Thursday, June 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిమ్జ్ పేరిట బలవంతపు భూ సేకరణ ఆపాలి

నిమ్జ్ పేరిట బలవంతపు భూ సేకరణ ఆపాలి

- Advertisement -

గడువు దాటిన తర్వాత
నోటీసులిచ్చి మోసం
తొలగించిన యాజమాన్య హక్కులు పునరుద్ధరించాలి
మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లించాలి
కోర్టు తీర్పు వచ్చే వరకు భూ సేకరణ చేయొద్దు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎల్గోయి రైతుల బహిరంగ లేఖ

నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయ భూములను బలవంతంగా నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించవద్దని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామ రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాంచందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను బుధవారం జహీరాబాద్‌లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట విడుదల చేసి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించారు. ఆ లేఖలో రైతులు తమ ఆవేదనను ముఖ్యమంత్రికి వెలిబుచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, రాంచందర్ మాట్లాడుతూ.. ఇప్పటికే నిమ్జ్ ప్రాజెక్టు కోసం తమ గ్రామం నుంచి 2వేల ఎకరాల భూమినిచ్చామని, మిగిలి ఉన్న భూములను సైతం తీసుకుంటామంటే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. గ్రామంలో గ్రామ సభ నిర్వహించి మిగిలి ఉన్న కొంత భూమిని ప్రాజెక్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశామన్నారు. కానీ రైతుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా బలవంతంగా భూసేకరణను అధికారులు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సారవంతమైన భూములను వ్యవసాయం నుంచి మళ్లించి పరిశ్రమల కోసం తీసుకోవడం సరైంది కాదన్నారు. భూ సేకరణ నోటిఫికేషన్‌కు ముందు మార్కెట్ విలువలు సవరించలేదని తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను, ఆవేదనను అధికారులకు తెలియజేశామన్నారు.}

తేదీ గడిచినంక నోటీసులు..
భూ సేకరణ కోసం అధికారుల విచారణకు రావాలంటూ గడువు దాటిన తర్వాత రైతులకు నోటీసులు పంపారని, దాని వల్ల విచారణకు హాజరుకాలేదని, కానీ అధికారులు మాత్రం తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకోకుండా ఏక పక్షంగా భూములను గుంజుకుంటున్నారంటూ రైతులు లేఖలో ముఖ్యమంత్రికి విన్నవించారు. 2026 ఏప్రిల్ 13వ తేదీన విచారణకు రావాలని రైతులకు 16, 17, 18 తేదీల్లో నోటీసులు అందించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై రైతులందరం కలిసి హైకోర్టులో కేసు వేశామని, కోర్టు తీర్పు వచ్చే వరకు భూ సేకరణ చేయొద్దని కోర్టు తీర్పు ఇచ్చినా దాన్ని అధికారులు, జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదన్నారు. పైగా బలవంతంగా భూ సేకరణ చేస్తూ పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమచేయడం లాంటి చర్యలకు పాల్పడ్డారని వివరించారు.

2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న తమకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని, లేదా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో రైతులు అభ్యర్థించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎకరాకు రూ.60 లక్షల నుంచి రూ.80లక్షలు పలుకుతుందని, కానీ అధికారులు మాత్రం ఎకరాకు కేవలం రూ.4.50 లక్షలు మాత్రమే నిర్ణయించడం అన్యాయమన్నారు. భూముల విలువలు సవరించేటప్పుడు రైతుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకోవాలని హైకోర్టు చెప్పినా అధికారులు ఏకపక్షంగా భూములకు ధరలు నిర్ణయించి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతపు భూ సేకరణ ఆపాలని, ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, తప్పని పరిస్థితుల్లో భూమి కావాలంటే తమకు భూమికి భూమి ఇచ్చి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రైతులు లేఖలో కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్గోయి గ్రామ రైతులు యూనుస్, గోపాల్, అంజన్న, ఖైరత్ అలీ, సంగన్న, శివన్న, నారాయణ, మొనప్ప, లక్ష్మి, పెంటన్న, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -