపై నమ్మకం తగ్గుతున్నదని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత జైలుకెళ్తుందని అందరూ భావించగా అది జరగలేదని చెప్పారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఏదో అవగాహన ఒప్పందం జరిగిందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. లిక్కర్‌ కేసులో అరెస్టు పక్కా అని తరుచూ తమ పార్టీ నేతలు కామెంట్లు చేయడం, ఇప్పుడు అమె అరెస్టు కాకపోవడం వల్ల బీజేపీ బ్లేమ్‌ అవుతున్నదన్నారు. దీని వల్లనే తెలంగాణలో తమ ఉధృతికి బ్రేకులు పడ్డాయని చెప్పారు. బీజేపీ ఎప్పుడూ ఒక్కసారే స్పీడ్‌గా వెళ్లడం లేదనీ, అలా అని మరీ మెల్లగా కూడా వెళ్లట్లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో ఈ స్పీడ్‌ సరిపోదనీ, కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని ఢకొీట్టేది తామే అనే విషయాన్ని సీరియస్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో బీజేపీ కాస్త వెనుకబడిందని తెలిపారు. ఈటల రాజేందర్‌ ఎన్నికల సమయంలో ఎంత గట్టిగా పనిచేశాడో, ఇప్పుడూ అంతే గట్టిగా పనిచేస్తున్నాడని చెప్పారు. తానూ, ఈటల స్లో కాలేదని చెప్పారు. అయితే, చేరికల కమిటీ పనితీరు స్లోగా ఉందని అభిప్రాయపడ్డారు. పొంగులేటి, జూపల్లిలతో పాటు పలువురి నేతలతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు.

Spread the love