ఆందోళనలో ఇజ్రాయిల్
లెబనాన్‌పై కొనసాగుతున్న
ఇజ్రాయిల్ బాంబు దాడులు
వచ్చే నెలలో ఖమేని
అంత్యక్రియలు
నవతెలంగాణ – జనరల్ డెస్క్
శాంతి ఒప్పందానికి చేరువగా ఉన్నామని ఇరాన్, అమెరికా దేశాలు సంకేతాలు ఇచ్చాయి. అయితే కీలక అంశాలపై ఇంకా అవగాహన కుదరలేదని సమాచారం. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నెరపుతున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా రాబోయే 24 గంటలలో ఒప్పందం ఖరారవుతుందని చెప్పారు. ఓ వైపు ఇరాన్-అమెరికా మధ్య చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ సేనలు బాంబు దాడులు కొనసాగించాయి. తాజా దాడులలో కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుండగా తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను భద్రపరచుకోవడానికి ఇరాన్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం ముడి పదార్థాలను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నించవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో టెహ్రాన్ పలు చర్యలు చేపట్టింది. సొరంగాలను మూసేసింది. కీలకమైన అణు స్థావరాల చుట్టూ మందుపాతరలు అమర్చింది. ఇరాన్ యురేనియం నిల్వలలో అధిక భాగం ఇస్ఫహాన్ అణు సముదాయంలోని భూగర్భంలో ఉన్నదని, ఇతర చోట్ల కూడా స్వల్ప పరిమాణంలో నిల్వ ఉన్నదని తెలుస్తోంది.
ఎవరేమన్నారు?
మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో కుదుర్చుకుంటున్న అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఇంతకుముందు ఎన్నడూ లేనంత చేరువగా ఉన్నదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. అది ఖరారయ్యే వరకూ ఊహాగానాలు చేయవద్దని మీడియాను కోరారు. అరాగ్చీ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో తిరిగి పోస్ట్ చేశారు. ఇరు పక్షాల అంగీకారంతో శాంతి ఒప్పందం ఖరారైందని, అయితే తదుపరి చర్యలు పెండింగులో ఉన్నాయని పాక్ ప్రధాని షరీఫ్ చెప్పారు. ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకాలు జరుగుతాయని, వచ్చే వారం సాంకేతిక స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు. చర్చల సందర్భంగా ఇరాన్, అమెరికాలు చూపిన నిబద్ధతను ప్రశంసించారు. చర్చలకు మద్దతు తెలిపిన మధ్యప్రాచ్య దేశాలకు కృతజ్ఞతలు తెలియ జేశారు. ‘ఈ చారిత్రక ఒప్పందం చిరకాల శాంతికి బలమైన పునాది వేస్తుందని మాకు నమ్మకం ఉంది’ అని అన్నారు. కాగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతిపై పాకిస్తాన్, ఈజిప్ట్ హర్షం వ్యక్తం చేశాయి. శాంతి ఒప్పందంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సమసిపోతాయని తెలిపాయి.
ఒప్పందంపై ఇజ్రాయిల్ ఆందోళన
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం ఇజ్రాయిల్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే దేశ ప్రజల ముందు ఇజ్రాయిల్ ఉంచిన వ్యూహాత్మక లక్ష్యాలు వేరేగా ఉన్నాయి. యుద్ధాన్ని ముగించే ఉద్దేశం ఇజ్రాయిల్‌కు లేదు. ఇరాన్-అమెరికా మధ్య కుదిరే ఒప్పందం కంటే లెబనాన్‌పై పట్టు సాధించడానికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రాధాన్యత ఇస్తున్నారు.
వచ్చే నెలలో ఖమేనీ అంత్యక్రియలు
అమెరికా-ఇజ్రాయిల్ దాడులలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్య క్రియలు జూలైలో మొదలవు తాయని ప్రభుత్వ మీడియా తెలిపింది. జూలై 4, 5 తేదీలలో టెహ్రాన్‌లో వీడ్కోలు కార్యక్రమం జరుగుతుందని, ఆ మరునాడు టెహ్రాన్‌లో, జూలై 7న ఖ్వోమ్‌లో అంత్యక్రియలు జరుగుతాయని వివరించింది. జూలై 9న మష్‌హద్ నగరంలోని ఇమామ్ రెజా మసీదులో మరో అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఖమేనీ భౌతికకాయాన్ని ఖననం చేస్తారు.



