నవతెలంగాణ – భూపాలపల్లి
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 10 ఎకరాల వరి కాలిపోయింది. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలో శుక్రవారం జరిగింది. ఎడ్లపల్లి చెరువు కట్ట శివారులో రంగు సంపత్, మంతిని సారయ్య, తోట రమేశ్ 2 ఎకరాల చొప్పున, తోకలు రాములు, కామ వెంకటేశం ఎకరం చొప్పున వరి సాగు చేస్తున్నారు. శుక్రవారం ఈ రైతుల పొలంతో పాటు, పక్కనే ఉన్న కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన మరికొందరు రైతుల వరికి నిప్పంటుకుంది. గమనించిన రైతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చేతికొచ్చిన పంటను కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.