నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ .. ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కు ధీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు సిద్ధమయ్యారు. యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్ ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. ఎక్స్ టీవీ యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా యూట్యూబ్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘చిన్న తెర నుంచి పెద్ద తెర వరకు.. ఎక్స్ అన్నింటినీ మార్చేస్తోంది. ఎక్స్ టీవీ యాప్‌తో నూతన, ఆకర్షణీయమైన కంటెంట్‌ను మీ స్మార్ట్ టీవీల్లోకి త్వరలో తీసుకురానున్నాం. పెద్ద స్క్రీన్‌లపై అత్యంత నాణ్యమైన కంటెంట్, అందులో లీనమయ్యే అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఇది రూపుదిద్దుకుంటోంది’ అని ఎక్స్ సీఈవో లిండా యాకరినో తన సోషల్‌మీడియా ఖాతాలో తెలిపారు.