Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌షాక్‌తో గీత కార్మికుడు మృతి

విద్యుత్‌షాక్‌తో గీత కార్మికుడు మృతి

- Advertisement -

తీగలు వేలాడుతున్నాయని ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
అధికారులు పట్టించుకోక పోవడంతోనే మృతి చెందాడని బంధువుల ఆరోపణ
మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎస్‌ఈ
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

విద్యుత్‌ షాక్‌తో గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా, కంది మండలంలో జరిగింది. మృతుడి బందువుల వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా, కంది మండల పరిధిలోని బ్యాతోల్‌ గ్రామానికి చెందిన బోయిని సురేందర్‌ గీత వృత్తి జీవనం సాగిస్తున్నాడు. తాను కల్లుగీసే చెట్ల వద్ద విద్యుత్‌ తీగలు వేలాడుతున్నాయని విద్యుత్‌ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా కూడా విద్యుత్‌ అధికారులు పట్టించుకోలేదని బాధిత బందువులు ఆరోపించారు. బుధవారం ఉదయం బోయిని సురేందర్‌ కల్లు గీసేందుకు చెట్టు ఎక్కగా గాలికి విద్యుత్‌ తీగలు వేలాడడంతో అవి తగిలి షాక్‌కు గురయ్యాడు. దీంతో చెట్టుపై నుంచి పడి అక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మృతికి కారణమైన విద్యుత్‌ అధికారులను సస్పెండ్‌ చేయాలి : తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు
విద్యుత్‌షాక్‌తో మరణించిన కల్లుగీత కార్మికుడు బోయిని సురేందర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవరించిన విద్యుత్‌ అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు డిమాండ్‌ చేశారు. బుధవారం రైతు సంఘం, కల్లుగీత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ ఈ. సుదీర్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా జయరాజ్‌ మాట్లాడుతూ చనిపోయిన కల్లుగీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

కల్లుగీత కార్మికుడు చనిపోవడానికి విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, అందుకు బాధ్యులైన లైన్మెన్‌, ఏఈలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్‌ఈ సుదీర్‌ కుమార్‌ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.రాజయ్య, నాయకులు మాణిక్‌ రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌ గౌడ్‌, విద్యుత్‌ అధికారులు డీఈ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -