Tuesday, February 24, 2026
E-PAPER
Homeఖమ్మంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) పోరుబాట

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) పోరుబాట

- Advertisement -

మధిరలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం 
మోడల్ నియోజకవర్గం అంటే ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటమా? 
సీపీఐ(ఎం) మధిర  డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు 
నవతెలంగాణ – బోనకల్ 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోనే బోనకల్ మండల కేంద్రంలో గల వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం జొన్నలగడ్డ సునీత అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేయాలనే ధ్యాస తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుదాం అనేది లేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసంతో విజయం సాధించారని అది తమ ఘనకార్యంగా కాంగ్రెస్ భావిస్తుందని విమర్శించారు.

అధికారం పేరుతో ప్రజలను మోసం చేసి విజయం పొందారని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం అంటూ బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసి విజయం సాధించినట్లు కాంగ్రెస్ చెప్పుకోవటం సిగ్గు చోటు అన్నారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అన్నారు. మధిర పట్టణంలో అన్ని ప్రధాన రహదారులు సైడ్ డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. ప్రజలకు ఆశలు చూపించి గెలిచారని ఎద్దేవా చేశారు. తగిన సమయంలో తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఆయన హెచ్చరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాను చేసిన అభివృద్ధి తమ పార్టీని గెలిపించిందని చెప్పుకోవడం ఓ పెద్ద వింత అన్నాడు. అభివృద్ధి తప్ప నాకు మరొకటి లేదని మల్లు భట్టి విక్రమార్క చెప్పుకోవడం వింతగా ఉందన్నారు. మధిర నియోజకవర్గంలో ప్రజలకు ఉపాధి చూపించే ఏ ఒక్క పరిశ్రమ నిర్మించలేదని ప్రజల ఆర్థిక శక్తి పెంచకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో మల్లు భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కేవలం రోడ్లు వేయటం వలనే అభివృద్ధి చెందినట్లు కాదన్నారు. అభివృద్ధిలో రోడ్లు అనేవి ఓ చిన్న భాగం అన్నారు. ప్రధానమైన ప్రజా సమస్యలను పరిష్కారం చేయకుండా తామేదో మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించామని గొప్పలు చెప్పుకోవడం అనైతిక మన్నారు. అనేక రకాల సమస్యలకు మధిర మున్సిపాలిటీ నిలయంగా మారిందన్నారు. కోట్లాది రూపాయలతో మధిరను అభివృద్ధి చేస్తున్నానని మల్లు భట్టి విక్రమార్క పదేపదే ఒక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని శంకుస్థాపనలు తప్ప పనులు ప్రారంభం కానివి చాలా ఎక్కువ అన్నారు. మధిర పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన రోడ్లు, డ్రైనేజీలు అద్వానంగా ఉన్నాయన్నారు. మధిరను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటం అంటే ఎక్కడ సమస్యలు అక్కడే ఉండటమా అని ఆయన ప్రశ్నించారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసేది సీపీఐ(ఎం) మాత్రమే అన్నారు. ప్రజలు వాస్తవాలను గ్రహించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ప్రజలను తమకు మున్సిపాలిటీలో పట్టం కట్టకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీపీఐ(ఎం) నిత్యం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్, నాయకులు బంధం శ్రీనివాసరావు, కొమ్మినేని నాగేశ్వరరావు, కూచిపూడి మురళీకృష్ణ, తెల్లాకుల శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, పసుపులేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -