• మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి
నవతెలంగాణ -పెద్దవంగర
రైతులు వర్షాకాల విత్తన వేళలను సద్వినియోగం చేసుకొని పంటల సాగుకు సిద్ధం కావాలని మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్, సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తన వేళ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో విత్తనాలు వేయాలని తెలిపారు. రైతులు ధ్రువీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని, విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలని, యూరియా వినియోగం తగ్గించి, నానో యూరియా వినియోగం పెంచాలని సూచించారు.
అలాగే నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేపట్టడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చన్నారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న సూచనలు, సలహాలను పాటిస్తూ పంటల సాగు చేపట్టాలని కోరారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో బిల్లులు భద్రపరచుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు. కాగా ఈనెల 30 వరకు విత్తన వేళ నిర్వహిస్తారని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో యశస్విని, వార్డు సభ్యులు, ఎరువులు, విత్తన దుకాణాల నిర్వాహకులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.


