ప్రశ్నించే వారికే పట్టం కట్టాలి

–  నిస్వార్ధంగా, నిబద్ధతతో పనిచేసే వాళ్లను ఎన్నుకోవాలి
– పైరవీకారులు, ప్రలోభాలకు గురిచేసే వారి పట్ల అప్రమత్తత అవసరం
– సీపీఎస్‌ను తెచ్చిందే కాంగ్రెస్‌, బీజేపీ
– ఆయా పార్టీల అభ్యర్థులు ఉపాధ్యాయులకు ఏం భరోసానిస్తారు?
– దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి
– డీఏలు పెండింగ్‌, సకాలంలో జీతాలు రాక టీచర్లలో అసంతృప్తి
– సమస్యలు పరిష్కరించేలా సర్కారుపై ఉద్యమిస్తా
– విద్యారంగ పరిరక్షణే నా లక్ష్యం : నవతెలంగాణతో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌రెడ్డి
సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించే వారికే పట్టం కట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) బలపరిచిన స్వతంత్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఓటు అమూల్యమైందనీ, అందువల్ల ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసే వారిని,నిస్వార్ధంగా, నిజాయితీగా, నిబద్ధతతో విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలని కోరారు. పైరవీకారులు, ప్రలోభాలకు గురిచేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట ఉరితాడుగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌)ను తెచ్చిందే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలని విమర్శించారు. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు సీపీఎస్‌ గురించి ఉపాధ్యాయులకు ఏం భరోసానిస్తారని ప్రశ్నించారు. సీపీఎస్‌ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు మాణిక్‌రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు…
విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నది.?
నన్ను గుర్తు పట్టే వారు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కొందరు నేను తెలియకపోయినా టీఎస్‌యూటీఎఫ్‌ ఉద్యమాలు, నేను చేసిన పనిని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలతోపాటు నివాస ప్రాంతాలకు వెళ్లినా మంచి ఆదరణ ఉన్నది. అయితే ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరు పట్ల సంతృప్తిగా లేరు. పదోన్నతులు, బదిలీలు, భాషాపండితుల అప్‌గ్రెడేషన్‌, సీపీఎస్‌ రద్దు, 2003 డీఎస్సీ వారికి ఓపీఎస్‌ అమలు, 317 జీవో బాధితులు సొంత జిల్లాలకు రావడం, స్పౌజ్‌ టీచర్ల బదిలీ ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల్లో సమస్యలు పేరుకుపోయాయి. సర్కారు బడుల్లో పారిశుధ్య కార్మికుల్లేరు. సమస్యలు తీవ్రమవుతుంటే ఉద్యమాల్లేవంటూ కొందరు ఉపాధ్యాయులంటున్నారు. అది వాస్తవమే. టీఎస్‌యూటీఎఫ్‌ చేసిన ఉద్యమాల గురించి ప్రస్తావిస్తే సంతృప్తిపడుతున్నారు. అయితే ప్రభుత్వాలను ప్రశ్నిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి. దీన్నే ఉపాధ్యాయుల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నా.
గతంలోనూ మీరు పోటీ చేశారు. ఇప్పుడు మళ్లీ బరిలో ఉన్నారు. ఉపాధ్యాయ సమస్యలెలా ఉన్నాయి.?
ఉపాధ్యాయులు అప్పుడూ, ఇప్పుడూ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే అప్పటితో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరింత జఠిలమయ్యాయి. వాటిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముంది. నిజాయితీగా ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రతినిధి కావాలి. ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయుల వాణిని వినిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఆయనకుతోడు ఇంకొకరు కావాలి.
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. మీరు ప్రచారానికి వెళ్లినపుడు ప్రశ్నించడం లేదా?
ఉపాధ్యాయులు తప్పకుండా వాటిని అడుగుతున్నారు. అయితే దాటవేత ధోరణితో సమాధానం చెప్పడం లేదు. ఏం చేస్తే ఆ సమస్య పరిష్కారానికి నోచుకుంటుందో శాస్త్రీయంగా వివరించి మేం చెప్తున్నాం. 317 జీవో కారణంగా వేరే జిల్లాలకు కేటాయించిన వారిని దశలవారీగా స్థానిక జిల్లాలకు పంపాలి. దీనిపై ప్రభుత్వాన్ని ఒప్పించాలి. కోర్టు ఆదేశాలతో ఆగిపోయినా బదిలీలు, పదోన్నతులు చేపట్టాల్సిందే. వాస్తవాలను వివరిస్తున్నాం.
భాషాపండితులు, పీఈటీలకు పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉంది. దీనికి ప్రత్యామ్నాయం ఉందంటారా?
పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్‌ గోస తీవ్రంగా ఉన్నది. జాప్యం కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఉపాధ్యాయులందరికీ పదోన్నతులొస్తుంటే పండితులు, పీఈటీలకు మాత్రమే రాకపోతే ఆ బాధ తీవ్రంగా ఉంటుంది. తుది తీర్పునకు లోబడి అప్‌గ్రెడేషన్‌ ప్రక్రియ చేపడతామంటూ ప్రభుత్వం చెప్పి హైకోర్టు అనుమతి పొందాలి. సర్కారు దీనిపై గట్టిగా ప్రయత్నించి సమస్య పరిష్కారానికి కృషిచేయాలి.
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జీతాలు మొదటి తారీఖున రావడం లేదు కదా?
అవును. మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 40 ఏండ్ల కింద నాలుగు డీఏలు బకాయి పడ్డ పరిస్థితి ఉండేది. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదు. కానీ ఇటీవలి కాలంలో ఒకటో తారీఖున ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు. దీంతో ఈఎంఐలు సకాలంలో చెల్లించే పరిస్థితి లేదు. జీపీఎఫ్‌ రుణాలు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ట్రెజరీల్లో ఆమోదం పొందినా ఈ కుబేర్‌లో బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి.
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. దీనిపై ఏమంటారు?
సీపీఎస్‌ రద్దు కోసం టీఎస్‌యూటీఎఫ్‌ మొదటి నుంచి పోరాడుతున్నది. అయితే ఇది రాజకీయ ఎజెండాగా మారాలి. ఏ పార్టీ అయినా సీపీఎస్‌ రద్దుపై హామీ ఇవ్వాలి. అలా ప్రకటించేలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించాలి. సీపీఎస్‌ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి. కాంగ్రెస్‌, బీజేపీ కూడబలుక్కుని సీపీఎస్‌ను తెచ్చాయి. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) చట్టాన్ని రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలి. అప్పటి వరకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులను ఓపీఎస్‌ పరిధిలోకి తేవాలి.
రాజకీయ పార్టీల నుంచి కూడా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మీరు స్వతంత్రంగా బరిలో ఉన్నారు. ఉపాధ్యాయులు ఎవరిని ఆదరిస్తారు?
ఉపాధ్యాయులు స్వేచ్ఛగా జీవించేందుకే ఇష్టపడతారు. ఉపాధ్యాయుల ఓట్ల ద్వారా ఎన్నికయ్యే వ్యక్తి ఓ రాజకీయ పార్టీ చెప్పుచేతల్లో ఉండొద్దని భావిస్తారు. అందుకే స్వతంత్రంగా ఉంటూ ప్రభుత్వాలను ప్రశ్నించే అభ్యర్థులనే ఆదరిస్తారు. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుగా విద్యారంగ పరిక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాను. నిస్వార్ధంగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తున్నాను. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట ఉరితాడుగా మారిన సీపీఎస్‌పై కాంగ్రెస్‌, బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఏ విధమైన హామీనిస్తారు.? సీపీఎస్‌ రద్దు గురించి ప్రకటిస్తారా? దీనిపై స్పష్టతనివ్వాలి.
ఉపాధ్యాయ ఓటర్లకు మీరిచ్చే సందేశమేంటీ?
మార్చి 13న పోలింగ్‌ ఉంది. నేను సోమవారం (ఈనెల 20న) నామినేషన్‌ దాఖలు చేస్తున్నాను. విద్యారంగ పరిరక్షణ, శాసనమండలిలో ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఓటు అమూల్యమైంది. ప్రశ్నించే అభ్యర్థికి పట్టం కట్టాలి. ప్రలోభాలకు గురికావొద్దు. నిస్వార్ధంగా, నిబద్ధతతో పనిచేసే వారిని ఆదరించాలి. పైరవీకారులు, ప్రలోభాలకు గురిచేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. అమూల్యమైన ఓటు ద్వారా గెలిపించే అభ్యర్థి విద్యారంగాన్ని పరిరక్షించుకునేలా ఉండాలి. ప్రభుత్వాల పనితీరుతోపాటు నిజాయితీ, నిబద్ధత, పోరాడే పటిమ, ప్రశ్నించేతత్వం ఉన్న అభ్యర్థులను పరిశీలించి ఆదరించాలి. అప్పుడే విద్యారంగంతోపాటు సమాజానికి మేలు కలుగుతుంది. ఇదే నేను ఉపాధ్యాయులందరికీ చెప్పే విషయం.

Spread the love