నువ్వా.. నేనా…!

You.. Me...!– గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాల దూకుడు
– 69మందికి బీఆర్‌ఎస్‌ బీఫామ్‌లు- 55మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా
– 45 రోజుల ముందే గులాబీ పార్టీ ఎన్నికల ప్రణాళిక
– బస్సు యాత్రకు ‘హస్తం’ సిద్ధం.. ప్రారంభించనున్న రాహుల్‌
రాజకీయం వేడెక్కుతోంది. అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ వ్యూహ, ప్రతి వ్యూహాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. పదేండ్ల ప్రస్థానంలో తమ ప్రభుత్వం అనేక విజయాలను సాధించిందనీ, బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టటం ఖాయమంటూ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ప్రతిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ… కాంగ్రెస్‌ హామీలనే కేసీఆర్‌ కాపీ కొట్టారంటూ ఎద్దేవా చేశారు.
సెప్టెంబరు 21న మొత్తం 115 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీఆర్‌ఎస్‌, తాజాగా ఆదివారం 69 మందికి బీ-ఫామ్‌లను అందజేసింది. ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో అభ్యర్థికి పార్టీ నుంచి రూ.40 లక్షల ఆర్థిక సాయం చేస్తూ సీఎం కేసీఆర్‌ చెక్కులను పంపిణీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ గురించి క్షుణ్నంగా వివరించారు. ఎన్నికల ప్రణాళికను జనంలోకి విస్తృతంగా తీసుకుపోవాలని అభ్యర్థులను, పార్టీ నేతలను ఆదేశించారు.
మరోవైపు తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌… పదేండ్లు అధికారానికి దూరంగా ఉండటంతో, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే కాంక్షతో, కసితో ఉంది. ఇందుకోసం పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఢిల్లీ పెద్దలతో చర్చలు, పలుమార్లు వడబోతల క్రతువులను నిర్వహించి ఆదివారం 55 మందితో హస్తిన నుంచి తొలి జాబితా ప్రకటించింది. ఇక సీఎం కేసీఆర్‌ తన ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచి ప్రారంభించగా… కాంగ్రెస్‌ బస్సు యాత్రకు రంగం సిద్ధం చేసింది

Spread the love