గ్రామీణ భారతంలో
ధరల ప్రభావం అధికం
కేంద్ర ప్రభుత్వ గణాంకాలు విడుదల
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభ ప్రభావంతో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గడచిన మే నెలలో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.93 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నెలలో ఇది 3.48 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్‌లోని 4.20 శాతం నుండి మే నాటికి 4.78 శాతానికి ఎగబాకింది. మే నెలలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ భారతంలోనే ధరల ప్రభావం ఎక్కువగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదు కాగా, పట్టణ ప్రాంతాల్లో 3.53 శాతంగా ఉంది. అలాగే ఆహార ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 4.85 శాతానికి, పట్టణాల్లో 4.66 శాతానికి చేరింది. వెండి ఆభరణాల ధరలు అత్యధికంగా పెరిగి 155.23 శాతం ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. అంతకుముందు ఏప్రిల్‌లో ఇది 144.36 శాతంగా ఉంది. వంటగదిలో కీలకమైన టమోటా ధరల ద్రవ్యోల్బణం 35.26 శాతం నుండి 48.43 శాతానికి దూసుకెళ్లగా, బంగారం, వజ్రాలు, ప్లాటినం ఆభరణాల ద్రవ్యోల్బ ణం 40.93 శాతానికి చేరింది. వీటితో పాటు అల్లం ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లోని 14.36 శాతం నుండి ఏకంగా 32.49 శాతానికి పెరగ్గా, కిస్‌మిస్, మునాక్కా వంటి డ్రై ఫ్రూట్స్ ధరలు 21.97 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.



