Saturday, June 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రజా సమస్యలు అధ్యయనం చేసి ఉద్యమాలు చేపట్టాలి

ప్రజా సమస్యలు అధ్యయనం చేసి ఉద్యమాలు చేపట్టాలి

- Advertisement -

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న
పేద, మధ్య తరగతి ప్రజలు : సీపీఐ(ఎం)
కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య

నవతెలంగాణ-గార్ల
క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి నిరంతరం ఉద్యమాలు చేపట్టాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు సుంకరి వీరయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో జరుగుతున్న సీపీఐ(ఎం) జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతుల్లో రెండవ రోజున శుక్రవారం వీరయ్య ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలిచ్చి రెండున్నరేండ్లు గడిచినప్పటికీ, వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. దేశంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో విసిగిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, కానీ ఒక్క హామీని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు, తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పెన్షన్లు ఇస్తామన్న హామీలు అటకెక్కాయన్నారు. శాఖలస్థాయిలో స్థానిక సమస్యలను గుర్తించి ప్రజలను చైతన్యవంతం చేసి దశల వారీగా ఉద్యమాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ శిక్షణా తరగతులకు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, జిల్లా, మండల నాయకులు తదితరులు పా‌ల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -