కోర్టు నోటీసులతో హైడ్రా ఇబ్బందులు
ఇలాంటి అడ్డంకులతో మంచి ఎలా సాధ్యమంటున్న సిబ్బంది
హైడ్రాపై కోర్టుకు వెళ్తున్న కొందరు
తమకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకుంటున్న వైనం
పాలక రాజకీయ పార్టీల నేతలే అడ్డంకినా?
వర్షాకాలం గట్టెక్కేదెలా!
చినుకుపడితేనే నగరం అతలాకుతలం
ప్రభుత్వంలోని అన్నిశాఖల మద్దతు ఉండాలంటున్న మేధావులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
చినుకుపడితే చాలు హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఎక్కడా ఏ నాలా ఉప్పొంగుతుందో తెలియదు.. ఏ చెట్టు విరిగిపడుతుందోనని భయం. వర్షాకాలంలో కాలనీలకు కాలనీలు వాగుల్లా, చెరువుల్లా మారుతున్నాయి.. రోడ్లన్నీ కాలువలుగా మారిపోవడం.. నగరంలో తరచూ చూసే అంశాలు. వీటన్నిటికీ కారణం చెరువుల ఆక్రమణ.. నాలాల కబ్జాలు. డ్రయినేజీలను ఆక్రమించి కొంతమంది బిల్డర్లు భవనాలు నిర్మించడం.. కొంతమంది అధికారుల అలసత్వం.. దీంతో వర్షం నీరు పోయే దారిలేక నగరాన్ని ముంచెత్తుతోంది. వర్షం పడి విపత్తు వచ్చినప్పుడల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు రావడం, వచ్చేయేడు నగరంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూస్తాం, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని, వెంటనే తొలగిస్తామని హామీలివ్వడం పరిపాటిగా మారింది. నాలాలను శుభ్రం చేస్తాం, వర్షం నీరు సజావుగా పోయే విధంగా ఏర్పాట్లు చేస్తం అనే ఈ మాటలు కూడా షరామామూలే. అయితే తాజాగా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం వల్ల కొంతమార్పు వచ్చిందన్న అభిప్పాయం ప్రజల్లో ఉంది. హైడ్రాపై కొన్ని అనుమానాలు కొంతమంది నుంచి వ్యక్తమవుతున్నా.. ఎక్కువ విషయాల్లో లాభం కలుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది కబ్జాదారులు పాలక రాజకీయ పార్టీల అండదండలతో అడ్డుతగలడం, కోర్టుకు వెళ్లడం, కోర్టు నోటీసులతో ఇబ్బందులకు గురి చేయడం ఇబ్బందిగా మారింది.
నోటీసులు, అడ్డు తగలడం హైడ్రాను ఏమి చేయలేవని, న్యాయస్థానం తీర్పులను అనుసరించే ముందుకు వెళుతున్నామని హైడ్రా సిబ్బంది అంటున్నారు. అప్పగించిన పనులు పూర్తి చేసి తీరుతామని, ప్రజలకు గట్టి భరోసా ఇస్తామని చెబుతున్నారు. తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఐపీఎస్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో 24/7 నిరంతరాయంగా పనిచేస్తున్న హైడ్రా పనితీరుతో చెరువులు ఆక్రమణల చెరనుంచి బయటపడుతున్నాయి. పార్కులు, క్రీడా స్థలాలతోపాటు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు తొలగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ పనులు చేయకుండా హైడ్రాను నిలువరిస్తే యథాతథ పరిస్థితులు నెలకొంటాయి. ఈ విషయం తెలిసి కూడా ఆ పనులు చేయకుండా హైడ్రా చేతులకు సంకెళ్లు వేస్తే ఏమిటన్నది కొంతమంది నగరవాసుల ప్రశ్న. ఇప్పుడిప్పుడే నగరంలో పరిస్థితులు మారుతున్నాయి. ఈ సమయంలో హైడ్రా తన పనులను పూర్తి చేయకుండా నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది. కొందరు కోర్టులకు పోతున్నారు. మరికొందరు వారికి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకొని ఆక్రమణలను తొలగించకుండా యథాతథంగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించాలి. పాలక రాజకీయ పార్టీల నేతల నుంచే గాకుండా ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి హైడ్రాకు మద్దతు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని మేధావులు కోరుతున్నారు. లేకపోతే వర్షాకాలంలో వర్షం నుంచి సిటీని రక్షించడం కష్టమవుతుందని అభిప్రాయపడుతున్నారు.
హైడ్రా ఏర్పాటుతోనే మార్పు
ప్రభుత్వం నగరంలో హైడ్రాను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడంతో అనతికాలంలోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైడ్రా కమిషనర్ బాధ్యతలను ఐజీ ఏవీ రంగనాథ్‌కు అప్పగించడంతో హైడ్రాను ఉరుకులు పరుగులు పెట్టించారు. 400కుపైగా చెరువులతో లేక్ సిటీగా పేరున్న నగరంలో కొన్ని చెరువులు 80శాతం, మరికొన్ని 100శాతం కనిపించకుండా పోయాయి. యథేచ్ఛగా చెరువులను, నాలాలను కబ్జా చేశారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ రంగనాథ్ పుణరుద్ధరించడానికి అన్ని చర్యలూ తీసుకున్నారు. భూ కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టించారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్రంలోని మిగతా పట్టణాల్లోనూ హైడ్రాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరిగింది. గతంలో చెరువులు, నాలాలు కబ్జాలు చేసి లే అవుట్లు, ప్లాట్లు వేసినా ప్రజలకు తెలియకుండానే కొనుగోలు చేసేవారు. లేఔట్ ఉన్నా రోడ్లు, పార్కు ఇవ్వకుండా కబ్జా చేసేవారు. హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత అందరిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వచ్చింది. ఎక్కడ అక్రమ నిర్మాణలు చేపట్టినా స్థానికులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ కొందరు భూ కబ్జాదారులు రాజకీయ పలుకుబడితో హైడ్రా ఎక్కడ ఆక్రమణలను కూల్చివేసినా తప్పుగా ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో వ్యతిరేక వార్తలతో చర్చనీయాంశంగా మారింది. పేదలను, సామాన్యులను ముందుపెట్టి కావాలనే సెంటిమెంట్‌ను వైరల్ చేస్తున్నారని హైడ్రా గతంలోనే పేర్కొంది. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇతర ప్రభుత్వ శాఖలపై ఉంది కానీ, అందరూ అక్కడి కంటే హైడ్రాకు వచ్చి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు, నాలాలు, పార్కులను రక్షిస్తున్నారు. ఇంత చేస్తున్న హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతున్నా ఎక్కడా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారు. హైడ్రాకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. కబ్జాదారుల తప్పుడు ప్రచారాలకు, కోర్టు నోటీసులకు అడ్డుకట్ట పడాలంటే అన్ని విభాగాలు హైడ్రాతో కలిసి పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
చేతులు కట్టేస్తే ఎలా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



