పెయింట్ దుకాణంలో అగ్నిప్రమాదం…

నవతెలంగాణ – హైదరాబాద్
వేసవి వచ్చిందంటే చాలు అగ్నిప్రమాదాలు భయపెడుతూ ఉంటాయి. చిన్న అగ్గిరవ్వ పెను ప్రమాదానికి దారి తీస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఎల్బీనగర్​లో కార్ షోరూంలో జరగిన భారీ అగ్ని ప్రమాదం మరవకముందే బుధవారం రాత్రి మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రోజున అర్ధరాత్రి ఎల్బీనగర్ కూడలి సమీపంలోని ఏషియన్ పెయింట్ దుకాణంలో విద్యుత్ షాక్​తో మంటలు అంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరెంట్ పోల్ దుకాణానికి చాలా సమీపంగా ఉండటంతో ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుంది. పెయింట్ దుకాణంలో చెలరేగిన మంటలకు పక్కన ఉన్న పాన్ షాప్​లోకి మంటలు వ్యాపించాయి. దీంతో ఆ పాన్​షాప్ పూర్తిగా దగ్దమైంది. పెయింట్ దుకాణంలో పెయింట్ డబ్బాలు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల ప్రభావానికి చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Spread the love