Sunday, July 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆ పథకం రద్దు యోచనను విరమించుకోవాలి

ఆ పథకం రద్దు యోచనను విరమించుకోవాలి

- Advertisement -

15 నుంచి 20 వరకు పోరాటాలు
తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప, రొయ్య పిల్లల పథకాన్ని రద్దు చేయాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్‌) డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసేలా నిర్ణయం తీసుకోవడం తగదని హెచ్చరించింది. మత్స్యకారుల న్యాయమైన హక్కుల సాధన కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉధృత పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎంకేఎంకేఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరెంకల నరసింహ, లెల్లెల బాలకృష్ణ సంబంధిత గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి బక్కి బాలమణి, తేలు ఇస్తారి, రాష్ట్ర కమిటీ సభ్యులు తడబోయిన కృష్ణమూర్తి, హైదరాబాద్ జిల్లా నాయకులు గులాబ్‌‌సింగ్‌, మహావీర్ సింగ్, మేడ్చల్ మల్కా‌జిగిరి జిల్లా ఉపాధ్యక్షురాలు కరిలి నవనీత, వెంకటరమణ, శ్రీనివాస్‌‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది (2026-27) ఉచిత చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం మత్స్య సొసైటీల ఖాతాల్లోనే నగదు జమ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మరణించిన 986 మంది మత్స్యకార కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈనెల 15 నుంచి 18 వరకు బైక్ ర్యాలీలు, ఈనెల 20న కలెక్టరేట్ల ముందు ధర్నాలు జయప్రదం చేయాలని మత్స్యకారులకు సూచించారు. మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాలను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం, అవినీతి లేకుండా నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకునే పూర్తి హక్కు మత్స్యకారులకే ఉండాలని అన్నారు. వారికి జీవిత భద్రతను కల్పించేందుకు ప్రమాద బీమా(ఇన్సూరెన్స్)ను రూ. 20 లక్షలకు పెంచాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -