Sunday, July 12, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రైతు డిస్కంకు గ్రీన్‌‌ సిగ్నల్‌

రైతు డిస్కంకు గ్రీన్‌‌ సిగ్నల్‌

- Advertisement -

లైసెన్స్ జారీ చేసిన
విద్యుత్ నియంత్రణ మండలి
నాలుగు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభం
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగింపు
మోటర్లకు మీటర్లుండబోవని స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఆర్‌‌పీడీసీఎల్‌)కు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌‌సీ) గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి శనివారం లైసెన్స్‌ జారీ చేసింది. మార్చ్ 19 న లైసెన్స్ కోసం టీజీఈఆర్‌‌సీకి రైతు డిస్కం దరఖాస్తు చేసింది. మే 29 న బహిరంగ విచారణ నిర్వహించిన ఈఆర్‌‌సీ… రైతు, ఉద్యోగ సంఘాలు, వినియోగదారుల సంస్థలు, విద్యుత్ రంగ నిపుణుల నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై కమిషన్ తన ఉత్తర్వుల్లో సమాధానాలు ఇచ్చింది. విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 14తో పాటు సెక్షన్ 131 ప్రకారం రైతు డిస్కంకు లైసెన్స్ మంజూరు చేస్తున్నట్టు పెర్కొంది. కొత్త డిస్కం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, సంయుక్త రక్షిత తాగునీటి పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, ప్రత్యేక పంపిణీ ట్రాన్స్‌ ‌ఫార్మర్ల ద్వారా విద్యుత్ పొందుతున్న మున్సిపల్ తాగునీటి కనెక్షన్లకు సేవలు అందించనుంది. నాలుగు నెలల తర్వాత కొత్త డిస్కం వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఈఆర్‌‌సీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టంలోని సెక్షన్ 131 ప్రకారం చట్టబద్ధమైన ట్రాన్స్‌ఫర్‌ స్కీమ్ ను జారీ చేసిన తర్వాతే లైసెన్స్ అమల్లోకి రానుంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం టీజీఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ చేసిన దరఖాస్తులను కూడా కమిషన్ ఆమోదించింది. రైతు డిస్కం కార్యకలాపాలు ప్రారంభమైన తేదీ నుంచి బదిలీ అయ్యే వినియోగదారులను ఈ రెండు డిస్కంల పరిధి నుంచి తొలగిస్తూ వాటి లైసెన్సులను సవరించింది. మిగతా వినియోగదారులకు సేవలు అందించే బాధ్యతలు, భౌగోళిక పరిధిలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది.

డిస్కం ఏర్పాటుపై ఈఆర్‌‌సీ మార్గదర్శకాలు…
సెక్షన్ 131 ప్రకారం ట్రాన్స్‌ఫర్‌ స్కీమ్ జారీ చేసి సంబంధిత ఆస్తులు, అప్పులు, వినియోగదారులను రైతు డిస్కంకు బదిలీ చేయాలని పేర్కొంది. 3 నెలల్లో లోడ్ అంచనాలు, లైన్ నష్టాల తగ్గింపు, ఇంటర్ఫేస్ మీటరింగ్, సిబ్బంది, ఆర్థిక అంశాలతో కూడిన సమగ్ర వ్యాపార ప్రణాళికను కమిషన్‌కు రైతు డిస్కం సమర్పించాలని ఈఆర్‌‌సీ ఆదేశించింది. మూడు డిస్కంల మధ్య ఆపరేషన్, మెయింటెనెన్స్, వినియోగదారుల డేటా బదిలీ, విద్యుత్ సరఫరా, ఎనర్జీ అకౌంటింగ్ తదితర అంశాలపై అవగాహన, సేవా, బల్క్ సప్లై ఒప్పందాలు కుదుర్చుకుని కమిషన్ ఆమోదానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ఈఆర్‌సీ పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సర మిగిలిన కాలానికి టారిఫ్, ప్రభుత్వ సబ్సిడీ పంపిణీపై డిస్కంలు కమిషన్‌‌ను 2026 నవంబర్ 30 లోపు సమర్పించాల్సి ఉంటుంది. రైతు డిస్కం రెండు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలను ఏర్పాటు చేయాలని తెలిపింది. అప్పటి వరకు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ ఫోరంలే బదిలీ అయ్యే వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తాయని పేర్కొంది. మార్పిడి ప్రక్రియలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సహా కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయరాదని వెల్లడించింది. రైతు డిస్కం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే వరకు రెండు డిస్కంలు యథావిధిగా దరఖాస్తులు స్వీకరించి కొత్త కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించింది. ఉద్యోగుల హక్కులు, సీనియారిటీ, పెన్షన్, రిజర్వేషన్ రోస్టర్, పదోన్నతి అవకాశాలకు ఎలాంటి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందనీ, భవిష్యత్‌‌లో కూడా ఈ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. వ్యక్తిగత వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉత్తర్వుల్లో నమోదు చేసింది. రైతు డిస్కం కూడా ఇతర డిస్కంల మాదిరిగానే టారిఫ్, సేవా ప్రమాణాలు, వినియోగదారుల హక్కులు, నివేదికల సమర్పణ తదితర అన్ని అంశాల్లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి పర్యవేక్షణలో పనిచేస్తుందని వెల్లడించింది.

నిర్వహణపై ఆందోళన…
కొత్త డిస్కం పరిధిలోని 29 లక్షలకుపైగా కనెక్షన్లు, 5.5లక్షల ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ కేవలం 2,000 మంది సిబ్బందితో సాధ్యం కాదని విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయం లేకుండా రైతు డిస్కం ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమని నిపుణులు అంటున్నారు. అలాగే ఉచిత విద్యుత్, వేల కోట్ల అప్పులతో రైతు డిస్కం ఎంత మేరకు సక్సెస్‌ అవుతుందో రాబోయే రోజుల్లో వెల్లడి కానుంది. ప్రభుత్వం మాత్రం రైతు డిస్కం ఏర్పాటును విద్యుత్ రంగ సంస్కరణగా ప్రచారం చేస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ఉచిత విద్యుత్‌కు ముప్పుగా అభివర్ణిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -