దేశవ్యాప్తంగా తెలంగాణ రెవెన్యూ జేఏసీ అధ్యయనం
బెంగళూరులో రెవెన్యూ క్లబ్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవం
ముఖ్యఅతిథిగా కర్నాటక సీఎం సిద్ధరామయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమర్థ భూ పరిపాలన లక్ష్యంగా తెలంగాణ రెవెన్యూ జేఏసీ దేశవ్యాప్తంగా అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (కేఏఎస్), రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో రెవెన్యూ క్లబ్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి, కో చైర్మన్ కె రామకృష్ణ, టీజీటీఏ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రమేష్ పాక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సేవల్లో అధికారులు సమగ్రత, సమర్ధత కలిగి ఉండటానికి రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏ విధంగా ఉపయోగ పడుతుందనే అంశంపై వారు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ద్వారా అధికారులు ప్రభుత్వ సేవల్లో కలిగి ఉండాల్సిన వృత్తి నైపుణ్యం, విధుల్లో బాధ్యత, ఆధునిక పరిపాలనా దృక్పథానికి ఒక కొత్త దిశను గుర్తించారు. రెవెన్యూ క్లబ్ లక్ష్యం అధికారుల సామర్థ్యాలను పెంపొందించడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, పరిపాలనలో సమర్థతను పెంచడం తదితర ప్రధాన అంశాలను కలిగి ఉంది. రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరంతర అభ్యాసం, పరిశోధనాత్మక ఆలోచన, ప్రాక్టికల్ అడ్మినిస్ట్రేషన్ నైపుణ్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించారు.
కర్నాటక ప్రభుత్వం ఏటా రూ.3 కోట్ల ఆర్థిక సహకారం
రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌కు కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏటా రూ.మూడు కోట్ల ఆర్థిక ప్రోత్సాహం అందించనుంది. ప్రభుత్వానికి ఈ కార్యక్రమంపై ఉన్న ప్రత్యేక బాధ్యతలను గుర్తు చేస్తున్నట్టు తమ అధ్యయనంలో గుర్తించామని టీజీఈజేఏసీ చైర్మెన్ లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాలు పరిపాలనా వ్యవస్థలో ముఖ్యమైన భాగస్వాములని పేర్కొన్నారు. అధికారుల మధ్య సమన్వయం పెంచడమే కాకుండా, విధానాల అమలులో ఉన్న లోపాలను గుర్తించి, వాటి పరిష్కారానికి మార్గదర్శకంగా ఉండేలా రూపొందించారని తెలిపారు. ఇలాంటి రెవెన్యూ క్లబ్‌లు ఒకవైపు ఉద్యోగుల హక్కులను కాపాడుతూనే, మరోవైపు ప్రభుత్వ లక్ష్యాల సాధనలో భాగస్వాములవుతున్నాయని వివరించారు. అధికారుల నైపుణ్యాభివృద్ధిని సంస్థాగతంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ విధమైన అధ్యయన పర్యటనల ద్వారా మంచి పద్ధతులను గుర్తించి, వాటిని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా స్వీకరించడం అత్యంత ప్రాముఖ్యమైనదని తెలిపారు. ప్రజా సంక్షేమంలో ఉద్యోగ సంఘాల పాత్ర కీలకం కావాలని ఆకాంక్షించారు. పాలనలో పారదర్శకత, వేగం, ప్రజలతో అనుబంధం పెరగాలంటే అధికారుల నైపుణ్యం, విజన్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. కర్ణాటకలోని రెవెన్యూ క్లబ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ దేశానికి ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తుందని తెలిపారు. ఈ అనుభవాన్ని పాఠంగా తీసుకుని, తెలంగాణలో కూడా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పరిపాలనను మరింత సమర్థవంతంగా, ప్రజలకందుబాటులో ఉండేలా చేయొచ్చని పేర్కొన్నారు.



