రెండు రెళ్ళు ఢ పట్టాలు తప్పిన 12 వ్యాగన్లు

– పశ్చిమబెంగాల్‌లో ప్రమాదం
బంకురా : పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఆదివారం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అడ్రా డివిజన్‌ పరిధిలోని ఓండా స్టేషన్‌కు సమీపంలో మెయింటెనెన్స్‌ రైలును గూడ్స్‌ రైలు ఢకొీంది. ఈ ఘటనతో 12కు పైగా వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతకు గూడ్స్‌ రైలు ఇంజిన్‌.. మరో రైలు వ్యాగన్‌ పైకి చేరింది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఓ రైలు డ్రైవర్‌ స్వల్ప గాయాల పాలయ్యాడు. తెల్లవారుజామున 4.05 గంటల సమయంలో ఓండా స్టేషన్‌ వద్ద రైల్వే మెయింటెనెన్స్‌ రైలు (బిఆర్‌ఎన్‌) షంటింగ్‌ పని జరుగుతోంది. ఆ సమయంలో గూడ్స్‌ రైలుకు రెడ్‌ సిగల్‌ పడిందని, కానీ ఆగకుండా ముందుకు వెళ్లిపోయిందని సమాచారం. ఆ తర్వాత బిఆర్‌ఎన్‌ మెయింటెనెన్స్‌ రైలును ఢకొీంది. ఉదయం 7 గంటల సమయానికి అప్‌ మెయిల్‌, అప్‌ లూప్‌ లైన్లను అధికారులు పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ఆగేయ రైల్వే సిపిఆర్‌ఒ వెల్లడించారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. రెండు రైళ్లలో ఎటువంటి లోడూ లేదని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఘటన చోటుచేసుకున్న అడ్రా డివిజన్‌.. పశ్చిమబెంగాల్‌లో నాలుగు జిల్లాలైన వెస్ట్‌ మిడ్నాపుర్‌, బంకురా, పురులియా, బృందావన్‌లో రైళ్ల రాకపోకలకు కీలకమైంది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌, బొకారో, సింగభూమ్‌పై కూడా కొంత ప్రభావం పడుతుంది.
పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు
ఈ ప్రమాదం నేపథ్యంలో 14 రైళ్లను ఆదివారం రద్దు చేసినట్లు ఆగేయ రైల్వే ప్రకటించింది. మరికొన్నిటిని తాత్కాలికంగా రద్దు చేశామని, కొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఆ వివరాలను ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

Spread the love