‘పది’ గట్టేక్కెనా!

–  మరో నెలన్నరలో పదో తరగతి వార్షిక పరీక్షలు
–  తొలిమెట్టు, మనఊరు-మన బడికే ఎక్కువ సమయం కేటాయింపు
–  ఇంకోవైపు టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌
–  సిలబస్‌ పూర్తయినా.. ప్రత్యేక ప్రణాళిక అమలు నామా మాత్రమే
–  విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పది వార్షిక పరీక్షలపై ఆందోళన
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టెన్త్‌ విద్యార్థులను ఈ విద్యాసంవత్సరం గట్టెక్కించడం విద్యాశాఖకు అంత ఈజీగా కనిపించడం లేదు. సర్కారు బడుల్లో ఏండ్లుగా సబ్జెక్టు టీచర్ల సమస్య కొనసాగుతూనే ఉన్నది. దీనికితోడు ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వం సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మనబస్తీ, మన బడీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పనుల భారమంతా ప్రధానోపాధ్యాయులపైనే వేసింది. కాగా హెడ్‌మాస్టర్లు ఆ పనులతో పాటు తొలిమెట్టు (ఎఫ్‌ఎల్‌ఎన్‌) నోడల్‌ ఆఫీసర్లుగా మండలాల్లో పర్యవేక్షణకు ఎక్కువ సమయం కేటాయించారు. ఫలితంగా కొంతమేర చదువులపై తగిన శ్రద్ధ చూపించలేకపోయారు. వీటికితోడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. ఇదే సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్స్‌ షెడ్యూల్‌ విడుదల చేయడంతో పెద్ద సంఖ్యలో టీచర్లు దరఖాస్తు చేసుకోవడం, వారు కోరుకున్న పాఠశాల వివరాలు సేకరించడంలో మునిగిపోయారు. ఇవన్నీ కూడా ఈ విద్యాసంవత్సరం తరగతి బోధన, విద్యార్థుల చదువులపైన ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. కనీసం ఈ నెలన్నర రోజులు ఒక ప్రణాళికతో లక్ష్యం ఏర్పరుచుకుని చదువులు గాడిన పెట్టకపోతే హైదరాబాద్‌ జిల్లా ఫలితాలు మునుపుకన్నా ఇంకా దిగజారుతాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
హైదరాబాద్‌ జిల్లావ్యాప్తంగా మొత్తం 1585 ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు, మైనార్టీ, కేంద్రీయ, బీసీ వెల్ఫెర్‌, రైల్వే, టీఎస్‌ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ స్కూల్స్‌ తదితర పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల నుంచి ఈ ఏడాది 80,198 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 4,785 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకుగాను.. 1,89,791 మంది విద్యార్థులు ఈసారి పది వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ప్రాక్టీస్‌ పేపర్‌-1 పరీక్షలు పూర్తికాగా ఈ నెల 27 నుంచి మార్చి 29 వరకు ప్రీ ఫైనల్స్‌ ఎగ్జామ్స్‌ కొనసాగుతాయి. ఏప్రిల్‌ 3 నుంచి 13వరకు పది వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇదిలావుంటే న్యాస్‌ ఫలితాల నేపథ్యంలో గతేడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని విద్యార్థుల కనీస అభ్యాసన సామర్థ్యాలు రోజురోజుకి దిగజారిపోతుండడంతో వాటి పెంపు లక్ష్యంగా విద్యాశాఖ యుద్దప్రాతిపదికన ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) పేరుతో తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విద్యార్థుల్లో చదవడం, రాయడం, అభ్యాసన సామర్థ్యాలు సాధించే విధంగా మాతృభాష, ఇంగ్లీష్‌, గణితం, ఈవీఎస్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించారు. తొలిమెట్టు కార్యక్రమం పర్యవేక్షణకు మండల స్థాయిలో సీనియర్‌ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులను నోడల్‌ అధికారులుగా నియమించారు. వారంలో రెండు రోజులు వారి మండలంలోని పాఠశాలలను సందర్శించి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించడంతో పాటు మండల నోడల్‌ అధికారులు, క్లస్టర్‌ అధికారులను సమన్వయం చేసుకుంటూ విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందించాలి. ఇక మనబస్తీ-మనబడి(మన ఊరు-మనబడి) కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో తొలిదశలో 239 స్కూళ్లను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. వీటి పనులకుగాను ఇప్పటికే పనులు అప్పగించిన ఆయా ఏజెన్సీలు ఇన్‌ఫుట్‌ డేటా ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి స్కూల్‌ హెడ్‌మాస్టర్‌, ఏఈ కలిసి ఆ స్కూల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎస్టిమేషన్‌ పూర్తి చేసి.. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. వివిధ స్థాయిలో పరిశీలన అనంతరం కలెక్టర్‌ నిధులు మంజూరు చేస్తారు. ఆ నిధులు మంజూరైన వెంటనే సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యాకమిటీతో కలిసి అగ్రిమెంట్‌ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్‌ను అప్‌లోడ్‌ చేయగానే కలెక్టర్‌ స్కూల్‌ ఖాతాలో నిధులు జమ చేసిన అనంతరం పనులు ప్రారంభించారు. ఇవన్నీ పనులు కూడా ప్రధానోపాధ్యాయులే చేయాలి. వీటికితోడు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్షల వల్ల ఎక్కువ సమయం ఈ పనులకే కేటాయించారు. ఫలితంగా ఆ ప్రభావం విద్యార్థుల చదువులపై పడింది. అంతేగాక సిలబస్‌ పూర్తయినా.. స్లో లర్నర్స్‌తో పాటు ఏటా పది ఫలితాల్లో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులలో అధికశాతం విద్యార్థులు ఫెయిల్‌ అవుతున్నారు. ఇలాంటివారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు నామమాత్రమే. అంతేగాక వచ్చే టెన్త్‌ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఒక కార్యచరణ లేకపోవడంపై పేద విద్యార్థుల చదువుల పట్ల విద్యాశాఖ అధికారులకు ఉన్న నిర్ల్యక్షం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు
పదో తరగతి విద్యార్థులు సబ్జెక్టులపై మరింత పట్టు సాధించేందుకు 40 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులు మార్చి 10 వరకు కొనసాగుతాయి. పాఠశాల ప్రారంభ సమయం కంటే ముందు ఉదయం 8.00 నుంచి 9.00 గంటల వరకు ఒక సబ్జెక్టు, పాఠశాల సమయం అనంతరం సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు మరో సబ్జెక్టులో రోజూ తరగతులు నిర్వహిస్తున్నారు. వాటిపైనే వారం వారం పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యే విధంగా ప్రతి ఆదివారం, రెండో శనివారాల్లో వారాంతపు పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి వారం ఒకే రోజు రెండు పరీక్షలు (ఉదయం 9 నుంచి11 గంటల వరకు ఒక పరీక్ష, 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండో పరీక్ష) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు మార్చి 19వరకు నిర్వహించనున్నారు. ఈ మధ్యలోనే ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభమై.. మార్చి 29న ముగుస్తాయి. ఇక అనంతరం వార్షిక పరీక్షలే.

Spread the love