కలకత్తా వైభవాన్ని చాటిన పాట

 Black Hole కలకత్తాను మహానగరమని పిలుస్తారు. అయితే పల్లవి ఎత్తుగడలోనే ‘యమహానగరి’ అన్నాడు వేటూరి. అంటే యముడు నివసించే చోటు అని అర్థం. కలకత్తాను Black Hole అని కూడా అంటారు. భయంకరమైన నగరమని కలకత్తాకు పేరు కూడా ఉంది. అందుకే యమహా అన్నాడు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌ కి ప్రాణాధారమైన హుగ్లీనదికి దానిపై కట్టిన అందమైన హౌరా వారధికి నమస్కరిస్తున్నాడు.
మనదేశంలో ఎన్నో చారిత్రక నగరాలున్నాయి. పుణ్యస్థలాలున్నాయి. గొప్ప గొప్ప ప్రదేశాలున్నాయి. అలాంటి వాటిలో కలకత్తా మహానగరమొకటి. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో కలకత్తా ప్రత్యేక పాత్రను పోషించింది. ఎందరో నాయకులు, మేధావులు, మహాకవులు, చారిత్రక పురుషులు ఇక్కడ పుట్టినవారే. ఇక్కడ నుంచే తమ ప్రస్థానాన్ని ప్రారంభించినవారే. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే కలకత్తా నగరానికి ప్రత్యేక స్థానముంది. అలాంటి కలకత్తా వైభవాన్ని చాటి చెబుతూ వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటనిపుడు పరిశీలిద్దాం. తెలుగు సినిమా కవుల్లో వేటూరి సుందరరామ్మూర్తిది ఓ ప్రత్యేకమైన అధ్యాయం. సరికొత్త పదప్రయోగాలకు శ్రీకారం చుట్టినవాడు. అవి పాత పదాలే అయినా వాటికి సరికొత్త నడకలు, పరుగులు నేర్పినవాడు. ‘చూడాలనివుంది'(1998) సినిమాలో కలకత్తా వైభవాన్ని, మహనీయతను చాటి చెబుతూ ఓ పరమాద్భుతమైన పాటను రాశాడు.
కోల్‌కటా గా పేరు మార్చుకున్న ఆనాటి కలకత్తా మహానగరం బెంగాల్‌ కు, భారతదేశానికి రాజకీయ సంస్కృతికి కేంద్రంగా వెలిగింది. బ్రిటిష్‌ ఇండియాకు చాలా ఏళ్ళు కలకత్తానే రాజధాని. బెంగాలీల రాజకీయ చైతన్యానికి, స్వాతంత్య్ర పోరాటానికి తట్టుకోలేక బ్రిటిష్‌ వారు తమ రాజధానిని ఢిల్లీకి మార్చేసుకున్నారు. ఇంత గొప్ప చారిత్రక నగరమైన కలకత్తాపై తెలుగు సినిమాలో ఓ పాటను పెట్టడం గొప్ప విషయమని చెప్పాలి.
ఈ పాట సినిమాలో హీరో చిరంజీవిపై చిత్రీకరించబడింది.
సినిమా కథపరంగా హీరో కలకత్తా నగరానికి ఒక ప్రత్యేకమైన పనిమీద వెళతాడు. అక్కడ అతనికి బెంగాలీ భాష రాక కొంత అవస్థ పడతాడు. కలకత్తా విశిష్టత తెలిసినవాడు కనుక దాని గొప్పతనాన్ని వివరిస్తూ ఈ పాటను పాడుతుంటాడు. ఇదీ సందర్భం..
కలకత్తాను మహానగరమని పిలుస్తారు. అయితే పల్లవి ఎత్తుగడలోనే ‘యమహానగరి’ అన్నాడు వేటూరి. అంటే యముడు నివసించే చోటు అని అర్థం. కలకత్తాను దీశ్రీaషస నశీశ్రీవ అని కూడా అంటారు. భయంకరమైన నగరమని కలకత్తాకు పేరు కూడా ఉంది. అందుకే యమహా అన్నాడు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌ కి ప్రాణాధారమైన హుగ్లీనదికి దానిపై కట్టిన అందమైన హౌరా వారధికి నమస్కరిస్తున్నాడు. ‘రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ’ అన్న ‘పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్‌’ రాసిన కర్ణాటక సంగీత కృతి నుంచి ఈ సినిమా ట్యూన్‌ ని తీసుకున్నాడు సంగీత దర్శకుడు మణిశర్మ. పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్‌ త్యాగరాజు శిష్యుడు. ఇక్కడ చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది అంటున్నాడు. చిరు త్యాగరాజు అంటే త్యాగరాజు శిష్యుడు అని కాదు. ‘చిరు’ అన్న పదంలో చిరంజీవి ధ్వనిస్తున్నాడు.. అంటే తానే కలకత్తా నగరం గురించి చెబుతున్నాడు కదా! అందుకే ఆ మాట అన్నాడు. ఇది అందులోని అంతరార్థం.
నేతాజీ పుట్టింది కలకత్తాలోనే.. నిజానికి సుభాష్‌ చంద్రబోస్‌ పుట్టింది ఒరిస్సాలోని కటక్‌లో. అయితే.. 1940 లో కలకత్తాలో బ్రిటిష్‌ వారి హౌస్‌ అరెస్ట్‌ నుంచి చాకచక్యంగా తప్పించుకుని సాహసోపేతంగా జర్మనీ వెళ్ళి దేశం కోసం పోరాడాడు సుభాష్‌ చంద్రబోస్‌. ఆ పోరాటం ఫలితంగానే అతనికి నేతాజీ బిరుదు వచ్చింది. సుభాష్‌ ని నేతాజీని చేసింది కలకత్తానే.. అందుకే నేతాజీ పుట్టిన చోట అన్నాడు. అలాగే.. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కి నోబెల్‌ బహుమతిని సంపాదించి పెట్టిన ‘గీతాంజలి’ బెంగాలీ భాషలోనే రాయబడింది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడు కలకత్తావారే. ఇందరు బెంగాలీ మహనీయుల గురించి నేను తెలుగులో పాడుతున్నాను అంటున్నాడు. బతుకు పోరాటంలో ఎంతోమంది శ్రమజీవులు ఎక్కడినుంచో కలకత్తాకు వలస వచ్చి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలా ఉరుకుల పరుగుల జీవితాలతో కలకత్తా నగరంలో జనం ఎలా సంచరిస్తున్నారో చెబుతున్నాడు.
భారత కోకిల సరోజినీనాయుడు తెలుగింటి కోడలే అయినా బెంగాల్‌ కూతురే. ఆ తరువాత… బెంగాలీ వారికి అత్యంత ఇష్టమైన రజనీగంధ..అంటే లిల్లీ పూలను తలచుకుంటున్నాడు. శరత్‌ చంద్ర ఛటర్జీ అనే బెంగాలీ రచయిత రాసిన దేవదాసు నవల తెలుగులో చాలా ప్రసిద్ధి చెందినది. దేవదాసు, పార్వతి వంటి పాత్రలు ఆయన నవలలోనివే. దేవదాసు మైకం మనకు ఆ నవలలోనుంచి వచ్చిందే కదా..! అందుకే.. అటు బెంగాలీవారికి, ఇటు తెలుగువారికి ఆ నవల అభిషేకమైందని చెబుతున్నాడు.
ఈ చరణంలో ‘విధులకు సెలవట అతిథుల గొడవట’ అనే వాక్యాలు వాడాడు. 1950 నుంచి బెంగాల్‌లో నిరుద్యోగ సమస్యలు మొదలైన వాటివల్ల కొన్ని ఉద్యమాలు బయలుదేరాయి. వాటివల్ల జనం తరచుగా విధులకు సెలవులు పెట్టి ఉద్యమాలు చేసేవారు. అలా విధులకు సెలవులుండడం వల్ల కలకత్తా నగరాన్ని సందర్శించడానికి వచ్చిన అతిథులకు గొడవలే కదా మిగిలింది. అలా నిత్యం జనసంచారంతో కిటకిటలాడే కలకత్తా నగరాన్ని గూర్చి చెబుతున్నాడు.
బెంగాల్‌ లోనే వందేమాతర ఉద్యమం ప్రారంభమైంది. అది బ్రిటిష్‌ వారిని గడగడ వణికించింది. అందుకే బ్రిటిష్‌ వారు రాజధానిని కలకత్తా నగరం నుంచి మార్చివేశారు. అందుకే ‘వంగ భూతలమే మిన్న’ అన్నాడు వేటూరి. వంగ దేశం అంటే బెంగాల్‌. కలకత్తాలో కాళీ ఆలయం సుప్రసిద్ధమైనది. నిజానికి కలకత్తా అనే పేరే ‘కాళీ కటా’ నుంచి వచ్చింది. అందుకే కలకత్తాలోని కాళీమాత ఆలయాన్ని తలచుకుంటున్నాడు. ప్రపంచస్థాయిలో పేరుగడించిన అత్యుత్తమ సినీదర్శకుడు సత్యజిత్‌ రే కలకత్తాకు చెందినవారే. ప్రసిద్ధ హిందీ సినీసంగీత దర్శకుడు ఎస్‌.డి.బర్మన్‌ కలకత్తాలోనే చదువుకున్నాడు.యుగోస్లావియా నుంచి వచ్చిన మాతమూర్తి మదర్‌ థెరిస్సా కలకత్తాలోనే దీనులకు సేవ చేస్తూ తన జీవితాన్ని పునీతం చేసుకుంది. ఇక చివరలో ‘జనగణమన’ను గుర్తుకు చేసుకుంటూ సంగీతం, సాహిత్యం, చరిత్ర, సంస్కృతిని మేళవించుకున్న కలకత్తా మహానగర వైభవాన్ని చాటి చెప్పాడు.
ఇది సినిమా కోసం రాసిన పాటే అయినా బెంగాల్‌ జాతి ప్రజల ఆత్మగౌరవపతాకగా, కలకత్తానగర చారిత్రక వైభవానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బెంగాల్‌ ప్రజల జాతీయగీతం అనదగిన స్థాయిలో వేటూరి ఈ పాటను రాశాడు.
పాట:-
యమహానగరి కలకత్తాపురి/ నమహో హుగిలీ/హౌరా వారధి/
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది.
నేతాజీ పుట్టిన చోట/ గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో/
ఆ హంస పాడిన పాటే ఆ నందుడు చూపిన బాట సాగనా/
పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం/
కడకు చేరాలి గమ్యం కదలిపోరా/
ఒకరితో ఒకరికి ముఖపరిచయములు దొరకని క్షణముల బిజిబిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో../
బెంగాలీ కోకిలబాల తెలుగింటి కోడలు పిల్లా మానినీ సరోజినీ/
రోజంతా సూర్యుని కింద రాత్రంతా రజనీగంధ సాగనీ/
పదుగురు ప్రేమలే లేని లోకం దేవదా మార్కు మైకం శరన్నవలాభిషేకం తెలుసుకోరా/
కథలకు నెలవట కళలకు కొలువట విధులకు సెలవట కలకట నగరపు కిటకిటలో/
వందేమాతరమే అన్న వంగభూతలమే మిన్న జాతికే గీతిరా/
మాతంగి కాళీనిలయా చౌరంగి రంగుల ధునియా నీదిరా/ విను గురు సత్యజిత్‌ రే సితారా/
ఎస్‌.డి.బర్మన్‌ కీ ధారా/ థెరిస్సా కి కుమారా కదలిరారా/
జనగణమనముల స్వరపదవనముల హృదయపు లయలను శ్రుతిపరిచిన ప్రియ శుక పిక ముఖ సుఖ రవళులతో..

– డా||తిరునగరి శరత్‌ చంద్ర,[email protected]

Spread the love