కార్పొరేట్ల చేతుల్లోకి
రైతు ఉత్పత్తి వనరులు
ఫర్టిలైజర్, డీజిల్ ఇతర సాగు
ఖర్చులతో అన్నదాత కుదేలు
ఎరువుల సరఫరాపై ఇజ్రాయిల్-
ఇరాన్ యుద్ధం ప్రభావం
భారత రైతాంగానికి ప్రమాదకరంగా ద్వైపాక్షిక స్వేచ్ఛా ఒప్పందాలు : అరిబండి లక్ష్మి నారాయణ స్మారకోపన్యాసంలో
ప్రొఫెసర్ మధుర స్వామినాథన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారతదేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదనీ, పాలకుల విధానాలతో రైతులే సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్(బెంగళూరు) ప్రొఫెసర్, ఆర్థిక వేత్త మధుర స్వామినాథన్ చెప్పారు. భారత రైతాంగానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రమాదకరంగా మారబోతున్నాయని హెచ్చరించా రు. ఉత్పత్తి వనరులు క్రమంగా రైతుల నుంచి దూరమవుతూ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ లోని బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరిబండి ఫౌండేషన్-తెలంగాణ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అరిబండి లక్ష్మినారాయణ ఎనిమిదో స్మారకోపన్యాసంలో భాగంగా ‘’భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు-జీవనోపాదులపై ప్రభావం ’అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుర స్వామినాథన్ మాట్లాడుతూ దేశంలో 2014 నుంచి నేటి వరకు రైతుల నిజ ఆదాయం 1.4 శాతం తగ్గిందని గణాంకాలతో వివరించారు. చైనా, మన దేశ జనాభాలు( ప్రపంచ జనాభాలో 18 శాతం చొప్పున) ఇంచుమించు దగ్గరగా ఉన్నాయనీ, చైనా ఉత్పత్తులు 30 శాతం ఎగుమతి అవుతుంటే మన దేశ ఎగుమతి అయ్యే ఉత్పత్తుల వాటా శాతం కేవలం 13 శాతమే ఉందని చెప్పారు. డబ్ల్యూటీవో ఒప్పందాలు అభివృద్ధి చెందిన దేశాలకు లాభదాయ కంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నష్టదాయకంగా ఉన్నాయని చెప్పారు. అమెరికా, ఆస్ర్టేలియా, యూరప్ దేశాల్లో రైతులకు ఇస్తున్న సబ్సిడీలు ఎక్కువనీ, మన దేశంలో ఇస్తున్నవి అంతంత మాత్రమేనని వివరించారు. దేశంలో ఇచ్చే ఎమ్మెస్పీ కూడా తక్కువేనని తెలిపారు.
గత పదేండ్ల నుంచి అధిక లాభాలు, వ్యవసాయ అధిక, మిగులు ఉత్పత్తులను అమ్ముకునేందుకు పెట్టుబడిదారి దేశాలు డబ్ల్యూటీవో నుంచి బయటకొచ్చి పలు దేశాలతో నేరుగా ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయన్నారు. మన దేశంలో పాల ఉత్పత్తులు అధికంగా ఉన్నాయనీ, అలాంటప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పెట్టుబడి దారీ దేశాల మిగులు ఉత్పత్తులను అమ్ముకునేందుకు, కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంపొందించేందుకు అనుకూలంగా భారతదేశం కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలుంటున్నాయని తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి గోదాములను అదానీ లాంటి కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ఆహార ధాన్యాలను గోదాముల్లో నిల్వ చేస్తే విపత్కర పరిస్థితుల్లో అక్కరకొస్తాయనీ, అవే గోదాములను ప్రయివేటు శక్తులకు అప్పగిస్తే ప్రజల బాగోగులను విస్మరించి లాభాల కోసమే చూస్తాయని వివరించారు. దీనివల్ల ప్రజల ఆహారభద్రత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిర్ధిష్టమైన వ్యవసాయ విధానాలతో వియత్నాం, బంగ్లాదేశ్, థాయిలాండ్, తదితర పశ్చిమాసియా దేశాల్లో రైతులకు సాగు లాభసాటిగా ఉందన్నారు. మన దేశంలో రైతుకు హెక్టార్‌కు సగటున రూ. 20 వేలు మిగిలితే, పశ్చిమాసియా దేశాల్లో రూ.లక్ష మిగులుతున్నాయని వివరించారు.
మన దేశంలో ప్రతి ఏటా సీడ్స్‌పై రైతులు రూ.58 వేల కోట్లు, ఫర్టిలైజర్స్‌కు రూ.66 వేల కోట్లు, సాగు కోసం వాడే డీజిల్‌కు రూ.33 వేల కోట్లు, కొన్ని చోట్ల నీళ్ల కొనుగోలు.. ఇలా రైతులకు సాగువ్యయం భారంగా మారుతున్న తీరును విడమర్చి చెప్పారు. ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయిల్ అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధాల వల్ల ఫర్టిలైజర్, డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలోని సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చైనా, రష్యా దేశాలు తమకు అవసరమైన ఎరువులను ముందే నిల్వ చేసుకున్నాయనీ, ఎగుమతులపై నిషేధం విధించాయని గుర్తుచేశారు. ఆ ముందు చూపు మన దేశం వద్ద లేకుండా పోయిందన్నారు. అధిక ఫెర్టిలైజర్స్ వాడకంతో తగ్గుతున్న భూసారం : ప్రొఫెసర్ వీరేపల్లి రంగారావు, భారత నూనెగింజల పరిశోధన సంస్థ పూర్వపు డైరెక్టర్ మన దేశంలో ఇష్టానుసారంగా అధిక ఫెర్టిలైజర్స్ వాడకం, దశాబ్దాలుగా ఒకే పంటను సాగు చేయడం వంటి కారణాలతో భూసారం తగ్గిపోయింది. దీంతో రైతులకు వ్యవసాయంలో లాభసాటి లేకుండా పోతున్నది. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓ)ల ద్వారా రైతులు సాగు చేయాలి. రైతు కేంద్రంగా సబ్సిడీలు, వ్యవసాయ పథకాలు ఉండాలి.
చాలా వరకు ఆర్గానిక్ ఫార్మింగ్‌కు లైసెన్సులు లేవు. దీనివల్ల వాటిపై విశ్వసనీయత లేకుండా పోతుంది. పంట సేకరణకు కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. నూనెగింజల దిగుమతిపై సుంకం ఎత్తేయడం సరికాదు. దేశంలోని ప్రజలకు ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయిల్ సీడ్ సాగు చేసే రైతులకు బోనస్ ఇచ్చి, సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి. బహుళ పంటలను సాగు చేయాలి :
డాక్టర్ లతీఫ్ పాషా, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్ట్ దశాబ్దాలుగా రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను వరుసగా సాగు చేస్తుండటం వల్ల నేలల్లో సేంద్రీయ కర్భన శాతం 1.5 శాతం నుంచి 0.3 వరకు పడిపోయింది. రైతులు అధిక లాభాల కోసం బహుళ పంటలను సాగు చేయాలి. పాడిపశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలను పెంచాలి. తరుచూ పంటలను మార్పిడి చేసి పండిస్తే చీడపీడలు అదుపులో ఉంటాయి. పంటల్లో ఐదారు సాళ్లకు ఒకటి సాలు కంది, ఇతర పప్పుధాన్యాల పంటలను సాగు చేస్తే ప్రధాన పంటకు పురుగులు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో అంతర పంటలు భూమిలో నత్రజనిని స్థిరీకరించడంతో ఎరువుల వాడకం తగ్గుతుంది. పంటల అవశేషాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలి.
ఉద్యానవన పంటలతో రెట్టింపు ఆదాయం : డాక్టర్ జి.సురేశ్, ఉద్యానవన విశ్వవిద్యాలయం సైంటిస్ట్ వరి, మొక్కజొన్న, పత్తి పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలను సాగు చేస్తే రెండు రెట్ల ఆదాయాన్ని పొందే అవకాశాలున్నాయి. తెలంగాణలో కూరగాయల సాగుకు అనుకూలమైన భూములు, వాతావరణ పరిస్థితులున్నాయి. అయినా, కర్నాటక, మహారాష్ట్ర, చివరకు రాజస్థాన్ నుంచి కూడా కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. 2035 నాటికి 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల తోటలను పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అయితే, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం కావాలి. కోతుల బెడదను నివారించేందుకు ఆగ్రోఫారెస్ట్‌లలో పండ్ల మొక్కలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాం. కూరగాయల పంటల సాగులో విత్తనశుద్ధి, నీటియాజమాన్య పద్ధతి కీలకం. కూరగాయల పంటల సాగులో ఎర పంటల్ని (బంతి, నువ్వులు, కంది) వేయాలి. అలాచేస్తే తెగుళ్లు తక్కువ వస్తాయి. ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడకం తగ్గుతుంది. పంటల మార్పిడి ద్వారా పంటచేన్లకు వచ్చే సగం రోగాలను నివారించవచ్చు.
ఆదర్శ కమ్యూనిస్టు అరిబండి లక్ష్మినారాయణ :
ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి
మాజీ ఎమ్మెల్యే అరిబండి లక్ష్మినారాయణ ఆదర్శ కమ్యూనిస్టు అని ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో లక్ష్మినారాయణ పాలుపంచుకున్నారనీ, సుందరయ్య, బీఎన్‌వంటి మహనీయులతో కలిసి పనిచేశారని స్మరించుకున్నా రు. ఎమ్మెల్యే అయ్యాక కూడా ఆయన ప్రజలతో కలిసి సాధారణంగా బస్సుల్లో ప్రయాణించేవారని గుర్తుచేశారు. అసమానతలు లేని సమాజం రావాలని కోరుకున్నారనీ, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులను తయారు చేశారని కొనియాడారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, కోశాధికారి ఎం. శోభన్, సీసీఎమ్‌బీ రిటైర్డ్ సైంటిస్టు డాక్టర్ వీరభద్రరావు, అరిబండి లక్ష్మినారాయణ ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ అరిబండి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.



