– నెలకు ఒక సమావేశం తప్పనిసరి
– కౌన్సిలర్ల విధులు, గౌరవ వేతనాల
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజా ప్రతినిధులు అనగానే అధికారాలే గుర్తుకు వస్తాయి. అయితే వారికి విధులు, బాధ్యతలు కూడా సమానంగా ఉన్నాయని చాలా మంది పట్టించుకోరు. ఇటీవలే మున్సిపాలిటీ పాలకవర్గంలో భాగమైన కౌన్సిలర్లు రాగద్వేషాలకు అతీతంగా తమకు అప్పగించిన పనులను నిర్వర్తిస్తామని ప్రమాణం సైతం చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్, 2019 ప్రకారం వార్డు సభ్యులు (కౌన్సిలర్లు) నిర్వహించాల్సిన ముఖ్య కర్తవ్యాలు ఇవి:
వార్డు సభ్యుని కర్తవ్యాలు, బాధ్యతలు:
తన వార్డులో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవాలి. ఇంటింటికీ చెత్త సేకరణను పటిష్టపరచడం, తడి-పొడి వ్యర్థాల వేరు వేరు నిర్వహణను ప్రోత్సహించడం, తడి వ్యర్థాలతో ఎరువు తయారీపై పర్యవేక్షణ చేయాలి. జిల్లా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటి వాటిలో కనీసం 85% బ్రతికి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి నష్టం తగ్గించడం, అవసరం లేని బోర్ల వినియోగాన్ని నియంత్రించడం. చెరువులు మరియు ఇతర నీటి వనరులను సంరక్షించడం. ప్రభుత్వం అప్పగించే ఇతర పనులను నిర్వర్తించడం. అభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణ తీసుకోవడం.
పురపాలక ఆస్తుల సంరక్షణలో లోపాలు గమనిస్తే ఛైర్‌పర్సన్ దృష్టికి తీసుకువెళ్లడం. పురపాలక పరిపాలనకు సంబంధించిన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టే హక్కు వినియోగించడం. పట్టణ ఆధునీకరణ ప్రణాళికల రూపకల్పనలో భాగస్వామ్యం కావడం.
ఈ-గవర్నెన్స్, ఆన్లైన్ సేవలు
పౌరులకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించేందుకు ఈ-గవర్నెన్స్ విధానాన్ని అనుసరించడం తప్పనిసరి. నిర్ణీత గడువులో సేవలు అందించకపోతే బాధ్యులపై పెనాల్టీలు విధించే అవకాశం ఉంది. ప్రతి పురపాలిక ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పౌరసేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి.
సమావేశాలు తప్పనిసరి
ప్రతి నెల కనీసం ఒక సమావేశం నిర్వహించాలి. మూడు నెలలలోపు సమావేశం జరగకపోతే కౌన్సిల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధులన్నింటినీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పర్యవేక్షిస్తారు.
అశ్వారావుపేట మున్సిపాలిటీ వివరాలు :
అశ్వారావుపేట 50 వేల లోపు జనాభా కేటగిరీకి చెందినది.ఇది గ్రేడ్ – III మున్సిపాలిటీగా నమోదైంది.
జనాభా ప్రాతిపదికన గౌరవ వేతనాలు ఇలా ఉన్నాయి (2011 జనాభా లెక్కల ప్రకారం):
ఛైర్‌పర్సన్: రూ.12,000 – రూ.15,600
వైస్ ఛైర్‌పర్సన్: రూ.5,000 – రూ.6,500
కౌన్సిలర్లు: రూ.2,500 – రూ.3,250 ప్రతీ నెల
ప్రజా ప్రతినిధులుగా అధికారాలతో పాటు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినప్పుడే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుంది.



