సామాన్యులపై మోయలేని భారం

– బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుంటే, దీనికితోడు కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుని సామాన్యులపై మరింత భారం మోపిందని పేర్కొన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఉపసంహరించుకుని ప్రజలపై భారం పడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. 2014లో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 14 కిలోల సిలిండర్‌ ధర రూ.400 ఉంటే, ఇప్పుడు అది రూ.1,155కు చేరుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలు కట్టెలపొయ్యి వాడడం వల్ల తీవ్ర ఆనారోగ్యాలకు గురవుతున్నారంటూ కేంద్రం ఉజ్వల పథకం ద్వారా పెద్దమొత్తంలో గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ధర పెరిగితే సబ్సిడీని కూడా పెంచుతామంటూ చెప్పి, ఆ సబ్సిడీని నామమాత్రంచేసి మోసం చేసిందని విమర్శించారు. దీనికితోడు గ్యాస్‌ ధరలను కూడా విపరీతంగా పెంచుకుంటూ పోతోందని తెలిపారు. ఇది ప్రజా సంక్షేమాన్ని గాలికొదలడమేనని విమర్శించారు. కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు రాయితీలిచ్చి ప్రపంచస్థాయి సంపన్నులను చేస్తున్న మోడీ, సామాన్య ప్రజలపై ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరైందికాదని తెలిపారు. పేదలను ఆదుకునే ”దేవుడు మోడీ”అంటూ పదేపదే ప్రచారం చేసుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు పేదలపై పడుతున్న ఈ భారాలపై స్పందించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెరిగిన ధరలను వెనక్కి తీసుకునే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు.

Spread the love