Sunday, April 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఆమోదం

ఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఆమోదం

- Advertisement -

అజహరుద్దీన్‌, కోదండరామ్‌కు ఊరట
త్వరలో విడుదల కానున్న గెజిట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఏడాది క్రితం పంపిన ఫైల్‌కు గవర్నర్‌ తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఇందుకు సంబంధించి త్వరలో గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది. దీంతో తెలంగాణలో గవర్నర్‌ కోటాలోని నామినేటెడ్‌ ఎమ్మెల్సీల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. గత ప్రభుత్వం నుంచి సాగుతున్న ఉత్కంఠకు స్వస్తి పలుకుతూ, గవర్నర్‌ కోటాలో ఇద్దరు కీలక నేతలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి గవర్నర్‌ ను ప్రత్యేకంగా కలిసి, ఈ రెండు ఎమ్మెల్సీలను తప్పనిసరిగా ఆమోదించాలని కోరారు. దీంతో గవర్నర్‌ ఆ ఫైల్‌ ను తెప్పించుకొని, పరిశీలించారు. అనంతరం అప్రూవల్‌ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్‌, సియాసత్‌ ఉర్దూ పత్రిక ఎడిటర్‌ అమీర్‌ అలీఖాన్‌ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కానీ బీఆర్‌ఎస్‌ ఈ పేర్లపై కోర్టును ఆశ్రయించింది. దీంతో గవర్నర్‌ కూడా పెండింగ్‌ లో పెట్టారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కౌశిక్‌రెడ్డి, శ్రవణ్‌ దాసోజు పేర్లను ఇదే కోటాలో ప్రతిపాదించగా, అప్పటి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వారిని తిరస్కరించారు. వారు రాజకీయ నేపథ్యం ఉన్నవారని, సేవా,సాంస్కృతిక రంగాలకు చెందిన వారు కాదని గవర్నర్‌ గతంలో అభ్యంతరం తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కోదండరామ్‌, అమీర్‌ అలీ ఖాన్‌లను ప్రతిపాదించగా, బీఆర్‌ఎస్‌ నేతలు దీనిపై కోర్టుకు వెళ్లారు. వారిని ఎమ్మెల్సీగా నియమిస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత 2025 ఆగస్ట్‌ 30న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే ప్రక్రియను చేపట్టింది. దీనిలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కోదండరామ్‌, మహమ్మద్‌ అజహరుద్దీన్‌ పేర్లను గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా వీరి నియామక పైళ్లపై సంతకం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -