Sunday, June 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రజలపై ధరల భారం

ప్రజలపై ధరల భారం

- Advertisement -

పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న కేంద్రం
లేబర్‌ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర నష్టం
అధికారం కోసం బీజేపీ మత రాజకీయాలు
ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలు నెలకొల్పాలి
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
సీపీఐ(ఎం) మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా బోడంకి చందు ఎన్నిక

నవతెలంగాణ- నస్పూర్‌
ఒకవైపు అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తుంటే.. మరోవైపు కేంద్రంలోని మోడీ సర్కార్‌ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెను భారం మోపుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలో శనివారం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కనికరం అశోక్‌ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. వారికి అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. కార్మికులు దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న హక్కులను క్రమంగా హరిస్తోందని తెలిపారు. పని గంటలు, ఉద్యోగ భద్రత, యూనియన్‌ హక్కులు, వేతనాల పరిరక్షణ వంటి అంశాల్లో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను బలహీనపరిచి ప్రయివేటీకరణను వేగవంతం చేయడం వల్ల యువతకు శాశ్వత ఉద్యోగాలు దూరమవుతున్నాయన్నారు. కేంద్రంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ప్రధాన మంత్రి వాటిని భర్తీ చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించి గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసే మరిచారన్నారు.

బీజేపీ మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడానికి మత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం వంటి ప్రాథమిక హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగం తీవ్రమైన సమస్యగా మారిందని చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కొత్త ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలను నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఆర్థికభారం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తామనడం సరికాదన్నారు. దీనివల్ల దళిత, ఆదివాసీ, పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదముందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా బోడంకి చందును రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ప్రకాష్‌, చందు, అశోక్‌, పున్నం, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్‌ కుమార్‌, అశోక్‌, ఉమారాణి, మల్లీశ్వరి, ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -