వాంకోవర్ సమావేశానికి దూరం
న్యూఢిల్లీ : 2026 ఫిఫా ప్రపంచకప్‌లో పోటీపడతామని ఇరాన్ ప్రకటించినా.. మంగళవారం వాంకోవర్ (కెనడా)లో జరిగిన ప్రపంచ ఫుట్‌బాల్ అధినేతల సమావేశానికి ఇరాన్ హాజరు కాలేదు. బుధవారం వాంకోవర్ వేదికగా ఆసియా ఫుట్‌బాల్ దేశాలతో ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో భేటీ అయినా.. ఇరాన్ గైర్హాజరు అంశం చర్చకు రాలేదని సమాచారం. అమెరికా, మెక్సికో సంయుక్తంగా ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్-జిలో న్యూజిలాండ్, బెల్జియం, ఈజిప్ట్‌తో పోటీపడనున్న ఇరాన్.. తమ మ్యాచ్‌లను మెక్సికోకు మార్పు చేయాలని ఫిఫాను కోరినా ఎటువంటి స్పందన లభించలేదు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ డ్రా వేడుకకు సైతం ఇరాన్ ప్రతినిధులకు వీసా నిరాకరించారు. తాజాగా వాంకోవర్ సమావేశానికి సైతం వీసా నిరాకరణతోనే ఆ దేశ ప్రతినిధులు హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. ఫిఫా రూల్స్ ప్రకారం ప్రపంచకప్‌లో పోటీపడే దేశ క్రీడాకారులు, సహాయక సిబ్బంది, అధికారులకు ఆతిథ్య దేశం నుంచి ఎటువంటి వీసా ఇబ్బందులు ఉండకూడదు. పలుమార్లు ఇరాన్ ప్రతినిధులు వీసా కష్టాలు ఎదుర్కొంటున్నా.. ఫిఫా నాయకత్వం ఈ అంశంలో మౌనం దాల్చటం విమర్శలకు దారితీస్తోంది.
టీమ్ ‘మినాబ్ 168’ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో 18 పతకాలతో సత్తా చాటిన ఇరాన్.. ఫిఫా ప్రపంచకప్‌లో పోటీపడుతూ ప్రపంచ దేశాలకు బలమైన సందేశం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల అమెరికాతో చర్చలకు వేదికైన ఇస్లామాబాద్‌కు బయల్దేరిన ఇరాన్ ప్రతినిధుల బృందం విమానానికి ‘మినాబ్ 168’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిఫా ప్రపంచకప్‌లో పోటీపడే ఇరాన్ జట్టుకు సైతం మినాజ్ 168 పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ఇరాన్ ఫుట్‌బాల్ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో ఈ ఏడాది ఫిబ్రవరి 28న మినాబ్‌లోని ఓ పాఠశాలపై బాంబుల వర్షం కురిపించారు. ఆ వైమానిక దాడిలో 168 మంది స్కూల్ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దమణకాండలో మానవ హక్కుల హననానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే, ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు మినాబ్ 168 జెర్సీలతో ప్రపంచకప్‌లో బరిలోకి దిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రూల్స్ పేరిటి ఫిఫా ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? లేదా? అనేది చూడాలి.
ఇరాన్‌కు వీసా కష్టాలు
- Advertisement -
- Advertisement -



