– ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొనసముందర్ గ్రామంలోని రైతు వేదిక భవనంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాల కార్యక్రమాన్ని టీజీబీ చీఫ్ మేనేజర్ విలాస్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని తెలిపారు.
మహిళలు కుటుంబాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆర్థికంగా బలపడితే గ్రామాలు,రాష్ట్రం అభివృద్ధి చెందుతాయన్నారు.సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వయం ఉపాధి,చిన్న పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో మహిళలు ముందుకు రావాలని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా భారీ స్థాయిలో రుణాలు అందించడం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక మార్పు తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను వృథా ఖర్చులకు వినియోగించకుండా పాడి పరిశ్రమ,కిరాణా దుకాణాలు,కుట్టు యంత్రాలు,చిన్న వ్యాపారాలు,స్వయం ఉపాధి రంగాల్లో పెట్టుబడులుగా పెట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాలని సూచించారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగితే పిల్లల విద్య,కుటుంబ సంక్షేమం, గ్రామాభివృద్ధిపై సానుకూల ప్రభావం ఉంటుందని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా నిలుస్తూ గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తోందని, మహిళలు కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అనంతరం 12 మహిళా సంఘాలకు రూ.2 కోట్ల విలువైన రుణాల చెక్కులను వారి చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెజ్జారం రాకేష్, ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్,దక్కన్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మహేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెంగల అశోక్, ఐకేపీ సీసీలు అడెల్లి రవి, పీరియా నాయక్, గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులు మేఘన, మౌనిక, శృతి, గ్రూప్ లీడర్లు లాడే లత, బండి మమత, జ్యోతి, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



