నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఈనెల 17న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాకు రానున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల నిమిత్తం నల్లగొండ జిల్లాకు వచ్చిన మంత్రి మాన్యం చెల్క ఉర్దూ మీడియం ప్రైమరీ పాఠశాల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు రూ.13000 కోట్లతో ” హ్యం రోడ్లను” నిర్మించనున్నామని, ఇందులో భాగంగా 6300 కిలోమీటర్ల రోడ్లను డబుల్ రోడ్డు గా మార్చేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు.
పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 17న సాయంత్రం కనగల్ సమీపంలో హ్యాం రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. అనంతరం ధర్వేశిపురం ఎల్లమ్మను దర్శించుకుంటారని తెలిపారు. పంచాయతీరాజ్ కి సంబంధించి మరో రూ.7,000 కోట్లతో నూతన రహదారులు నిర్మించనున్నట్లు చెప్పారు. హ్యాం రోడ్ల లో భాగంగా మొదటి ప్యాకేజీ కింద సిఆర్ఎఫ్ ద్వారా రూ.300 కోట్లతో ధర్వేశిపురం నుండి గుర్రంపోడు, కొండమల్లేపల్లి నుండి డిండి వరకు డబుల్ రోడ్డు చేపట్టడం జరిగిందని, మొత్తం 1334 ప్యాకేజీలుగా విభజించామని, రూ.13000 కోట్ల పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
శంకుస్థాపన అనంతరం భారీ బహిరంగ సమావేశాన్ని కనగల్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. డబుల్ రోడ్ల నిర్మాణం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని, తద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. నల్గొండతో పాటు, వలిగొండ, ఆలేరు తదితర ప్రాంతాలకు కూడా రూ.600 కోట్లతో రోడ్లు నిర్మించనున్నమని తెలిపారు. అలాగే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.125 కోట్లతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు ఈ వారంలో టెండర్లు పిలువనున్నామని, నల్లగొండ పట్టణాన్ని తెలంగాణలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
17న నల్లగొండకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



