Tuesday, May 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతానికి కృషి

విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతానికి కృషి

- Advertisement -

ప్రపంచస్థాయి సాంకేతికత వినియోగం
ప్రమాదాల సమయంలో 
‘గోల్డెన్‌ అవర్‌’ కీలకం :
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
హైదరాబాద్‌లో భారీ విపత్తు నిర్వహణ మాక్‌ డ్రిల్‌ ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్‌

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని.. తద్వారా ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం, ఆస్తి నష్టాన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ మాక్‌ ఎక్సర్‌సైజ్‌లలో భాగంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ వద్ద సోమవారం నిర్వహించిన భారీ మాక్‌ డ్రిల్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా తెలంగాణలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు విపత్తుల సమయంలో మరింత బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా సేవలందించాలని సూచించారు.

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంటను ‘‘గోల్డెన్‌ అవర్‌’’గా పరిగణించాలని తెలిపారు. ఆ సమయంలో సిబ్బంది పూర్తి సమన్వయంతో పనిచేస్తూ అత్యాధునిక పరికరాలను వినియోగించి ప్రజలకు తక్షణ సేవలు అందించాలని సూచించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకుని వైద్య, రక్షణ సేవలు అందించాలని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ రక్షణ కోసం ఆధునిక సాంకేతిక పరికరాలు, శిక్షణ పొందిన రెస్క్యూ బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలు పచ్చదనాన్ని నాశనం చేస్తుండగా, పట్టణాల్లో పెరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో అత్యుత్తమ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు.

కనువిందు చేసిన రెస్క్యూ ఆపరేషన్లు
మాక్‌ డ్రిల్‌లో భాగంగా గాలితో నింపే లైఫ్‌ బోట్లు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే అత్యాధునిక పద్ధతులు, అత్యవసర తరలింపు చర్యలు, సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్‌లను ప్రత్యేక బృందాలు ప్రదర్శించాయి. అనంతరం మంత్రి నెక్లెస్‌ రోడ్‌ బోటింగ్‌ క్లబ్‌ను సందర్శించి అక్కడి సహాయక చర్యలను పరిశీలించారు. రాష్ట్రంలో ఇంత విస్తృత స్థాయిలో మాక్‌ ఎక్సర్‌సైజ్‌లు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా అధికారులను మంత్రి అభినందించారు. మీడియా, సోషల్‌ మీడియా వేదికల ద్వారా ప్రజలకు బాధ్యతాయుతమైన, నిజమైన సమాచారం మాత్రమే చేరాలని, పుకార్లను నమ్మొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌ సింగ్‌మాన్‌, హైడ్రా కమిషనర్‌ ఏవి.రంగనాథ్‌, ఎన్‌డీఎంఏ లీడ్‌ కన్సల్టెంట్‌ మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) సుధీర్‌ బెల్‌, పోలీస్‌, ఫైర్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పరిశ్రమలు, రవాణా, పశుసంవర్ధక, వెటర్నరీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -