– శవానికి చోటివ్వని అద్దె ఇల్లు
– కరీంనగర్‌లో అమానుషం..మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వని యజమాని
– దశదినకర్మ వరకు ఇంటిముఖం చూడొద్దంటూ గెంటివేత
– దిక్కుతోచక శ్మశానవాటికలోనే ఆశ్రయం పొందుతున్న కుటుంబం
– గుండెల్ని పిండేస్తున్న పసిపిల్లల రోదన.. పట్టించుకోని పాలకులు, అధికారులు
– మానవత్వాన్ని మంటగలుపుతున్న స్వార్థపు మనుషులు
– నగరంలో 50 వేల అద్దె కుటుంబాల దీనస్థితి
కనీసం ఉండేందుకు నిలువ నీడ (సొంత ఇల్లు) లేని పేదరికం వారిది. బతుకుదెరువు కోసం దశాబ్దాల కిందట వలసొచ్చి, అద్దె ఇండ్లల్లో ఉంటూ నెట్టుకొస్తున్న ఆ కుటుంబ పెద్ద దూరమయ్యాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఆ ఇంటి యజమాని మరో షాకిచ్చాడు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావొద్దంటూ హుకుం జారీ చేశాడు. అంతేకాక 12రోజుల కార్యక్రమం ముగిసే వరకు ఇంటివైపు కన్నెత్తి చూడొద్దని గెంటేశాడు. దీంతో భార్య, పసిపిల్లలు, వృద్ధురాలైన తల్లికి శ్మశానవాటికలోని ఓ చిన్న గదే శరణ్యమైంది. చుట్టూ కాలుతున్న చితులు.. అస్థికల మధ్య బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆ కుటుంబ దీనగాథ చూస్తే గుండెలు పిండేసినట్టు అనిపిస్తుంది.
నవతెలంగాణ-కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ కేంద్రంగా వెలుగు చూసిన ఈ హృదయ విదారక ఘటన.. అద్దె ఇండ్లలో నివసిస్తున్న వేలాది కుటుంబాల అభద్రతను, సమాజంలో నశించిపోతున్న మానవత్వాన్ని కండ్లకు కడుతోంది. ఇది అందరూ చేస్తున్నారని కాదు.. కొంతమంది అక్కడక్కడా చేస్తున్న మూఢత్వపు ఆలోచనా విధానాలతో అద్దెకు ఉంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. బతికుండగా బతుకుదెరువు కోసం పోరాటం.. చనిపోయాక ఆరడుగుల నేల కోసం, కనీస గౌరవప్రదమైన అంతిమ సంస్కారాల కోసం ఆరాటం.. అద్దె ఇండ్లలో నివసించే పేదలకు ఇది నిత్యకృత్యంగా మారింది. కరీంనగర్ శివారు ప్రాంతంలో వ¶డ్రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న గాండ్ల శ్రీకాంత్ కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితి కంటతడి పెట్టిస్తోంది.
మిలిటరీ కుటుంబం..వీధిన పడిన వైనం
గాండ్ల నాగరాజు – పద్మావతి దంపతుల స్వస్థలం సిద్దిపేట జిల్లా కేంద్రం. నాగరాజు మిలటరీలో సిపాయిగా దేశానికి సేవలందించాడు. చెన్నరు, సికింద్రాబాద్ జోన్లలో పని చేస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. అప్పటికే ఐదుగురు పిల్లలు (ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు) ఉన్న ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిరోడ్డున పడింది. పిల్లల పోషణ కోసం తల్లి పద్మావతి 2000లో కరీంనగర్‌కు వలసొచ్చింది. మిలటరీ హెడ్‌క్వార్టర్స్ చుట్టూ తిరిగినా, భర్త పింఛన్‌గానీ, కనీసం నిలువ నీడగానీ దక్కలేదు. దీంతో అద్దె ఇండ్లలో ఉంటూ బీడీలు చుట్టి పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న పెద్ద కొడుకు శ్రీకాంత్ (భార్య రూప, ఇద్దరు కూతుళ్లు), చిన్న కొడుకు శ్రీమాన్ వేర్వేరుగా అద్దె ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
అప్పుల బాధ..ఆత్మహత్యకు దారి
కరీంనగర్ శివారులోని గాంధీనగర్‌లో సుమారు నాలుగేండ్లుగా ఓ ఇంట్లో శ్రీకాంత్ అద్దెకు ఉంటూ ఆటో నడుపుతున్నాడు. సరైన కిరాయిలు లేక, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. వాటికి వడ్డీలు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఈనెల 22న తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్ మరణ వార్త విన్న వెంటనే, ఇంటి యజమాని కనీస కనికరం లేకుండా ప్రవర్తించాడు. మృతదేహాన్ని వెంటనే ఇంట్లో నుంచి తీసేయాలని, 12 రోజుల కార్యక్రమం ముగిసే వరకు ఆ ఇంటి ఛాయలకు కూడా రావొద్దని తేల్చి చెప్పాడు. విధిలేని పరిస్థితుల్లో కుటుంబీకులు అతని మృతదేహాన్ని నగర శివారు లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండీ) సమీపంలోని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
శ్మశానంలోనే ఆత్మబంధువుల సహవాసం
రాత్రిళ్లు చుట్టూ శవాలు, కారుచీకట్ల మధ్య ఆ పసిపిల్లలతో బిక్కుబిక్కుమంటూ శ్మశానంలో గడుపుతున్న ఆ కుటుంబాన్ని కదిలించగా.. ‘మా ఆయన రాత్రింబవళ్లు ఆటో నడిపినా కష్టాలు తీరలేదు. కనీసం ఇల్లు కూడా లేదని, ఆడపిల్లలు పెద్దవుతున్నారని రోజూ బాధపడేవాడు’ అంటూ భార్య రూప… ‘నా కొడుకు చనిపోతే అనాథ శవంగా మార్చేశారు. అద్దె ఇంటివాళ్లు రానివ్వలేదు. 30 ఏండ్లుగా బీడీలు చుట్టి పిల్లల్ని పెంచాను. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. నా కండ్లెదుటే నా పిల్లలు పడుతున్న నరకం చూడలేకపోతున్నాను’ అంటూ తల్లి పద్మావతి రోదిస్తూ వేదన వెలిబుచ్చారు. ‘నాన్న కావాలి.. ఇక్కడ భయంగా ఉంది..’ అంటూ పదేండ్ల దక్షిత, శహరిక ఏడుస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టిస్తోంది.
ఇదొక సామాజిక జాఢ్యం!
ఈ దారుణం కేవలం శ్రీకాంత్ కుటుంబానికే పరిమితం కాదు. కరీంనగర్‌తోపాటు హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఇలా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. అద్దె ఇంట్లో ఎవరైనా చనిపోతే యజమానులు మృతదేహాన్ని ఆవరణలోకి రానివ్వకపోవడం నేడు ఒక సామాజిక జాఢ్యంగా మారింది. అపశకునం, వాస్తు దోషం, వ¶ఢ నమ్మకాల పేరుతో తోటి మనిషి పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. చెడ్డ ఘడియల్లో మరణిస్తే ఇంటిని వదిలేయాలని, శాంతి పూజలు చేయాలని, లేదంటే దోషం పడుతుందనే గుడ్డి నమ్మకాలతో.. విద్యావంతులైన యజమానులు సైతం మరణించిన వారి పట్ల, ఆ బాధిత కుటుంబాల పట్ల కఠినంగా, అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఇలాంటి మూఢ నమ్మకాలు ప్రజల్లో బాగా వ్యాపిస్తున్నాయి. గతంలో కొంతమంది ఇండ్లల్లోనే ఉండేవి. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ విచ్చలవిడిగా మూఢనమ్మకాలు ప్రసారమవుతు న్నాయి. ప్రజల మనస్సుల్లో నాటుకుపోతున్నాయి. వీటిపై ప్రభుత్వం వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరణం అనేది ప్రకృతి సహజం. బతికుండగా అద్దె వసూలు చేసుకునే యజమానులకు, వారు చనిపోయి నప్పుడు కనీసం మానవత్వంతో వ్యవహరించాలన్న స్పృహ ఉండాలి.
ఆ పేదలకు అండగా నిలవాల్సింది ప్రభుత్వమే..
నగరాలు, పట్టణాలు విస్తరిస్తున్న కొద్దీ అద్దె నివాసితుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిలువ నీడ లేని పేదలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. వెంటనే జిల్లా అధికారులు, పాలకులు స్పందించి శ్మశానంలో బిక్కుబిక్కుమంటున్న శ్రీకాంత్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించి, నివాస సదుపాయం కల్పించాలి. ఆ కుటుంబానికి సొంత ఇల్లు మంజూరు చేయాలి. అర్హులైన పేదలందరికీ గూడు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలి. అద్దె ఇంట్లో మరణాలు సంభవించినప్పుడు అమానుషంగా ప్రవర్తించే యజమానులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాల్లో మార్పులు రావాలి.
మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి



