Thursday, April 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌ మెట్రో టేకోవర్‌ పూర్తి

హైదరాబాద్‌ మెట్రో టేకోవర్‌ పూర్తి

- Advertisement -

స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
రూ.1,461 కోట్ల ఈక్విటీతో వందశాతం షేర్ల బదిలీ
రూ.13,538 కోట్ల అప్పునకు ప్రభుత్వమే పూచీకత్తు
మెట్రో రెండో దశ విస్తరణకు మార్గం సుగమం

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ మహానగర ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేసిన మెట్రో రైలు ఇకపై పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానుంది. ఇప్పటి వరకు పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్ట్‌నర్‌ షిప్‌(పీపీపీ) పద్ధతిలో ఎల్‌అండ్‌టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్‌ మెట్రో రైలును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో కీలక ఒప్పందం కుదిరింది. మెట్రో రైలు ఫేజ్‌-1 కార్యకలాపాలు నిర్వహించే ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌(ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌)లోని వంద శాతం షేర్లను కొనుగోలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వాటాల బదిలీ
హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌-1ను ‘హైదరా బాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ద్వారా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో చర్చలు ఫలించాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ఉన్న వంద శాతం షేర్లను రూ. 1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ చారిత్రక ఘట్టంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ తరఫున ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఎల్‌అండ్‌టీ తరఫున డికె.సేన్‌, కెవిబి.రెడ్డి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు.

అప్పు బాధ్యత ప్రభుత్వానిదే..
వాటాల బదిలీ మాత్రమే కాకుండా, మెట్రోపై ఉన్న భారీ రుణ భారాన్ని కూడా ప్రభుత్వం స్వీకరించనుంది. ఎల్‌అండ్‌టీ హామీతో ప్రస్తుతం ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును ఈనెల 30 నాటికి రాష్ట్ర ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్‌ చేయనున్నారు. ఈ భారీ ఆర్థిక లావాదేవీకి ఐడీబీఐ క్యాపిటల్‌’ ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్‌గా వ్యవహరించగా, ‘సరాఫ్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌’ న్యాయ సలహాలు అందించింది.

సమన్వయంతో రెండో దశ విస్తరణ
ప్రస్తుతం మెట్రో ఫేజ్‌-1లో 69 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో నిత్యం 4.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే, ప్రయివేట్‌ సంస్థ నిర్వహణలో ఉండటంతో ఫేజ్‌-2 విస్తరణ పనుల్లో సాంకేతిక, ఆర్థిక సమన్వయ లోపాలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు మెట్రో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో.. మొదటి దశ, ప్రతిపాదిత రెండో దశ నెట్‌వర్క్‌ పనుల ప్రణాళిక, అమలు, సేవల అందజేతలో పూర్తిస్థాయి సమన్వయం సాధ్యమవుతుంది. ఇది ప్రయాణికులకు మరింత మెరుగైన, చౌకైన సేవలు అందించేందుకు దోహదపడనుంది.

ముఖ్యమంత్రితో ఎల్‌అండ్‌టీ చైర్మెన్‌ భేటీ
ఒప్పందానికి ముందు ఎల్‌అండ్‌టీ చైర్మెన్‌, ఎండీ ఎస్‌ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం, మెట్రో అప్పగింత ప్రక్రియ, భవిష్యత్‌ ప్రాజెక్టులపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకోవడం ద్వారా సామాన్యుడికి మెట్రో ప్రయాణాన్ని మరింత చేరువ చేస్తామని సర్కారు ధీమా వ్యక్తం చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -