పిల్ల‌ల క‌థ‌ల్లో సృజ‌నాశీల‌త

        పిల్లల సృజనశీలతకు హద్దులుండవని మరోసారి రుజువైంది. హైద్రాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఇటీవల (జనవరి 27, 28 తేదీలు) జరిగిన బాలోత్సవంలో ఈ విషయం రూఢ అయింది. దాదాపు 60 పాఠశాలల నుంచి మూడు వేల మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పిల్లల జాతరగా భాసిల్లిన ఈ పండుగలో దాదాపు పాతిక అంశాలోలష్ట్రÊ (నాట్యం, నాటకం, చిత్రలేఖనం,పాట, కథ, ఎగ్జిబిషన్‌ మొ||) ఆరోగ్యకరమైన పోటీ జరిగింది. గుణ నిర్ణేతలు, పర్యవేక్షకులు, వాలంటీర్లుగా మరో రెండొందల మంది పెద్దలు, టీచర్లు చేసారు.
కథా రచనకు సంబంధించి కొన్ని విషయాలు
మొదటి రోజు స్నేహం అంశం మీద, రెండవ రోజు ధైర్యం అంశం మీద కథా రచన పోటీ జరిగింది. మొత్తం 35 మంది పాల్గొంటే పది మంది ఆంగ్లంలో, 35 మంది తెలుగులో కథలు రాసారు.
ఒక ఊరిలో నలుగురు మిత్రులు. వారు ఓ సారి అడవి మార్గంలో వెళ్తుంటే, వారిలో ఒకరికి దాహం వేసింది. నీటి కోసం మిగిలిన ముగ్గురు తలో దిక్కుకు వెళ్తారు. అందులో ఒకరికి రాక్షసుడు ఎదురౌతాడు. ‘నిన్ను చంపుకు తింటాను’ అని బలవంతపెడతాడు. ‘నా మిత్రునికి దాహంగా ఉంది. నీరిచ్చి నీకు ఆహారం అవుతాను’ అని బతిమాలాడుతాడు. నీ మాట నమ్మేది ఎలా? అని రాక్షసుడు ప్రశ్నిస్తే… ‘నీవు నాకు నీటి జాడను చూపించు. నీరిచ్చి క్షణంలో వచ్చేస్తా’ .. అని బదులిస్తాడు. రాక్షసుడు శాంతించి ఓ నదిని చూపిస్తాడు. నది నుంచి నీళ్ళు తీసుకెళ్ళి ఆ మిత్రుడి దాహం తీర్చి, ఇచ్చిన మాట ప్రకారం, స్నేహితులు ఎంత వారిస్తున్నా రాక్షసుడి దగ్గరకు వస్తాడు. మిగిలిన ముగ్గురు మిత్రులు ఆందోళనతో అతని వెంటే వస్తారు. రాక్షసుడు సంతోషించి అతడ్ని ఆహారంగా తీసుకోబోతాడు. ‘నీకు కావాల్సింది ఆహారమేగా. నన్ను తిను నన్ను తిను నన్ను తిను’ అంటూ పోటీ పడి ముందుకొస్తారు మిగిలిన మిత్రులు. రాక్షసుడికి మతిపోతుంది. గందరగోళపడతాడు. ఎవరైనా తనను చూసి భయంతో పారిపోయేవారు తప్ప ఇలా ఒకరి ప్రాణం కోసం మరొకరు ప్రాణం అడ్డం వేసే వారిని ఇప్పుడే చూసాడు రాక్షసుడు. దెబ్బకు చలించిపోయాడు. హృదయం ద్రవించింది. కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి. వెంటనే గంధర్వుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే తనకు కంటి నుంచి నీరు వస్తుందో అప్పుడే తనకు శాప విమోచనం కలిగినట్టు ఆ రాక్షసునికి బ్రహ్మవరం ఉంది. గంధర్వుడు ఈ విషయం తెలిపి, తనకు శాపవిమో చనం కలిగించిన ఆ నలుగురి మిత్రులకు కానుకలిచ్చి అంతర్దానమయ్యాడు.
(రాసింది నవదీప్‌చారి, పదవ తరగతి)

మరో కథ
వర్షం జోరుగా కురుస్తున్నది. వానలో తడుస్తూ ఇంటికి వస్తున్న బాలుడు రవికి, వణికిపోతున్న ఓ కుక్క కనిపిం చింది. జాలిపడి ఆ కుక్కను ఇంటికి తెస్తాడు. పాతగుడ్డతో తుడిచి, ఓ మూలన కూర్చోపెట్టి, తన వద్దనున్న బిస్కెట్లు దానికి పెడతాడు. అమ్మానాన్నలకు ఇది నచ్చదు. రవి బతిమిలాడితే కుక్కను ఇంట్లో ఉంచుకు నేందుకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత అందరికీ మచ్చిక అయింది. చూస్తుండగానే పద్దదైంది. మెడ చుట్టూ బొచ్చు పెరిగి సింహంలాగా ఉండేది. లియో అనే పేరు పెట్టాడు రవి. రవి గైడ్‌ చేసినట్టే కుక్క నడుచుకునేది. అలా వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకడి మోసం వల్ల రవి తండ్రి కిరణ్‌ ఉద్యోగం పోతుంది. ఆ మోసగాడి పేరు సాయితేజ. ఉద్యోగం లేకపోవడంతో రవి కుటుంబం రోడ్డున పడుతుంది. లియోను సాకడం కష్టమని, విడిచిపెట్టమని, రవిని బలవంతం పెడతారు తల్లిదండ్రులు. చేసేది లేక రవి లియోను, ఎక్కడ దొరుకుతుందో అక్కడే తీసుకెళ్ళి విడిచి పెడతాడు. ఒకర్ని వీడలేక ఒకరు ఏడుస్తారు. అప్పుడు కూడా వర్షం పడుతుంది.
రవి ఒంటరిగా ఎవరితో మాట్లాడక తనలో తాను కుమిలిపోతుంటాడు. కొన్నాళ్ళ తర్వాత కిరణ్‌ సాయితేజలు ఒకరికొకరు తారసపడతారు. కారులోంచి దిగిన సాయితేజ తన దర్పం చూపుతూ వికృతంగా నవ్వుతాడు. అప్పుడే లియో కూడా వచ్చి సాయితేజ చుట్టూ తిరిగి వాసన పసిగట్టి కారులోంచి ఒక డ్రగ్‌ ప్యాకెట్‌ తీస్తుంది. వెంటనే సాయితేజ స్టిక్‌ తీసుకుని లియోను చావబాదుతాడు. సహించలేని కిరణ్‌ సాయితేజను అడ్డగించి కలబడతాడు. పోలీసులు వచ్చి విషయం తెలుసుకుని సాయితేజను అరెస్టు చేస్తారు. కిరణ్‌ను, లియోను అభినందిస్తారు. కిరణ్‌తో లియో రావడం చూసి రవి సంతోషిస్తాడు. ఇక నుంచి లియో మనతోనే ఉంటుందని కిరణ్‌ చెప్తాడు. కిరణ్‌ నిజాయితీ ఆధారంగా మరల పాత ఉద్యోగం దక్కడంతో కథ సుఖాంతం అవుతుంది.
ఆంగ్లంలో రాసిన కథ. ఎన్‌.విక్రాంత్‌, 8వ తరగతి.
ఇంకో కథ ‘ధైర్యం’ అంశంపై
అనగా అనగా ఓ అడవి. ఆ అడవిలో ఓ సింహం. ఒక రోజు దానికి ఆహారం దొరక్క ఒక ఊరిలోకి వస్తుంది. ఆ ఊరి వారు సింహాన్ని చూసి ఎవరికి వారు భయంతో ఇళ్ళల్లోకి పోయి తలుపులు వేసుకుని దాక్కొన్నారు. ఊరి జనం అలా భయపడటం సింహానికి నచ్చింది. ఎవరు బయటకు వస్తే వారిని తిందామని ఎదురు చూస్తున్నది. ఇంతలో ఓ తొమ్మిదేళ్ళ బాలిక ‘నేను నా ఊరిని కాపాడాలనుకుని’ ధైర్యంతో ఓ కత్తిని తీసుకుని ముందుకొచ్చింది. సింహం దాడి చేస్తే బాలిక కత్తితో ఎదురు దాడి చేసింది. అలా వారి మధ్య తొమ్మిది రోజులు యుద్ధం సాగింది. పదవ రోజు తోక ముడిచి నీరసంగా అడవి వూపుకు మళ్ళింది. ఊరి జనం ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ధైర్యవంతమైన పిల్లలు ప్రతిచోట ఉంటారు. వారు చేసే పనిలోనే ధైర్యం ఉంటుందనేది కథ ముక్తాయింపు.
రాసింది మనస్విని, ఆరవ తరగతి.
కథలో చిన్న చిన్న భాషా దోషాలు ఉండవచ్చు. వాక్యనిర్మాణంలో ఖాళీలు ఉండవచ్చు. కానీ వారి నిర్మల ఊహాశక్తే వారి కథా బలం. అవకాశం వస్తే చందమామ కథలేకాదు, ఆధునిక సినిమా కథలు కూడా రాయగలం అని అంటున్నారు. కథల పాత్రల్లో వారికి వారే మమేకం అవుతున్నారు. వారి సృజనశీలతకు పూలబాట పరవడమే ఇప్పుడు కథా నిపుణుల పని.

– కె.శాంతారావు, 9959745723

Spread the love