నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
ప్రతి ఓటునూ దగ్గరుండి మ్యాపింగ్ చేయించాలి :
బీఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్ పరిగిలో నియోజకవర్గ స్థాయి సమావేశం
నవతెలంగాణ- పరిగి
రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డల ఖాతాల్లో ఒకొక్కరికి రూ.లక్ష 50వేలు జమ చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ప్రతి ఓటునూ దగ్గరుండి మ్యాపింగ్ చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని ఎస్ గార్డెన్‌లో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కేసీఆర్ పరిగి వచ్చినప్పుడు ‘కాంగ్రెస్‌ను నమ్మొద్దు.. నమ్మి మోసపోతే గోస పడతారు’ అని చెప్పారని గుర్తు చేశారు. పరిగి అంటేనే రైతులు, రైతు బిడ్డలు ఉండే వ్యవసాయ ప్రాంతమని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. నాట్లు వేసేటప్పుడు రైతుబంధు పడేదని, కానీ ఈ ప్రభుత్వంలో ఎందుకు పడటం లేదని ప్రశ్నించారు. భూములకు పట్టాలిస్తామని చెప్పి, పారిశ్రామిక వాడ పేరుతో, రోడ్ల పేరుతో భూములు గుంజుకుంటున్నాడని ఆరోపించారు. ఉద్దండపూర్ ప్రాజెక్టు నుంచి కాలువలు తవ్వితే పరిగికి, కొడంగల్‌కి లక్ష ఎకరాలకు నీరు వచ్చే విధంగా అన్ని సిద్ధం చేశామని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే దాన్ని పక్కన పెట్టి కమీషన్ల కోసం రూ.4,400 కోట్లతో లిస్టు ఇరిగేషన్ తీసుకొచ్చాడని అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసే దమ్ము కాంగ్రెస్ వాళ్లకి లేదని అన్నారు. లగచర్లలో భూములి యమన్న పాపానికి గిరిజన ఆడపిల్లలపై దాడి చేసి, అవమానించి ఒక దుస్సాసన పర్వాన్ని సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. 36 మంది రైతులను జైల్లో పెట్టి హింసించారని ఆరోపించారు. కొడంగల్‌లో జరిగిన దుర్మార్గమే పరిగిలో కూడా జరుగుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల భూముల ను ఇష్టానుసారంగా గుంజుకుం టున్నారని, అసైన్డ్ భూములని ఇష్టారాజ్యంగా తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. పరిగిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే అని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రారంభమైందని అన్నారు. పరిగిలో ఇంకా 90వేల ఓట్లు మ్యాపింగ్ జరగాల్సి ఉందన్నారు. ఈ ఓట్లు ఎక్కడ మిస్ అయ్యాయో చూసి చేర్పించాలని సూచించారు. కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. తమ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారని తెలిపారు. పార్టీ అధికారం లోకి రావాలంటే కార్య కర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రి యల్ కారిడార్‌లో భూములు కోల్పోతున్న కాడ్లాపూర్ రైతులు కేటీఆర్‌కు వినతిపత్రం అందజే శారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, నరేందర్ రెడ్డి హాజరయ్యారు.



