ఫార్ములా-ఈ కిక్‌

– ప్రాక్టీస్‌లో దూసుకెళ్లిన డ్రైవర్లు
– నేడు హైదరాబాద్‌ గ్రాండ్‌ ప్రీ
నవతెలంగాణ-హైదరాబాద్‌
సరికొత్త చరిత్ర లిఖించబడింది. ప్రపంచ రేసింగ్‌ చిత్రపటంలో హైదరాబాద్‌ నిలిచింది. ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈ హుస్సేన్‌సాగర్‌ తీరంలో సందడిగా మొదలైంది. ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈ 9వ సీజన్‌ నాల్గో రేసుకు 22 మంది డ్రైవర్లు శుక్రవారం ప్రాక్టీస్‌లో దూసుకుపోయారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రేసింగ్‌ కార్లు స్ట్రీట్‌సర్క్యూట్‌లో మోత మోగించాయి. ఆలస్యం, అనుకోని ప్రమాదం ఎదురైనా.. షెడ్యూల్‌ ప్రకారం ప్రాక్టీస్‌ రేసు జరిగింది. నేడు హైదరాబాద్‌ గ్రాండ్‌ ప్రీ ప్రధాన రేసు జరుగనుంది. బుయేమీ జోరు తొలి ప్రాక్టీస్‌ సెషన్లో ఎన్విషన్‌ రేసింగ్‌ డ్రైవర్‌ సెబాస్టియన్‌ బుయేమి దుమ్మురేపాడు. 1.15.088 సెకండ్లలోనే సెబాస్టియన్‌ రేసు పూర్తి చేశాడు. ప్రాక్టీస్‌ రేసును నం.1గా ముగించాడు. ఇక సీజన్‌ టాప్‌ డ్రైవర్‌ పాస్కల్‌ వారెలిన్‌ (పోర్స్చే) ప్రమాదానికి గురయ్యాడు. మలుపు నం.18 వద్ద అదుపు తప్పిన కారు రెయిలింగ్‌కు ఫుల్‌ స్పీడ్‌తో ఢకొీట్టింది. పాస్కల్‌ కాలు గాయానికి గురైనట్లు జట్టు వైద్యులు తెలిపారు. ఇక ఆతిథ్య మహీంద్రా రేసింగ్‌ డ్రైవర్‌ లుకాస్‌ డిగ్రాసీ ప్రాక్టీస్‌ సెషన్లో ఐదో స్థానంలో నిలిచాడు.
రేసు జరుగుతుందిలా..
హైదరాబాద్‌ గ్రాండ్‌ ప్రీలో 11 జట్ల నుంచి 22 మంది డ్రైవర్లు బరిలో నిలిచారు. 22 మంది డ్రైవర్లను రెండు గ్రూపులు విభజించారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 డ్రైవర్లు అర్హత రేసులో పోటీపడతారు. ప్రతి గ్రూపు నుంచి నలుగురు డ్రైవర్లు క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధించారు. రెండో దశలో డ్యూయెల్స్‌ రేసు ఉంటుంది. ఇక్కడ ప్రతి గ్రూప్‌లో నలుగురు డ్రైవర్లు పోటీ పడతారు. ఈ రేసు నుంచి ఇద్దరు చొప్పున డ్రైవర్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. సెమీఫైనల్స్‌ నుంచి మరో ఇద్దరు డ్రైవర్లు ఫైనల్స్‌కు చేరుకుంటారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 డ్రైవర్లు ఫైనల్లోనే ముఖాముఖి పోటీపడతారు. ఫైనల్స్‌కు అర్హత సాధించని డ్రైవర్లు రేసులో జట్టు ర్యాంకింగ్‌ ప్రకారం లైన్‌లో ఉంటారు.
పోల్‌ పొజిషన్‌ కోసం
రేసులో పోల్‌ పోజిషన్‌ సాధించేందుకు 22 మంది డ్రైవర్లు టాప్‌ స్పీడ్‌లో దూసుకెళ్తారు. 22 మంది డ్రైవర్లు ట్రాక్‌పై దూసుకెళ్లినా, అంతిమంగా పది మంది డ్రైవర్లు మాత్రమే పాయింట్లు అందుకోగలరు. రేసులో అగ్రస్థానం సాధించిన డ్రైవర్‌కు పోల్‌ పొజిషన్‌ లభిస్తుంది. పొల్‌ పొజిషన్‌ సాధించిన డ్రైవర్‌కు 25 పాయింట్లు దక్కుతాయి. రన్నరప్‌కు 18, మూడో స్థానంలో నిలిచిన డ్రైవర్‌కు 15 పాయింట్లు అందిస్తారు. ఇక ఆతర్వాత టాప్‌-10లో నిలిచిన డ్రైవర్లకు వరుసగా 12, 10, 8, 6, 4, 2, 1 పాయింట్లు దక్కుతాయి. టాప్‌-10లో నిలిచిన డ్రైవర్లలో అత్యంత వేగంగా ల్యాప్‌ను (ఓ రౌండ్‌) పూర్తి చేసిన డ్రైవర్‌కు అదనంగా ఓ పాయింట్‌ లభించనుండగా, పోల్‌ పొజిషన్‌ సాధించిన డ్రైవర్‌కు అదనంగా మూడు పాయింట్లు కేటాయిస్తారు.
ఇక దీనితో పాటు రేసులో పాల్గోనే డ్రైవర్లు వినియోగించే టైర్లకు సైతం పరిమితి ఉంటుంది. హైదరాబాద్‌ గ్రాండ్‌ ప్రీ రేసులో పోటీపడే ప్రతి ఒక్క డ్రైవర్‌కు నాలుగు టైర్ల చొప్పున కేటాయిస్తారు. ప్రాక్టీస్‌, ప్రధాన రేసులో ఇవే టైర్లను వినియోగించాల్సి ఉంటుంది. అంతకుమించి టైర్లను వాడుకునే వెసులుబాటు ఉండదు.

Spread the love