Sunday, June 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుయుద్ధ పిపాసి పేరు అవమానకరం

యుద్ధ పిపాసి పేరు అవమానకరం

- Advertisement -

‘ట్రంప్‌ అవెన్యూ’పై సీఐటీయూ నిరసనలో వక్తలు
ఏం ఒరగబెట్టాడని ట్రంప్‌ పేరు పెడుతున్నారు?
సీఎం నిర్ణయం తెలంగాణకు అవమానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

యుద్ధ పిపాసి ట్రంప్‌ ‌పేరును హైదరాబాద్‌‌లోని రోడ్డుకు పెట్టటమా? ఇది తెలంగాణకే అవమానకరమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష‍,ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్ష‍ులు ఎస్‌ ‌వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశానికి ఏం ఒరగబెట్టాడని ఆయన పేరు పెడుతున్నారని వారు ఎద్దేవా చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోరు విప్పాలని వారు డిమాండ్‌ ‌చేశారు. హైదరాబాద్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, నానక్ రాంగూడలోని అమెరికన్ కాన్సులేట్ ప్రాంతంలో ఉన్న రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌‌లో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ వరకు సాగిన ర్యాలీ అనంతరం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి జె. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన నిరసన సభలో చుక్క రాములు, భాస్కర్‌ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టడానికి, ప్రజల, కార్మికుల మీద యుద్ధాలను, యుద్ధ భారాలను రుద్దుతున్నదని తెలిపారు. ప్రపంచ ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మీద ట్రంప్ ఆంక్షతో పాటు ప్రధాని మోడీ వైఖరి వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాదంతో అంటకాగుతూ దేశ భవిష్యత్‌‌ను దానికి తాకట్టు పెడుతున్నదని విమర్శించారు. దేశ స్వాతంత్ర్యానికి, సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నదని చెప్పారు. ప్రజలపై ధరాభారాలు పడటానికి కారకుడైన ట్రంప్ పేరును హైదరాబాద్ రాయబార కార్యాలయానికి పెట్టడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ రోడ్ కు ట్రంప్ పేరు పెట్టటం ద్వారా మోడీ పట్ల తన గురుభక్తిని చాటుకున్నదని ఎద్దేవా చేశారు. బీజేపీ బాటలోనే ఈ నిర్ణయం ఉండటం అత్యంత ఆక్షేపణీయమన్నారు. వీరయ్య మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం ఇరాన్‌‌పై దుర్మార్గంగా దాడి చేసిందని గుర్తు చేశారు. వెనిజులా దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అరెస్ట్ చేసి బంధించిందన్నారు. ట్రంప్‌… కమ్యూనిస్టు దేశమైన క్యూబాను స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తుంటే, మరో దేశంలో భాగమైన గ్రీన్‌‌లాండ్‌‌ను నాకు కావాలని బరితెగించి అడుగుతుంటే, అలాంటి అమెరికా అధ్యక్షుడి పేరును హైదరాబాద్ రోడ్డుకు పెట్టడం భారత్‌‌కు, తెలంగాణకు అవమానకరమన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం చేసే పాపాలకు దేశ ప్రధాని, ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వంత పాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ అనే తేడా లేకుండా ట్రంప్ భజన చేయడం అన్యాయమని చెప్పారు. యుద్ధోన్మాది ట్రంప్‌ చర్యలకు వ్యతిరేకంగా అందరూ ముక్తకంఠంతో నినదించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి కోసం నిలబడాల్సిన ప్రస్తుత తరుణంలో ఒక రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టాలనే ఆలోచన సరికాదని హితవు పలికారు. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లిఖార్జున్, ఎస్వీ, రమ, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, ఎం. పద్మశ్రీ, కూరపాటి రమేష్, పుప్పాల శ్రీకాంత్, జి. కవిత, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు దశరథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రుద్రకుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, అజయ్ బాబు, జగదీష్, కిషన్, మహేందర్, రాములు, స్వరూప, ఎస్ఎస్ఆర్ఎ ప్రసాద్, కామేష్‌‌బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -